విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ | Delhi budget gives power subsidy | Sakshi
Sakshi News home page

విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ

Published Sat, Jul 19 2014 3:02 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM

విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ - Sakshi

విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ

పార్లమెంట్‌లో ఢిల్లీ బడ్జెట్
రాష్ర్టపతిపాలన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం ఉదయం లోక్‌సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.36,776 కోట్ల వ్యయంతో కూడిన ఈ బడ్జెట్‌లో కొత్తగా పన్ను ప్రతిపాదనలేమీ చేయలేదు. అదేవిధంగా కొత్త పథకాలను కూడా ప్రకటించలేదు. 400 యూనిట్ల్ల వరకు విద్యుత్‌ను వినియోగించేవారికి సబ్సిడీ ప్రకటించారు. ఢిల్లీ శాసనసభకు ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశముండడంతో ఆర్థిక మంత్రి పేదలపై ప్రధానంగా దృష్టి సారించారనే విమర్శలు వెల్లువెత్తాయి.  
 
సాక్షి, న్యూఢిల్లీ: రూ.36,776 కోట్ల ఖర్చుతో  బడ్జెట్ ప్రతిపాదించిన ఆర్థికమంత్రి రూ. 31,571 కోట్లు పన్నుల ద్వారా లభించే ఆదాయంగా రూ. 11,061 కోట్లు  ఇతర వన రుల నుంచి  లభించే ఆదాయంగా  699.71 కోట్లు, కేపిటల్  రెసీట్ల ద్వారా రూ. 3,672.09 కోట్లు కేంద్రం నుంచి లభిస్తాయని అంచనా వేశారు.కాగా బడ్జెట్ ప్రతిపాదనల పట్ల కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులు తమ అభ్యంతరాలను తర్వాత వ్యక్తం చేయొచ్చని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పడంతో వారు శాంతించారు. తాను ప్రస్తుతం బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని, దానిపై తర్వాత చర్చ జరుగుతుందని జైట్లీ వివరించారు.  

 పేదలపై దృష్టి
పన్ను రాయితీల వంటి ప్రతిపాదనలతో సాధారణ  బడ్జెట్‌లో  మధ్యతరగతివారిపై వరాలు కురిపించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలోని పేదలపై ప్రధానంగా దృష్టి సారించారు. తక్కువ విద్యుత్‌ను వినియోగించేవారికి రూ. 260 కోట్ల రూపాయల సబ్సిడీ ప్రకటించడంతో పాటు బలహీనవర్గాల కోసం ఇళ ్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద ప్రభుత్వం 54,064 ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, ఇందులో 14, 844 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ఆర్థిక మంత్రి సభకు తెలి యజేశారు. మిగతా వాటి త్వరలో పూర్తిచేస్తామన్నా రు. కొత్తగా 20 ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు.

దీంతోపాటు ప్రతి విధానసభ  నియోజక వర్గంలో బాలికల కోసం ప్రభుత్వ ఉన్నతపాఠశాలలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం మూడు లక్షల 90 వేల మందికి వృద్ధాప్య పింఛన్లు లభిస్తున్నాయని, వాటిని నాలుగు లక్షల 30 వేలకు పెంచుతున్నట్లు జైట్లీ ప్రతిపాదించారు. ఇవికాకుండా ఇంకా నైట్‌షెల్టర్లు, జేజే క్లస్టర్లలో కమ్యూనిటీ టాయిలెట్ల ఏర్పాటు ప్రతిపాదనలు చేశారు. మురుగుదొడ్లు లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడమేకాకుండా, మహిళల భద్రతకు ముప్పు ఉంటుందని, అందువల్ల జేజేక్లస్టర్లలో కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం కోసం రూ. 35 కోట్లను కేటాయించనున్నట్టు తెలిపారు. గత బడ్జెట్‌కంటూ దాదాపు ఇది రెట్టింపుగా ఉంది. 50అధికార కాలనీలకు పైపులైన్ల ద్వారా నీరందిస్తామన్నారు. 95 అనధికార కాలనీలలో సీవేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు ఈ కాలనీలలో ప్రాథమిక సదుపాయాల కల్పన కోసం రూ.711 కోట్లు కేటాయించారు. కాగా అనధికార కాలనీల్లో 40 లక్షల మంది నివసిస్తున్నారు.
 
