అగ్రిగోల్డ్‌తో అగ్లీ గేమ్స్‌! | Essel Group steps back from buying AgriGold | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌తో అగ్లీ గేమ్స్‌!

Published Fri, Apr 13 2018 2:13 AM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM

Essel Group steps back from buying AgriGold - Sakshi

సాక్షి, అమరావతి :  అగ్రిగోల్డ్‌ ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వేస్తున్న ఎత్తులు డిపాజిటర్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ఇన్నాళ్లూ అగ్రిగోల్డ్‌ సంస్థను స్వాధీనం చేసుకుని (టేకోవర్‌ చేసి) డిపాజిటర్లకు న్యాయం చేస్తామని నమ్మబలుకుతూ వచ్చిన ఎస్సెల్‌ గ్రూప్‌.. ఒక్కసారిగా మాట మార్చడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ రూ.4,262 కోట్లకు మించదని.. డిపాజిటర్లకు రూ.పది వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఆ సంస్థను టేకోవర్‌ చేయడం  తమకు గిట్టుబాటు కాదని ఎస్సెల్‌ గ్రూప్‌ తేల్చిచెప్పింది. ఇదే క్రమంలో అగ్రిగోల్డ్‌ సంస్థ భూములను అభివృద్ది చేసి, విక్రయించడం ద్వారా డిపాజిటర్లకు న్యాయంచేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో మాజీ ఎంపీ అమర్‌ సింగ్‌ చర్చలు జరుపుతున్నారని.. ఆ చర్చల ఫలితాలు వెల్లడయ్యే వరకూ గడువు ఇవ్వాలని ఎస్సెల్‌ గ్రూప్‌ హైకోర్టును కోరింది.

ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వాటిలో విలువైన ఆస్తులను కాజేయడం, ఇప్పటికీ స్వాధీనం చేసుకోని వేలాది కోట్ల విలువ చేసే ఆస్తులను అప్పనంగా కొట్టేసే ఎత్తుగడలో భాగంగానే ఎస్సెల్‌ గ్రూప్‌తో కొత్త నాటకానికి తెరతీయించారనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.  హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ముసుగులో ఈనెల 3, 4న ఢిల్లీలో పర్యటించిన చంద్ర బాబు.. తాను బసచేసిన ఏపీ భవన్‌లోనే అమర్‌సింగ్, ఎస్సెల్‌ గ్రూప్‌ సంస్థ ప్రతినిధులతో రహస్యంగా చర్చలు జరపడం వీటికి బలం చేకూర్చుతోంది.

ముఖ్యనేత గుప్పెట్లో..: అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందిస్తూ.. రిటైర్డు జడ్జి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసి, ఆ సంస్థకు చెందిన స్థిర, చరాస్తులను వేలం వేసి, వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్‌ యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా సీఐడీ విభాగాన్ని నిలువరించిన ప్రభుత్వ పెద్దలు.. ఉద్దేశపూర్వకంగా విలువైన ఆస్తులను, జప్తు చేయని వేలాది ఎకరాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

గుంటూరు జిల్లాలో 85.13 ఎకరాల్లో విస్తరించిన హాయ్‌ల్యాండ్, విశాఖ యారాడ సముద్రతీరంలో 106.44 ఎకరాల్లో నిర్మించిన రిసార్టుపై ముఖ్యనేత కన్నేశారు. అందుకే వేలం వేసే ఆస్తుల జాబితా నుంచి వాటిని తప్పించారని డిపాజిటర్లు ఆరోపిస్తున్నారు. అలాగే.. హైకోర్టు నేతృత్వంలో నిర్వహించే వేలం ప్రక్రియకు సహకరించకుండా సర్కార్‌ పెద్దలు చక్రం తిప్పారు.

దీంతో చంద్రబాబు దన్నుతో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలూ చెలరేగిపోయారు. ఆ సంస్థల ఆస్తులపై కన్నేశారు. కేసు నమోదై 21 నెలలు గడుస్తున్నా అగ్రిగోల్డ్‌ యాజమాన్యాన్ని అరెస్టు చేయకపోవడంపై హైకోర్టు తప్పుబట్టడంతో గత్యంతరంలేక ఐదుగురిని అరెస్టుచేశారు. కీలకమైన అవ్వా సీతారాంతోపాటూ 24 మంది డైరెక్టర్లను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం గమనార్హం.

బిగ్‌బాస్‌..అదిరిపోయే ప్లాన్‌: ఆస్తుల వేలం ప్రక్రియను హైకోర్టు కొనసాగిస్తున్న క్రమం లో.. విలువైన ఆస్తులు చేజారిపోతాయని గ్రహించిన ముఖ్యనేత  పావులు కదిపారు. ఈ క్రమంలోనే అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేసుకుని డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు ఎస్సెల్‌ గ్రూప్‌ ముందుకొచ్చిందంటూ ఓ వర్గం మీడియాకు లీకులు ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సెల్‌ గ్రూప్‌ తరపున మాజీ ఎంపీ అమర్‌సింగ్‌ సీఎం చంద్రబాబుతో రాయ‘బేరాలు’ జరిపారు.

అనంతరం అగ్రిగోల్డ్‌ సంస్థను తాము టేకోవర్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. డిపాజిటర్లకు చెల్లించేందుకు రూ.రెండు వేల కోట్లను డిపాజిట్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్సెల్‌ గ్రూప్‌ హైకోర్టుకు విన్నవించింది. మరోవైపు.. దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌కు 18,395.74 ఎకరాల భూమి, 95,157.07 చదరపు గజాల అత్యంత విలువైన స్థలాలు ఉన్నట్లు సీఐడీ తేల్చింది. ఈ ఆస్తుల విలువ పది వేల కోట్లకుపైగా ఉంటుందని లెక్కకట్టింది.

కానీ.. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ రూ.35 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. కాగా, అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు వడ్డీతో సహా చెల్లించాల్సింది రూ.పది వేల కోట్లలోపే ఉంటుందని సీఐడీ అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేసిన సంస్థకు భారీఎత్తున లాభాలు వస్తాయని ఆర్థిక నిపుణులు స్పష్టీకరించారు. కానీ.. ఎస్సెల్‌ గ్రూప్‌ కొత్త పల్లవి అందుకుంది. ఆర్థికంగా గిట్టుబాటు కాదంటూ హైకోర్టుకు ఇటీవల నివేదించింది.

ఆస్తుల విలువ అంటే రూ.4,262 కోట్లలో కేవలం 40 శాతం నిధులను డిపాజిటర్లకు ఇచ్చేందుకు డిపాజిట్‌ చేయగలమని ఓవైపు చెప్పిన ఎస్సెల్‌ గ్రూప్‌.. మరోవైపు అగ్రిగోల్డ్‌ ఆస్తులను అభివృద్ధి చేసి, విక్రయించడం ద్వారా డిపాజిటర్లకు న్యాయం చేసే ప్రతిపాదనపై మాజీ ఎంపీ అమర్‌సింగ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని పేర్కొంది. ఆ చర్చల ఫలితాలు వెల్లడయ్యే వరకూ గడువు ఇవ్వాలని హైకోర్టును కోరడం గమనార్హం.

రహస్య ఒప్పందంలో భాగంగానే..
అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువను ఎస్సెల్‌ గ్రూప్‌ కొద్ది నెలల్లోనే రూ.4,262 కోట్లకు తగ్గించి చూపడంపై సీఐడీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. సీఎంతో కుదిరిన రహస్య ఒప్పందంలో భాగంగానే ఈ  విలువను ఎస్సెల్‌ గ్రూప్‌ తగ్గించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అగ్రిగోల్డ్‌కు చెందిన  విలువైన భూములను తక్కువ ధరకు పొందేందుకు వాటి విలువను తక్కువగా చూపించారనే విమర్శలున్నాయి. కృష్ణా జిల్లా కీసరలో 324.06 ఎకరాల భూమిని ఓ మంత్రి, నూజివీడు మండలం రామన్నగూడెంలో 110.65 ఎకరాల విలువైన భూమిని మరో కీలక మంత్రి, వీరుపాలడు మండలం చింతవరంలో 54.67 ఎకరాల భూమిని కేంద్ర మాజీమంత్రి ఒకరు తక్కువ ధరకు కాజేసేందుకే వేలం ప్రక్రియను అడ్డుకున్నారని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.


చంద్రబాబు హయాంలోనే ప్రారంభం
రాష్ట్రంలో 1995లో అగ్రిగోల్డ్‌ సంస్థ పురుడుపోసుకుంది. దీని అక్రమాలను ఆదిలోనే పసిగట్టిన సెబీ (సెక్యూరిటీ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) తక్షణమే లావాదేవీలు నిలిపేయాలంటూ మార్చి 31, 1998న నోటీసులిచ్చింది. నాటి చంద్రబాబు ప్రభుత్వాన్నీ అప్రమత్తం చేసింది. అప్పటికి అగ్రిగోల్డ్‌ సేకరించిన డిపాజిట్లు రూ.13.50 కోట్లే.  సెబీ మార్గదర్శకాల మేరకు చంద్రబాబు అగ్రిగోల్డ్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి దన్నుగా నిలిచారు. 83 అనుబంధ సంస్థల పేర్లతో 2004 నాటికే రూ.6,500 కోట్లకుపైగా డిపాజిట్లను సేకరించింది. 2014 నాటికి డిపాజిట్లు 6,850 కోట్లకు చేరుకున్నాయి.

డిపాజిటర్లకు గడువు మీరినా చెల్లింపులు చేయకపోవడంతో అలజడి మొదలైంది. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం డిపాజిట్లు చెల్లించడంలేదని ఓ డిపాజిటర్‌ ఫిర్యాదు చేయడంతో డిసెంబర్‌ 24, 2014న నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. దీంతో అగ్రిగోల్డ్‌ ఆస్తులు తమ చెప్పుచేతల్లో నుంచి వెళ్లకుండా ఉండేందుకు జనవరి 5, 2015న రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అనంతరం రాష్ట్ర పరిధిలోని 16,857.81 ఎకరాల భూమిని మాత్రమే జప్తుచేస్తూ ఫిబ్రవరి 20, 2015న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

రాష్ట్రంతోపాటూ కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో అగ్రిగోల్డ్‌ అనుబంధ సంస్థలు, ఆ సంస్థల డైరెక్టర్లు డిపాజిటర్ల నుంచి సేకరించిన నిధులతో వ్యక్తిగత పేర్లపై కొన్న ఆస్తులను జప్తు చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి.. వాటిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. 1998లో సెబీ ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్‌పై చర్యలు తీసుకుని ఉంటే అక్రమాల పర్వం రూ.13.50 కోట్లకే పరిమితమయ్యేది. కానీ,  చర్యలు తీసుకోకుండా ఆ సంస్థకు అండగా నిలబడటంవల్లే  లక్షలాది మంది డిపాజిటర్లకు అన్యాయం జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement