ఈసీతో మో‘ఢీ’
* వారణాసిలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రోడ్‌షో
* తాము కోరుకున్న చోట సభ పెట్టుకునేం దుకు నిరాకరించటంపై ఆగ్రహం
* రిటర్నింగ్ అధికారి ప్రాంజాల్యాదవ్ను తప్పించాలని బీజేపీ డిమాండ్
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో తాము కోరుకున్న ప్రాంతంలో ఎన్నికల సభ నిర్వహించుకునేందుకు అక్కడి ఎన్నికల అధికారి తనకు అనుమతి నిరాకరించటం పట్ల కేంద్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ యుద్ధం ప్రకటించారు. ఈసీ ఎవరి ఒత్తిడితోనో పనిచేస్తోందని, తనపట్ల వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ.. గురువారం వారణాసిలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మరీ రోడ్‌షో నిర్వహించారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మోడీ ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలోని హెలీపాడ్‌లో దిగారు.
అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని బీజేపీ ప్రధాన ఎన్నికల కార్యాలయం వరకూ అనుమతి లేకుండా రోడ్‌షో నిర్వహిస్తూ వెళ్లారు. దారిపొడవునా కాషాయ టోపీలు ధరించిన కార్యకర్తలు మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని.. ఆ పార్టీని ఈసీ గెలిపించజాలదని వ్యాఖ్యానించారు. తాము కోరిన ప్రదేశంలో సభ నిర్వహణకు అనుమతించకపోవటానికి భద్రతా కారణాలను చూపించటం గురించి మాట్లాడుతూ.. ‘‘నా భద్రత గురించి ప్రభుత్వానికి ఆందోళన అక్కర్లేదు.. నేను నా దేశం కోసం చనిపోవటానికి సిద్ధం. అయినా ఇది నా ప్రజాస్వామిక హక్కుల మీద దాడి’’ అని పేర్కొన్నారు. రోడ్‌షో అనంతరం మోడీ సిగ్రాలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మేధావులతో ఆంతరంగికంగా సమావేశమయ్యారు.
అలాగైతే ఎన్నికలు నిర్వహించకండి: జైట్లీ
అరుణ్‌జైట్లీ, అమిత్‌షా సహా బీజేపీ సీనియర్ నేతలు గురువారం ఉదయం నుంచీ వారణాసిలో బెనారస్ విశ్వవిద్యాలయం ఎదుట, ఢిల్లీలో ఈసీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి.. తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఈసీని ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘భద్రత కల్పించలేకపోతే ఎన్నికలు నిర్వహించకండి’’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. వారణాసి రిటర్నింగ్ అధికారి ప్రాంజాల్యాదవ్ను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. వారణాసి నగరంలో సీఆర్పీసీలోని 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలను జారీ చేసినట్లు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (అదనపు కలెక్టర్) ఎం.సి.సింగ్ తెలిపారు.
ఎవరికీ భయపడం: సీఈసీ
మోడీ పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నామన్న బీజేపీ ఆరోపణలను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ తీవ్రంగా ఖండించారు. ఆయన ఢిల్లీలో సహచర ఎన్నికల కమిషనర్లతో కలసి మీడియాతో మాట్లాడారు. వారణాసి రిటర్నింగ్ అధికారి ప్రాంజాల్‌యాదవ్ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. ఆయనను తొలగించాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చారు. ఇటీవలి కాలంలో ఈసీ కఠిన నిర్ణయాలు తీసుకున్నపుడల్లా ఈ రాజ్యాంగ సంస్థపై విమర్శల దాడులు పెరుగుతుండటం, చాలా కఠినమైన వ్యాఖ్యలు, ఏకపక్ష ఆరోపణలు చేయటం గమనించామన్నారు.
తమ విధి నిర్వహణలో ఎవరికీ, ఏ రాజకీయ పార్టీకీ, మరే సంస్థకూ భయపడబోమని స్పష్టంచేశారు. రాజకీయ పార్టీలు పరిపక్వతతో వ్యవహరించాలని హితవుపలికారు. ఇదిలావుంటే.. యూపీలో సీఎం అఖిలేష్‌యాదవ్, అరవింద్ కేజ్రీవాల్‌లకు సభల నిర్వహణకు అనుమతి ఇచ్చిన రిటర్నింగ్ అధికారి.. నరేంద్రమోడీ సభకు అనుమతి ఇవ్వకపోవటం వివక్షాపూరితమని, ఆయనను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎం.వెంకయ్యనాయుడు నేతృత్వంలో బీజేపీ నేతల బృందం గురువారం ఢిల్లీలో సీఈసీని కలిసి ఫిర్యాదు చేసింది.
ఇదీ వివాదం...
వారణాసిలో మతపరంగా సున్నితప్రాంతమైన బేనియాబాగ్లో మోడీ ప్రచార సభ నిర్వహించేందుకు బీజేపీ అనుమతి కోరగా.. ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీంతో వేరే ప్రదేశంలో మోడీ సభను నిర్వహించుకునేందుకు బీజేపీ అనుమతి కోరగా ఈసీ అనుమతులు మంజూరు చేసింది. అయితే.. బీజేపీ ఆ తర్వాత ఆ అనుమతులన్నిటినీ తిరస్కరిస్తూ తాము తొలుత కోరిన బేనియాబాగ్లోనే సభ నిర్వహిస్తామని పట్టుపట్టింది. ఇందుకు ఈసీ నిరాకరించటంతో ఆ సంఘంపై బీజేపీ నాయకత్వం తీవ్రంగా విరుచుకుపడుతోంది.
ఐఐటీ గ్రాడ్యుయేట్ ప్రాంజాల్‌యాదవ్
ఈ నెల 12న పోలింగ్ జరగనున్న వారణాసిలో బీజేపీ పట్టుపట్టిన ప్రాంతంలో నరేంద్రమోడీ సభ నిర్వహణకు అనుమతి నిరాకరించిన జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రాంజాల్‌యాదవ్ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా వార్తల్లోకెక్కారు. 34 ఏళ్ల ప్రాంజాల్‌యాదవ్ ఐఐటీ గ్రాడ్యుయేట్. తీర్థయాత్రా క్షేత్రమైన వారణాసికి కొత్త రూపు నిచ్చేందుకు కృషి చేస్తున్నారన్న పేరు ఆయనకు ఇప్పటికే ఉంది. గత ఏడాది వరదల సందర్భంగా నిర్విరామంగా గంటల తరబడి పనిచేశారన్న ఖ్యాతీ ఉంది. తాజాగా మోడీ సభ వివాదంలో ఆయనపై ఇటు రాజకీయ రంగంలోనూ, అటు సామాజిక వెబ్సైట్లలోనూ విమర్శలు, ప్రశంసలూ సమానంగా వచ్చాయి.
ఈసీ నన్ను ఇబ్బంది పెడుతోంది
‘‘ఈసీ నన్ను, మా పార్టీనీ ఇబ్బంది పెడుతోంది. మోడీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో.. బీజేపీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో ఈసీ చెప్పాలి. నాకు చాలా ఇబ్బంది కలిగింది. కానీ ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదు. నేను ఈసీని లక్ష్యంగా చేసుకోలేదు. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. .... ప్రియాంకాగాంధీ ‘నీచ రాజకీయాలు’ అన్న విమర్శలను కులంపై చేసిన విమర్శగా ఎందుకు అన్నానంటే.. నాకు బాగా తెలిసిన గుజరాతీ భాషలో ఆ మాటకు దగ్గరదగ్గరగా అటువంటి అర్థం వస్తుంది.’’
- టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో నరేంద్రమోడీ