న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఫొటోలున్న బోర్డింగ్ పాస్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వరంగ ఎయిరిండియా ప్రకటించింది. ఎన్నికల వేళ ప్రధానితోపాటు గుజరాత్ సీఎం ఫొటోలుండటంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నేతల ఫొటోలున్న బోర్డింగ్ పాస్‌లపై పంజాబ్ మాజీ డీజీపీ శశికాంత్ ట్విట్టర్‌లో అభ్యంతరం తెలిపారు. ‘ఈ రోజూ న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎయిరిండియా జారీ చేసిన బోర్డింగ్ పాస్‌పై వైబ్రంట్ గుజరాత్ నినాదంతోపాటు ప్రధాని, గుజరాత్ సీఎం ఫొటోలున్నాయి.
ఎన్నికల సమయంలో ఇటువంటి వాటిని చూడలేని, వినలేని, మాట్లాడలేని ఎన్నికల సంఘంపై ప్రజాధనం వృథాగా ఖర్చు చేయడం ఎందుకు?’ అని ప్రశ్నిస్తూ బోర్డింగ్ పాస్ ఫొటోను జత చేశారు. దీనిపై ఎయిరిండియా అధికార ప్రతినిధి ధనంజయ్ కుమార్ స్పందిస్తూ ‘ప్రధాని మోదీ, గుజరాత్ సీఎంల ఫొటోలతో ఉన్న బోర్డింగ్ పాస్‌లను వెనక్కి తీసుకోవాలని మా సంస్థ నిర్ణయించింది. ఆ పాస్‌లను జనవరిలో వైబ్రంట్ గుజరాత్ సమిట్ సందర్భంగా జారీ చేయగా మిగిలిపోయినవి అని భావిస్తున్నాం. వేరే సంస్థ వ్యాపార ప్రకటనలో భాగంగా వాటిని ఆవిధంగా ముద్రించి గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ఉపయోగిస్తున్నాం. వాటి జారీని కొనసాగించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని తేలితే వెనక్కి తీసుకుంటాం’ అని వివరించారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాల అధికారులకు ఆదేశాలిచ్చి నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment