వారణాసిలో మోడీ సభకు అనుమతి నిరాకరణపై ఆగ్రహం
వారణాసి: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం వారణాసిలోని బెనియాబాగ్‌లో తలపెట్టిన బహిరంగ సభకు.. మత ఘర్షణల వల్ల భద్రతా సమస్యలు తలెత్తే కారణాలరీత్యా రిటర్నింగ్ అధికారి అనుమతి నిరాకరించడం రాజకీయ దుమారం రేపింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఏకంగా ఎన్నికల కమిషన్ (ఈసీ)ని ఢీకొనేందుకు సిద్ధమైంది. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా మేజిస్ట్రేట్ ప్రాంజల్ యాదవ్‌ను తక్షణమే తొలగించకుంటే బలప్రదర్శనకు దిగుతామని బుధవారం ఈసీకి రాసిన మూడు వేర్వేరు లేఖల్లో బీజేపీ నేత అరుణ్‌జైట్లీ హెచ్చరించారు.
గురువారం బెనారస్ హిందూ వర్సిటీ వద్ద అమిత్ షా ఇతర నేతలతో కలిసి ధర్నా చేస్తామని, ఢిల్లీలోని ఈసీ కార్యాలయం వద్ద కూడా తమ నేతలు ధర్నాకు దిగుతారన్నారు. రిటర్నింగ్ అధికారి పక్షపాత వైఖరిని అడ్డుకోకుండా ఈసీ ప్రేక్షకపాత్ర పోషించిందన్నారు. ‘ఉన్నత స్థానాల్లో బలహీన వ్యక్తు లు కూర్చున్నప్పుడు ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుంది’ అని ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసీ వైఖరికి నిరసనగా గురువారం వారణాసిలో మోడీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే దేవ్‌రాయ్ ఇప్పటికే ధర్నా ప్రారంభించారు. కాగా, తాము పక్షపాతంతో వ్యవహరించలేదని ఈసీ స్పష్టం చేసింది.
ఈసీతో బీజేపీ ఢీ!
Published Thu, May 8 2014 3:45 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement