జైట్లీకి సిద్ధూ గురు దక్షిణ
పంజాబ్‌లోని అమృతసర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తన తరఫున అక్కడి సిటింగ్ ఎంపీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ప్రచారం చేస్తారా? లేదా అన్న ప్రశ్నకు జైట్లీ జవాబివ్వలేకపోతున్నారు. సిద్ధూ ప్రచారం చేయబోనని నేరుగా చెప్పనప్పటికీ.. అమృతసర్ స్థానాన్ని తన గురువు జైట్లీ కోసం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని గతంలో ఓసారి ప్రకటించారు. అయితే, అమృతసర్ మినహా మరెక్కడి నుంచీ పోటీ చేయనని కూడా చెప్పారు. దాంతో అమృతసర్ టికెట్ ఇవ్వకపోవడంపై సిద్ధూ అసంతృప్తితో ఉన్నాడన్న ప్రచారం సాగుతోంది. దానికి తోడు ‘జైట్లీ తరఫున సిద్ధూ ప్రచారం చేయబోర’ని సిద్ధూ భార్య కూడా ప్రకటించడం జైట్లీని మరింత ఇరకాటంలో పెడుతోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ జైట్లీపై సెటైర్లు వేస్తున్నారు.
‘వార్‌రూమ్’కు ప్రియాంక
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టాలని పార్టీ నేతలు చాన్నాళ్లుగా కోరుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. పార్టీ సీనియర్ నేత జనార్దన్ ద్వివేదీ ఈ విషయం వెల్లడించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు ఎన్నికల ప్రచారంలో బిజిగా ఉండటం వల్ల.. పార్టీ వ్యూహాలకు, కీలక చర్చలకు వేదికైన వార్ రూమ్ బాధ్యతలను ఇప్పటికే ప్రియాంక తీసుకున్నారని చెప్పారు. దాంతోపాటు రాజీవ్‌గాంధీ బతికున్న రోజుల్లో.. పార్టీలో ప్రియాంక గాంధీ చేపట్టాలని కోరుకున్న బాధ్యతల గురించి తనతో ఒకసారి చెప్పారని, ఆ విషయాలను త్వరలో వెల్లడిస్తానని ద్వివేదీ తెలిపారు. ఇప్పటి వరకు సోనియా, రాహుల్‌ల నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీల్లో ప్రచార కార్యక్రమాలకు మాత్రమే ఆమె పరిమితమయ్యారు.
మోడీపై ‘ఓటు’వీరుడి పోటీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీకి గెలుపెరుగని ‘ఓటు’వీరుడు వదోదరా స్థానం నుంచి బరిలోకి దిగారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ కె.పద్మరాజన్ వదోదరా నుంచి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడులోని టైర్ల కంపెనీ యజమాని అయిన పద్మరాజన్‌కు ఎన్నికలు కొత్త కాదు. హోమియో వైద్యంలో డిగ్రీ పూర్తిచేసిన ఆయన, ప్రస్తుతం 159వసారి ఎన్నికల్లో తలపడుతున్నారు. వివిధ ఎన్నికల్లో ఇదివరకు 158 సార్లు పోటీచేసినా, ఎన్నడూ గెలుపొందిన పాపాన పోలేదు. అయితే, పాతికేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నానని, ఎక్కువసార్లు ఎన్నికల్లో పోటీచేసినందుకు ప్రపంచ రికార్డు సాధించాలనే ఉద్దేశంతోనే తాను బరిలోకి దిగుతున్నట్లు ఈ ‘ఓటు’వీరుడు చెబుతున్నారు. పద్మరాజన్‌కు ఇదివరకు మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి వారిపై పోటీ చేసిన ఘనమైన రికార్డు ఉంది.
‘వారసత్వాని’కే మన ఓటు
ఎన్నికల్లో ఓటేయడానికి ‘వారసత్వాన్ని’ భారతీయులు ఒక అర్హతా భావిస్తారా?, వారసత్వ రాజకీయాల పట్ల భారతీయులకు విముఖత లేదా?.. ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెబుతోంది అమెరికాలోని ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ సంస్థ. భారత్‌లో ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ ఆశ్యర్యకర ఫలితాలు తేలాయట. 46% ప్రజలు వారసత్వ నేతలకే పట్టం కడతామని స్పష్టంచేశారట. అంటే దాదాపు ఇద్దరిలో ఒకరు కుటుంబ రాజకీయాలకు మద్దతిస్తున్నారన్న మాట. రాజకీయ నేపథ్యం ఉన్న వారికి సమర్థతతో పాటు గెలిచే అవకాశాలూ ఎక్కువగా ఉంటాయని, అందుకే వాళ్లకు ఓటేస్తామని మరికొందరు చెప్పారట.
కొసమెరుపేమిటంటే.. ఈ ఎన్నికల్లో మాత్రం వారసత్వమే అర్హతగా కలిగిన రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు మాత్రం విజయావకాశాలు ఏమాత్రం లేవని, ఈసారికి బీజేపీ వైపే మొగ్గుందని ఆ సర్వేలో తేలిందట.
ఎన్నికల ప్రచారానికి నేతలు రె'ఢీ'
Published Sat, Apr 5 2014 1:50 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement