కార్వీ ట్రేడింగ్‌లో 40 శాతం యాప్‌తోనే  | Online-based investment growth | Sakshi
Sakshi News home page

కార్వీ ట్రేడింగ్‌లో 40 శాతం యాప్‌తోనే 

Published Sat, Jan 19 2019 12:53 AM | Last Updated on Sat, Jan 19 2019 12:53 AM

Online-based investment growth - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫైనాన్షియల్‌ బ్రోకరేజ్‌ కంపెనీ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ మొత్తం ఆదాయంలో కార్వీ ఆన్‌లైన్‌ ట్రేడ్‌ మొబైల్‌ యాప్‌ వాటా 40 శాతం వరకూ ఉంటుందని కంపెనీ సీఈఓ రాజీవ్‌ సింగ్‌ చెప్పారు. 2017–18 ఆర్ధిక సంవత్సరంలో 34 శాతం ఆదాయ వృద్ధిని సాధించామని.. అయితే ఈ సారి కాస్త తగ్గి 22 శాతానికి పరిమితం కావచ్చని చెప్పారాయన. శుక్రవారమిక్కడ ‘ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటర్జీ రిపోర్ట్‌’ను విడుదల చేస్తూ ఆయన విలేకరులతో మాట్లాడారు.  ‘‘ఇన్వెస్టర్ల ప్రొఫైల్‌ మారింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా పెట్టుబడులు పెడుతున్నారు. గత రెండేళ్లుగా ఆన్‌లైన్, యాప్‌ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్స్‌ పెరిగాయి. ఇందులో యువతరమే కీలకం. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 40 శాతం ఆన్‌లైన్‌ మీడియం ద్వారా జరుగుతున్నదే. అందుకే రెండేళ్ల క్రితమే ట్రేడింగ్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. యాప్‌ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్లకు తక్కువ ధర ఉండటమే కాకుండా లావాదేవీల్లో పారదర్శకత, సౌలభ్యంగా కూడా ఉంటుంది’’ అని ఆయన వివరించారు.  

కార్వీకి 10 లక్షల మంది కస్టమర్లు.. 
‘‘ప్రస్తుతం దేశంలో కార్వీకి 60 కార్యాలయాలున్నాయి. త్వరలోనే కొత్తగా తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఆఫీసులను ప్రారంభించనున్నాం. ఐటీ, ఫార్మా, ఆటో, మెటల్‌ అన్ని రంగాల్లో కలిపి మాకు 10 లక్షల మంది కస్టమర్లున్నారు. ఇక నుంచి కార్వీ పెట్టుబడులు ఎక్కువగా టెక్నాలజీ, రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ రంగాల మీద ఉంటాయి. ఇదే మా కస్టమర్లకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం కార్వీలో 800 మంది ఈక్విటీ అడ్వైజర్స్‌ ఉన్నారు. 2019–20 నాటికి వెయ్యికి చేరుస్తాం. గతంలో సంస్థాగత పెట్టుబడిదారుల కోసం రీసెర్చ్‌ బృందం ముంబై కేంద్రంగా పనిచేసేది. కానీ, ఇప్పుడు హైదరాబాద్‌లోనూ సొంత పరిశోధన బృందం ఉంది. 2017–18లో 20 మందితో మొదలైన రీసెర్చ్‌ టీమ్‌లో ప్రస్తుతం 55 మంది ఉన్నారు.         2019–20 నాటికి 70 మందికి చేర్చుతాం’’ అని రాజీవ్‌ తెలిపారు.  

అయితే నిఫ్టీ 14 వేలు.. లేకపోతే 9 వేలకు! 
2019 క్యాలెండర్‌ ఇయర్‌ను రెండు సమాన అర్ధ భాగాలు చేస్తే.. మొదటి ఆరు నెలల్లో కేంద్రం, రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా మార్కెట్లపై ప్రభావం ఉంటుందని, రెండో అర్థ భాగంలో ఒకవేళ కేంద్రంలో మళ్లీ స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నిఫ్టీ 14,000 పాయింట్లను దాటుతుందని.. ఒకవేళ రానిపక్షంలో 9,000 పాయింట్లకు పడిపోతుందని కార్వీ విడుదల చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటర్జీ రిపోర్ట్‌ తెలిపింది. ‘‘మళ్లీ కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం వస్తే భౌతిక సంస్కరణలుంటాయి. వ్యవసాయ, కార్మిక, స్థల లావాదేవీల్లో పన్ను సంస్కరణలుంటాయి. దీంతో స్థిరమైన ఆర్ధిక ప్రగతి చేకూరుతుంది. ఇది సంస్థాగత, వ్యక్తిగత ఇన్వెస్టర్లను మార్కెట్‌ వైపు దృష్టి మళ్లించేలా చేస్తుందని’’ రాజీవ్‌ సింగ్‌ చెప్పారు.  

2019లోనూ ఆటో రివర్స్‌ గేరే: 2019లోనూ ఆటో పరిశ్రమ తిరోగమనంలోనే పయనించే సూచనలు కనిపిస్తున్నాయని.. అయితే ఈ రంగంలో కంపెనీలు టెక్నాలజీ వృద్ధి, విస్తరణలపై దృష్టిపెట్టే అవకాశముందని తెలిపారు. 2018 మార్చిలో 11.5 శాతంగా ఉన్న బ్యాంక్‌ల నిరర్ధక మూలధన ఆస్తులు (ఎన్‌పీఏ)లు.. 2018 సెప్టెంబర్‌ నాటికి 10.8 శాతానికి తగ్గాయి. 2019 మార్చి నాటికి ఇవి 10.3 శాతం వరకు తగ్గొచ్చని ఇది ఆర్ధిక వ్యవస్థకు, మార్కెట్‌కు ఎంతగానో ఉపయుక్తమని తెలియజేశారు. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు బెటరని సూచించారు. క్యాపిటల్‌ గూడ్స్‌ సెక్టార్, ఐటీ, ఫార్మా రంగాలు కూడా మంచి ఎంపికేనన్నారు. అధిక వడ్డీ రేట్లతో అమెరికా, ఆయిల్‌ ధరలతో ఇరాన్, మందగమనంలో చైనా మార్కెట్లు విలవిల్లాడుతున్నాయని.. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్‌ సురక్షిత పెట్టుబడుల మార్కెట్స్‌ అని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement