Indian Cricket League
-
క్రికెట్లో మరో కొత్త లీగ్ !
* ఇండియన్ చాంపియన్స లీగ్ పేరుతో సన్నాహకాలు * ఇంకా లభించని ఐసీసీ అనుమతి న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం క్రితం ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) పేరుతో ఎస్సెల్ గ్రూప్ చేసిన హడావిడి గుర్తుందిగా! పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్ళతో పాటు కొత్తగా రిటైరైన స్టార్లతో జరిగిన ఆ లీగ్ కొద్ది రోజులు వార్తల్లో నిలిచింది. అయితే ఐసీసీ, బీసీసీఐ దీనిని గుర్తించడానికి నిరాకరించడంతో లీగ్‌ను నిర్వాహకులు రద్దు చేయక తప్పలేదు. ఆ తర్వాత మొదలైన ఐపీఎల్ ప్రభంజనం ఎలా సాగుతుందో మనకు తెలుసు. ఇప్పుడు మరోసారి కొత్తగా భారత్‌లో ప్రైవేట్ క్రికెట్ లీగ్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఇండియన్ చాంపియన్స లీగ్ (ఐసీఎల్) టి20 పేరుతో ఈ కొత్త టోర్నీ రానుంది. మ్యాగ్‌పై అనే సంస్థ ఈ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థలో భాగస్వామి అయిన మనీశ్ కుమార్ చౌదరి ఐసీఎల్ వివరాలను వెల్లడించారు. ఎనిమిది జట్లతో దుబాయ్‌లో ఐసీఎల్ నిర్వహించాలని భావిస్తున్నారు. డిసెంబర్ 25నుంచి జనవరి 25 మధ్య మొత్తం 47 మ్యాచ్‌లు జరుగుతాయి. ఢిల్లీ బాద్షా, ఇండోర్ రాకెట్స్, ముంబై స్టార్, చెన్నై వారియర్స్, హైదరాబాద్ రైడర్స్, బెంగళూర్ టైగర్స్, లక్నో సూపర్ స్టార్, చండీగఢ్ హీరోస్ అనే జట్ల పేర్లు ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్నాయి. ఇంకా అధికారికంగా ఖరారు కాకపోయినా... రవి బొపారా, డస్కటే, సీన్ విలియమ్స్, పార్నెల్, జయసూర్య, వాస్, కనేరియా, సల్మాన్ బట్లతో నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అటు వైపు వెళ్లవద్దు... ఐసీఎల్ టోర్నీకి ఐసీసీనుంచి ఎలాంటి అనుమతి లేదు. అరుుతే తాము ఇప్పటికే టోర్నీ గుర్తింపు కోసం ప్రయత్నాలు ప్రారంభించామని, త్వరలోనే దుబాయ్‌లో ఐసీసీతో సమావేశం అవుతామని నిర్వాహకులు చెబుతున్నారు. మరో వైపు కొత్త లీగ్‌లో సంతకాలు చేసి తమ కెరీర్‌ను పాడు చేసుకోవద్దని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య (ఫికా) ఆటగాళ్లను హెచ్చరించింది. ఐసీఎల్ టి20కి ఇంకా ఐసీసీ గుర్తింపు లేదని, అలాంటి చోట ఆడటం నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేసింది. అరుుతే కొంత మంది ఆటగాళ్లు కూడా గత ఐసీఎల్ అనుభవంతో ఇలాంటి ప్రైవేట్ లీగ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. -
కొత్త కుంపటి సాధ్యమా?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు పోటీగా ఒక కొత్త సంస్థ తయారు కాబోతోందని, ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో ఒక కంపెనీ పేరును రిజిస్టర్ చేసి క్రికెటర్లను సంప్రదిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. గతంలో ఇండియన్ క్రికెట్లీగ్ (ఐసీఎల్) నిర్వహించిన సుభాష్ చంద్ర దీని వెనక ఉన్నారని ప్రచారం జరుగుతోంది. క్రికెట్లో అత్యంత శక్తివంతమైన ఐసీసీ, బీసీసీఐలని కాదని కొత్త కుంపటి సాధ్యమేనా? సాక్షి క్రీడావిభాగం : ప్రస్తుతం క్రికెట్‌ను పూర్తిగా నియంత్రిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇందులో కీలకం. మిగిలిన టెస్టు దేశాల దగ్గర పెద్దగా ఆదాయం, పవర్ లేదు. కాబట్టి ఈ మూడు దేశాలదే పూర్తిగా ఐసీసీలో ఇష్టారాజ్యం. పాకిస్తాన్‌తో పాటు దక్షిణాఫ్రికా లాంటి క్రికెట్ బోర్డులకు ఇది పెద్దగా రుచించని అంశం. అయినా ఐసీసీతో జగడానికి దిగలేరు. కారణం... ఆ దేశాల్లో ఉన్న మార్కెట్ నుంచి వచ్చే ఆదాయం స్వల్పం. ఐసీసీ నుంచే వాటా రావాలి. కాబట్టి మిగిలిన దేశాలన్నీ ఐసీసీ ఏం చెప్పినా తలూపడం తప్ప మరేం చేయలేవు. క్రికెట్ చాలా పెద్ద వ్యాపారం. ప్రతి ఏటా వేల కోట్ల టర్నోవర్ ఉంటుంది. టీవీల ద్వారా వచ్చే ఆదాయం ఒక్క ఐసీసీకే ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల పైన ఉంటుంది. మిగిలిన దేశాలన్నీ వాళ్ల క్రికెట్‌ను భారీ రేట్లకే అమ్ముకుంటాయి. ముఖ్యంగా భారత్‌లో క్రికెట్ ప్రసారం కోసం టీవీ సంస్థలు బాగా పోటీ పడతాయి. ప్రస్తుతం స్టార్ సంస్థ భారత్‌లో అన్ని మ్యాచ్‌లతో పాటు ఐసీసీ మ్యాచ్‌ల ప్రసార హక్కులను తమ ఖాతాలో వేసుకుంది. ఒక్క ఐపీఎల్ మినహా ప్రధాన క్రికెట్ అంతా స్టార్ గ్రూప్ దగ్గరే ఉంది. 2018 నుంచి ఐపీఎల్ కూడా స్టార్ ఖాతాలోకి వస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇంతగా గుత్తాధిపత్యం ఒక్క సంస్థకే ఉంటే మిగిలిన వాళ్ల పరిస్థితి ఏమిటి. దీంట్లోంచి పుట్టిన ఆలోచన రెబల్ లీగ్. అంత సులభం కాదు... ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారం కొత్త సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని క్రికెటర్లతో ఒప్పందాలు చేసుకుని ఒక టి20 లీగ్ నిర్వహించాలని భావిస్తోంది. ఇది జరగాలంటే ముందు క్రికెటర్లు అంగీకరించాలి. ముఖ్యంగా భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా దేశాల్లోని ప్రస్తుత జాతీయ జట్లలో ఉన్న క్రికెటర్లు ముందుకు రావాలి. ధోని, కోహ్లి, స్మిత్, వాట్సన్, మెకల్లమ్, గేల్... ఇలా పెద్ద ఇమేజ్ ఉన్న క్రికెటర్లు భారీ సంఖ్యలో కొత్త సంస్థతో చేరాలి. ఏ క్రికెటర్ అయినా ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ దేశ బోర్డు నుంచి వేటు పడుతుంది. అయినా సిద్ధమై భారీ మొత్తానికి ఆశపడి ముందుకు వచ్చినా కొత్త కుంపటి ఎంతకాలం ఉంటుందనే సందేహం వస్తుంది. కాబట్టి క్రికెటర్లు అంత తొందరగా రిస్క్ చేయరు. గతంలో ఐసీఎల్ సమయంలో డబ్బుకి ఆశపడి కొంతమంది యువ క్రికెటర్లు బయటకు వెళ్లి కెరీర్‌ను కోల్పోయారు. ఇది కొత్తేం కాదు... క్రికెట్ పాలకులకు పోటీగా కొత్తగా టోర్నీలు నిర్వహించడం ఇప్పుడు కొత్తేం కాదు. గతంలో 1970వ దశకంలో వరల్డ్ సిరీస్ క్రికెట్ నిర్వహించారు. అలాగే 2007 నుంచి 2009 వరకు ఐసీఎల్ నిర్వహించారు. కానీ ఇవేవీ మార్కెట్లో నిలబడలేకపోయాయి. నిజానికి 2007లో సుభాష్ చంద్ర ఐసీఎల్ ప్రారంభించినప్పుడు... భారత్‌లో అదే మొదటి టి20 లీగ్. తొలి ఏడాది ఈ మ్యాచ్‌లకు అభిమానులు పోటెత్తారు. నిజానికి పెద్ద పేరున్న క్రికెటర్ల సంఖ్య స్వల్పంగానే ఉన్నా ఆదరించారు. అయితే 2008లో బీసీసీఐ ఐపీఎల్ ప్రారంభించింది. ఐసీఎల్, ఐపీఎల్ రెండూ ఒకే మాదిరి లీగ్‌లు. ఐపీఎల్ అధికారిక లీగ్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లంతా ఇందులో ఆడేందుకు క్యూ కట్టారు. దీంతో ఈ లీగ్ సూపర్ హిట్టయింది. పెద్ద క్రికెటర్లు ఉన్న లీగ్ అందుబాటులోకి రావడంతో సహజంగానే ఐసీఎల్పై ఆసక్తి తగ్గిపోయింది. క్రమంగా ఆ లీగ్ కనుమరుగైంది. ఎంతమంది వస్తారు? ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు వివిధ దేశాల్లోని టి20 లీగ్‌ల ద్వారా పెద్ద క్రికెటర్లందరికీ భారీగా ఆదాయం వస్తోంది. లీగ్‌లు, ఎండార్స్మెంట్లు కలిపి సాధారణ క్రికెటర్ కూడా ఏడాదికి నాలుగైదు కోట్లు సంపాదిస్తున్న పరిస్థితి. ఒకవేళ కొత్త సంస్థ 10 రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చేందుకు ముందుకొచ్చినా క్రికెటర్లు ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ కెరీర్ చివరి దశలో ఉన్న వాళ్లు ముందుకొచ్చినా... యువ క్రికెటర్లు ఆసక్తి చూపించకపోవచ్చు. స్టార్ క్రికెటర్లు లేకుండా ఏ లీగ్ కూడా ముందుకు సాగదు. సుదీర్ఘ ప్రక్రియ... ఒకవేళ ఎవరైనా ఐసీసీకి పోటీగా కొత్త సంస్థను ప్రారంభించాలంటే చాలా సమయం పడుతుంది. రాత్రికి రాత్రే ఇది సాధ్యం కాదు. ఇదో సుదీర్ఘ ప్రక్రియ. ప్రతి దేశంలోనూ సొంత స్టేడియాలు కావాలి. ప్రతిదేశంలో తమ ప్రతినిధులు ఉండాలి. ప్రతి రాష్ట్రంలోనూ క్రికెటర్లను తయారు చేయాలి. వీళ్లందరికీ సుదీర్ఘ కాలం ఆర్ధిక భద్రత కల్పించాలి. ఇవన్నీ చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. క్రికెట్ మార్కెట్ మీద ఇంత భారీగా పెట్టుబడి పెట్టడం లాభదాయకమైన ఆలోచన కాదు. -
ఐసీఎల్తోనే మొదలు!
ఫిక్సింగ్ గుట్టు విప్పిన విన్సెంట్ వెల్లింగ్టన్: మ్యాచ్ ఫిక్సింగ్‌తో జీవిత కాల నిషేధానికి గురైన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ తాను ఫిక్సింగ్ ఉచ్చులో ఎలా పడ్డాడనే దానిపై తొలి సారి పెదవి విప్పాడు. ప్రస్తుతం మనుగడలో లేని ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)తోనే ఇది మొదలైందని చెప్పాడు. ‘ఐసీఎల్ కోసం ఇండియా వెళ్లాక ఒక వ్యక్తి తనను తాను స్పోర్ట్స్ మేనేజర్‌గా పరిచయం చేసుకొని తన కిట్ వాడకం గురించి డీల్ చేద్దామని పిలిచాడు. అతని రూమ్‌కు వెళితే ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె ఆటగాళ్లకు ఎర వేసే ‘హనీ ట్రాప్’ అని నాకు అర్థమైంది. నేను స్పందించకపోవడంతో డాలర్ల కట్టలు నా ముందుంచాడు’ అని విన్సెంట్ వివరించాడు. అయితే ఈ ఘటన గురించి తాను ‘హీరో’గా అభిమానించే మరో ఆటగాడికి చెప్పేందుకు వెళ్లానని, కానీ ఆయన కూడా ప్రోత్సహించడంతో కాదనలేకపోయానని... ఆ తర్వాతా ఫిక్సింగ్‌ను కొనసాగించానని వెల్లడించాడు. -
ఐబీఎల్-2 వాయిదా!
జనవరికి మార్చే అవకాశం న్యూఢిల్లీ: ప్రారంభమైన తొలి ఏడాదే సూపర్ సక్సెస్ సాధించినా.. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్‌ను ఈ ఏడాది నిర్వహించే అవకాశాలు దాదాపు లేనట్లుగానే కనిపిస్తోంది. గత ఏడాది ఆగస్టులో ఆరంభ టోర్నీ నిర్వహించిన భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఐబీఎల్-2ను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించాలని భావించింది. కానీ, పలు అంతర్జాతీయ టోర్నీల కారణంగా దీన్ని వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. జూలైలో కామన్వెల్త్ క్రీడలు, సెప్టెంబర్‌లో ఆసియా క్రీడలు జరగనున్న నేపథ్యంలో పలువురు అగ్రశ్రేణి క్రీడాకారులు ఐబీఎల్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని, దీంతో టోర్నీకి గ్లామర్ తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినా.. వచ్చే ఏడాది ఆరంభంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు బాయ్ ఉపాధ్యక్షుడు టీపీఎస్ పురి తెలిపారు.