క్రికెట్‌లో మరో కొత్త లీగ్ !
* ఇండియన్ చాంపియన్‌స లీగ్ పేరుతో సన్నాహకాలు
* ఇంకా లభించని ఐసీసీ అనుమతి
న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం క్రితం ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) పేరుతో ఎస్సెల్ గ్రూప్ చేసిన హడావిడి గుర్తుందిగా! పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్ళతో పాటు కొత్తగా రిటైరైన స్టార్లతో జరిగిన ఆ లీగ్ కొద్ది రోజులు వార్తల్లో నిలిచింది. అయితే ఐసీసీ, బీసీసీఐ దీనిని గుర్తించడానికి నిరాకరించడంతో లీగ్‌ను నిర్వాహకులు రద్దు చేయక తప్పలేదు. ఆ తర్వాత మొదలైన ఐపీఎల్ ప్రభంజనం ఎలా సాగుతుందో మనకు తెలుసు. ఇప్పుడు మరోసారి కొత్తగా భారత్‌లో ప్రైవేట్ క్రికెట్ లీగ్‌కు రంగం సిద్ధం అవుతోంది.
ఇండియన్ చాంపియన్‌స లీగ్ (ఐసీఎల్) టి20 పేరుతో ఈ కొత్త టోర్నీ రానుంది. మ్యాగ్‌పై అనే సంస్థ ఈ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థలో భాగస్వామి అయిన మనీశ్ కుమార్ చౌదరి ఐసీఎల్ వివరాలను వెల్లడించారు. ఎనిమిది జట్లతో దుబాయ్‌లో ఐసీఎల్ నిర్వహించాలని భావిస్తున్నారు. డిసెంబర్ 25నుంచి జనవరి 25 మధ్య మొత్తం 47 మ్యాచ్‌లు జరుగుతాయి. ఢిల్లీ బాద్షా, ఇండోర్ రాకెట్స్, ముంబై స్టార్, చెన్నై వారియర్స్, హైదరాబాద్ రైడర్స్, బెంగళూర్ టైగర్స్, లక్నో సూపర్ స్టార్, చండీగఢ్ హీరోస్ అనే జట్ల పేర్లు ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్నాయి. ఇంకా అధికారికంగా ఖరారు కాకపోయినా... రవి బొపారా, డస్కటే, సీన్ విలియమ్స్, పార్నెల్, జయసూర్య, వాస్, కనేరియా, సల్మాన్ బట్‌లతో నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అటు వైపు వెళ్లవద్దు...
ఐసీఎల్ టోర్నీకి ఐసీసీనుంచి ఎలాంటి అనుమతి లేదు. అరుుతే తాము ఇప్పటికే టోర్నీ గుర్తింపు కోసం ప్రయత్నాలు ప్రారంభించామని, త్వరలోనే దుబాయ్‌లో ఐసీసీతో సమావేశం అవుతామని నిర్వాహకులు చెబుతున్నారు. మరో వైపు కొత్త లీగ్‌లో సంతకాలు చేసి తమ కెరీర్‌ను పాడు చేసుకోవద్దని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య (ఫికా) ఆటగాళ్లను హెచ్చరించింది. ఐసీఎల్ టి20కి ఇంకా ఐసీసీ గుర్తింపు లేదని, అలాంటి చోట ఆడటం నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేసింది. అరుుతే కొంత మంది ఆటగాళ్లు కూడా గత ఐసీఎల్ అనుభవంతో ఇలాంటి ప్రైవేట్ లీగ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.