తగ్గనున్న విద్యుత్ చార్జీల భారం
ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం పార్లమెం టులో ప్రవేశపెట్టిన ఢిల్లీ బడ్జెట్... తక్కువ విద్యుత్ ఉపయోగించేవారికి ఊరట ఇచ్చింది. నగరంలో విద్యుత్ చార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో పేదలకు ఊరట కోసం రూ. 260 కోట్ల రూపాయల సబ్సిడీ ప్రకటించారు. 0 -200 యూనిట్ల  వరకు  యూని ట్‌కు రూ.1.20,. 201-400 యూనిట్ల వరకు 80పైసల సబ్సిడీని ప్రతిపాదించారు. దీనితో ఢిల్లీలో 0-200 యూనిట్ల వరకు యూనిట్‌కు  రూ 2.80 చొప్పున, 201-400 స్లాబ్‌వారు యూనిట్‌కు రూ.5.15 చొప్పున విద్యుత్ చార్జీలను చెల్లించాల్సిఉంటుంది. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చార్జీలను తొలగించడంతోపాటు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన సబ్సిడీ వల్ల 400 యూనిట్ల వరకు విద్యుత్ ఉపయోగించేవారికి మున్ముందు బిల్లులు తగ్గనున్నాయి.
 
విద్య, వైద్యంపై పెద్దగా దృష్టిసారించని బడ్జెట్:
అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నగరంలో విద్య, వైద్య సదుపాయాల కల్పనపై పెద్దగా దృష్టిసారించలేదనివిమర్శలను ఎదుర్కొంది. రోహిణిలో వైద్య కళాశాల, దక్షిణ ఢిల్లీలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు, 110 కొత్త అంబులెన్స్‌లను ప్రవేశెపెట్టడం, 50 డయాలిసిస్ సెంటర్ల ఏర్పాటుచేయడం వంటి  ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఢిల్లీ జనాభాను  బట్టి చూస్తే  తక్కువేననే  విమర్శలొచ్చాయి. వైద్య రంగం కోసం బడ్జెట్ రూ.2,724 కోట్లు కేటాయించింది. నగరంలో లైంగిక దాడులు నానాటికీ పెరుగుతున్నందున, బాధితుల కోసం ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వన్‌స్టాప్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ సెంటర్లను ఏర్పాటుచేయాలని బడ్జెట్ ప్రతిపాదించింది.

మొదటగా దీన్‌దయాళ్  ఉపాధ్యాయ, గురుతేజ్ బహదూర్ ఆసుపత్రి, సంజయ్‌గాంధీ మెమోరియల్ ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటుచేస్తారని, మూడు నెలల్లో పనిచేయడం ప్రారంభిస్తాయని జైట్లీ ప్రకటించారు. ఈ సెంటర్లలో బాధితులకు వైద్య సహా యం తోపాటు చ ట్టపరమైన, మానసికపరమైన, సామాజికపరమైన కౌన్సెలింగ్ అందజేస్తారు. రోహిణిలో 100 సీట్ల వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీలో విద్యార్థులు చేరవచ్చని ఆర్థికమంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగంలో సరైన వైద్య సదుపాయాలు లేని దక్షిణ ఢిల్లీలో అత్యాధునిక మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు. మూత్ర పిండా లు పనిచేయని రోగుల కోసం 50 డయాలిసిస్ కేంద్రాలను కొత్తగా ప్రారంభిస్తారు. నగరంలో రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరిగి పోతున్న నేపథ్యంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన 11 ‘ఐక్యాట్’ అంబులెన్సులను ప్రవేశపెడతారు.  
 
విద్యుత్ రంగానికి ప్రతిపాదనలు:

తక్కువ విద్యుత్ వినియోగించే పేద వినియోగదారులకు రూ.260 కోట్ల సబ్సిడీని ప్రకటించడంతోపాటు ఇంధన రంగం కోసం రూ.670 కోట్ల ప్రణాళికా నిధులు కేటాయించారు. ట్రాన్స్‌మిషన్  వ్యవస్థను, డిస్ట్రిబ్యూషన నెట్‌వర్క్‌ను మెరుగపరచనున్నటు బడ్జెట్ల్ పేర్కొంది. ఢిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్ హర్షవిహార్‌లో ఏర్పాటుచేసిన 400 కేవీ సబ్‌స్టేషన్, పీరాఘడీలో ఏర్పాటుచేసిన 220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ సబ్‌స్టేషన్లు పనిచేయడం ప్రారంభిస్తాయని పేర్కొంది. పపన్‌కలాన్, రాజ్‌ఘాట్ పవర్‌హౌజ్, తుగ్లకాబాద్‌లలో 220 కేవీ జిఐఎస్ సబ్‌స్టేషన్ల  నిర్మాణాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తారు. బవానాలోని 1,500 మెగావాట్ల గ్యాస్ టర్బైన్ స్టేషన్‌కు సరసమైన ధరకు గ్యాస్ సరఫరా అయ్యేవిధంగా చూస్తారు. ఎన్‌డీఎంసీ ప్రాంతాన్ని సోలార్ సిటీగా అభివృద్ధి చేస్తారు.
 
రవాణా రంగం:

రవాణా రంగం కోసం రూ.1702 కోట్లు కేటాయించారు. నగరవాసుల సౌకర్యార్థం కొత్తగా 1,380 లోఫ్లోర్ బస్సులను కొనుగోలు చేస్తారు.  తెలిపింది. డీటీసీ బస్సుల్లో ఎలక్ట్రానిక్ టికెట్ యంత్రాలు, కార్డు రీడర్లను ప్రవేశపెడతారు. తద్వారా ఆటోమాటిక్‌గా చార్జీలను వసూలుచేసే వ్యవస్థను ప్రవేశపెడ్తారు. కొత్తగా 400 బస్సులతో క్లస్టర్ బస్సుల సంఖ్యను 1,600కు పెంచుతారు.ట్రాన్స్‌పోర్ట్ డిపో ప్రాంతీయ కార్యాలయాలను ఆధునీకరించి, పునరుద్ధరిస్తారు. ఐఎస్‌బీటీ సరాయ్‌కాలేఖాన్, ఐఎస్‌బీటీ ఆనంద్‌విహార్‌లో మౌలిక వసతులు తగినంత లేవని ఈ బడ్జెట్ పేర్కొంది. ఈ రెండు చోట్ల కొత్త ఐఎస్‌బీటీలను అభివృద్ధి చేస్తారు. రూ.533 కోట్ల ఖర్చుతో కూడిన బారాపులా రెండో దశ నిర్మా ణం ప్రస్తుతం కొనసాగుతుంది. మూడోదశలో దీనిని  సరాయ్‌కాలేకాన్ నుంచి మయూర్ విహార్ వరకు పొడిగిస్తారు.
 
నీటి సరఫరా రంగం:
హర్యానాతో కొనసాగుతున్న నీటి  వివాదాలను పరిష్కరించి మునాక్‌నుంచి హైదర్‌పూర్ వరకు సమాంతరంగా నిర్మించిన కాలువను వాడకంలోకి తెస్తారు. దీని వల్ల ద్వారకా, ఓఖ్లా, బవానా వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు రోజుకు 80 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుంది. దీంతో దక్షిణ, పశ్చిమ, నైరుతి, వాయవ్య ఢిల్లీలో నివసించే 35 లక్షల మందికి నీటి సమస్య తీరుతుంది. 50 కోట్ల రూపాయల తొలి విడత కేటాయింపుతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రేణుకా డ్యామ్ నిర్మాణపని ప్రాధాన్యతాపరంగా ప్రారంభిస్తారు. రూ.2018 కోట్లతో చంద్రావల్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను, రూ. 2243 కోట్లతో వజీరాబాద్ ప్లాంటును పూర్తిగా పునరుద్ధరించి ఆధునీకరిస్తారు. గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి కోసం రూ. 215 కోట్ల రూపాయలు కేటాయించారు. బడ్జెట్‌తో ఢిల్లీవాసులకు ఎంతో ఊరట లభించే అవకాశముందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ పేర్కొన్నారు. అయితే ఇది దశాదిశా లేని బడ్జెటని కాంగ్రెస్ విమర్శించింది.
 
ముఖ్యాంశాలు

  •      రూ. 36,776 కోట్ల బడ్జెట్
  •      కొత్త పన్నులు లేవు
  •      ప్రస్తుతమున్న పన్ను రేట్లను పెంచలేదు
  •      తక్కువ విద్యుత్‌ను వినియోగించేవారికోసం రూ. 260 కోట్ల సబ్సిడీ
  •      0-200 యూనిట్ల వరకు రూ.1.20 సబ్సిడీ  
  •      రోహిణీలో అత్యాధునిక వైద్య కళాశాల
  •      110 కొత్త అంబులెన్స్‌లు
  •      వర్కింగ్ ఉమెన్ కోసం ఆరు కొత్త హాస్టళ్లు
  •      1,380  కొత్త లోఫ్లోర్ బస్సులు
  •      కొత్తగా 20 పాఠశాలల ఏర్పాటు
  •      4 లక్షల 30 వేల మందికి వృద్ధాప్య పింఛన్లు
  •      కొత్త నైట్‌షెల్టర్ల ఏర్పాటు
  •      నీటి కోసం ఏటీఎంలు
  •      పేదలకు ఇళ్లు, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద 58, 064 ఇళ్లను ఢిల్లీ సర్కారు నిర్మిస్తోంది.
  •      కొత్త స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ సెంటర్ ఏర్పాటు
  •      లైంగిక దాడి బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్  
  •      మానసిక వికలాంగుల కోసం మూడు కేంద్రాలు
  •      జేజేక్లస్టర్లలో కమ్యూనిటీ టాయిలెట్లు
  •      నాలుగు సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు
  •      50 అనధికార కాలనీల్లో నీటి సదుపాయం కోసం పైపులైన్ల నిర్మాణం
  •      95 అనధికార కాలనీల్లో సీవేజ్ సిస్టం
  •      రెండు నీటిశుద్ధీకరణ కేంద్రాల ఏర్పాటు

 
ఎన్నికల హామీలకు తిలోదకాలు: అరవింద్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ బడ్జెట్‌లో ఎన్నికల హామీలను బీజేపీ తిలోదకాలిచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. 30 శాతం విద్యుత్ సబ్సిడీ ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొందని, అయితే బడ్జెట్‌లో దానిని అమల్లోకి తీసుకురాలేదని విమర్శించారు. ధరల పెరుగుదలనుంచి ప్రజలకు ఊరట కల్పించడం కోసం బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయలేదంటూ ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలో విద్యుత్ సరఫరా మెరుగుకోసం ఎలాంటి చర్యలు చేపడతారనే విషయాన్ని కూడా తెలియజేయలేదన్నారు. ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు  నీరిందించేందుకు సంబంధించిన ప్రతిపాదనలేమీ లేవన్నారు. ద్వారకా వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ సంగతి పట్టించుకోకుండా కొత్తగా రెండు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలో ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. దేశ రాజధానివాసుల సమస్యలు బీజేపీ నాయకులకు అర్థం కావని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మాదిరిగానే ఉందని ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు మనీష్ సిసోడియా ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement