
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్ టేకోవర్‌కు ముందుకొచ్చిన ఎస్సెల్ గ్రూపు తీరుపై తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు అసలు టేకోవర్‌పై ముందుకు వెళతారా లేదా పక్కకు తప్పుకుంటారో తేల్చి చెప్పాలని ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల యాజమాన్యపు హక్కులపై అభ్యంతరాలు తెలపటంపై పత్రికా ప్రకటనల జారీకి అనుమతినివ్వాలన్న ఎస్సెల్ గ్రూప్ అభ్యర్థన ను తోసిపుచ్చింది. ఈ దశలో ప్రకటనల జారీకి అనుమతినివ్వలేదని స్పష్టం చేసింది. అభ్యంతరాలను కోరితే పరిస్థితి జటిలమై కేసు పురోగతికి తీవ్ర అడ్డంకిగా మారుతుందని పేర్కొంది. కంపెనీ ఆస్తి, అప్పుల మదింపు ప్రక్రియ తరువాత కావాలంటే పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవచ్చునని తెలిపింది.
పత్రికా ప్రకటన జారీకి అనుమతినివ్వని పక్షంలో ముందుకెళ్లడం కష్టసాధ్యమని ఎస్సెల్ గ్రూపు పేర్కొనటంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసింది. టేకోవర్‌పై ఏదో ఒకటి తేల్చి చెప్పాలని సూచించింది. ఒకవేళ తప్పుకోవాలని భావిస్తే తదుపరి విచారణ కంటే ముందే మెమో రూపంలో తెలియచేయాలని ఆదేశించింది. దాని ఆధారంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఆస్తుల వేలం ప్రక్రియను కొనసాగిస్తామంది. అగ్రిగోల్డ్ ఆస్తులు మాత్రమే తీసుకుంటారా? లేక కంపెనీలు మాత్రమే టేకోవర్ చేస్తారా? లేక అన్నీ కలిపి తీసుకుంటారా? అనే విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టతనివ్వాలని ఎస్సెల్ గ్రూపును ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 18వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల కేసులో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలన్న ఎస్సెల్ గ్రూపు తరఫు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం వినతిని ఈ సందర్భంగా ధర్మాసనం ఆమోదించింది.
అగ్రిగోల్డ్ యజమానులను కలిసేందుకు సీఏలకు అనుమతి
మరోవైపు ఏలూరు జైల్లో ఉన్న అగ్రిగోల్డ్ యజమానులను కలిసేందుకు కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్లను అనుమతించాలని జైలు అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఇదిలా ఉండగా అక్షయ గోల్డ్ కేసు జనవరి 18కి వాయిదా పడింది. డిపాజిటర్లకు ఎలా చెల్లిస్తారు? ఎవరు చెల్లిస్తారు? తదితర వివరాలను తదుపరి విచారణ నాటికి తమ ముందుంచాలని అక్షయ గోల్డ్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment