సాక్షి, ముంబై: కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థకు షాక్ మీదషాక్‌లు తగులుతున్నాయి. రెగ్యులేటరీ నిబంధనలను పాటించలేదనే ఆరోపణలతో స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్ఎస్ఇ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ట్రేడింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసాయి. ఈ మేరకు రెగ్యులేటరీ సంస్థలు నేడు (డిసెంబరు 2, సోమవారం) ఒక ప్రకటన విడుదల చేసాయి.
గతవారం కార్వీ సంస్థపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రేడింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ లైసెన్స్‌ను బీఎస్‌ఈ, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ, ఎంఎస్‌ఈఐలు కూడా రద్దు చేశాయి. అన్ని విభాగాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీలు తెలిపాయి. సెబీ విధించిన పలు మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినట్లు, ఇతర అవసరాలకు వినియోగించినట్లు గుర్తించడంతో గత నెల 22న సెబీ చర్యలు తీసుకుంది. అలాగే కొత్త ఖాతాదారులను తీసుకోకుండా సెబీ ఆంక్షలు విధించింది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ఖాతాదాలకు సంబంధించిన పవర్ ఆఫ్ ఆటార్నీపై కూడా ఆంక్షలు విధించింది. దీంతోపాటు కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై ఎక్స్ఛేంజీలు క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment