మోడీతో పెట్టుకున్న ప్రాంజల్ యాదవ్
వారణాసి: ఐఏఎస్ అధికారి ప్రాంజల్ యాదవ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఢీకొట్టి ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు. వారణాసిలో మోడీ ఎన్నికల ర్యాలీకి అనుమతి నిరాకరించడం ద్వారా ఆయన దేశం దృష్టిని ఆకర్షించారు. బీజేపీ నాయకులు ఎంతగా ఒత్తిడి తెచ్చినా ఆయన వెనక్కు తగ్గలేదు. దీంతో వారణాసి రిటర్నింగ్ అధికారిగా ఉన్న యాదవ్పై కాషాయ దళాలు దాడికి దిగాయి. ఆయన ములాయం బంధువని, అందుకే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కొత్త రాగం అందుకున్నారు.
ములాయంతో యాదవ్కు ఎలాంటి బంధుత్వంలేదని సమాజ్వాది పార్టీ తెలిపింది. యాదవ్ కులానికి చెందిన ప్రతిఒక్కరు ములాయంకు బంధువులు కాదంటూ గట్టిగా చెప్పింది. పక్షపాత వైఖరి ప్రదర్శించిన ప్రాంజల్ యాదవ్ను తొలగించాలని బీజేపీ సీనియర్ నాయకులు అరుణ్ జైట్లీ, అమిత్ షా డిమాండ్ చేశారు. ఆయన నేతృత్వంలో వారణాసిలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ఆరోపించారు. కాగా ప్రాంజల్ యాదవ్కు కేంద్ర ఎన్నికల సంఘం బాసటగా నిలిచింది. ఆయనను తొలగించాలన్న బీజేపీ డిమాండ్ను తోసిపుచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా యాదవ్ మంచి అధికారి అంటూ కితాబిచ్చారు.
1980లో జన్మించిన ప్రాంజల్ యాదవ్ 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రూర్కీ ఐఐటీ నుంచి ఐఐటీ చేశారు. వారణాసికి వచ్చే ముందు అజాంగఢ్ డీఎంగా పనిచేశారు. ఆక్రమణలు తొలిగించి, రోడ్లు వెడల్పు చేయడం ద్వారా ప్రజల అభిమానాలను చూరగొన్నారు. తన సర్వీసులో ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం విశేషం. ఇప్పుడు మోడీకి 'నో' చెప్పి వార్తల్లో నిలిచారు. మోడీతో పెట్టుకున్న ప్రాంజల్ యాదవ్ మున్ముందు ఎలాంచి సంచలనాలకు కేంద్ర బిందువు కానున్నారో చూడాలి.