లాభాల స్వీకరణతో మార్కెట్లు డౌన్
లాభాల స్వీకరణ, పీ-నోట్స్ నిబంధనల అమలుపై భయాలతో దేశీ స్టాక్‌మార్కెట్లు మంగళవారం రికార్డు స్థాయిల నుంచి క్షీణించి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 161 పాయింట్లు తగ్గి 28,338 వద్ద, నిఫ్టీ 67 పాయింట్లు తగ్గి 8,463 వద్ద ముగిశాయి. గడిచిన ఆరు వారాల్లో ఒకే రోజున ఇంత భారీగా తగ్గటం ఇదే ప్రథమం. చివరిసారిగా అక్టోబర్ 16న సెన్సెక్స్ ఒకే రోజున 350 పాయింట్లు పతనమైంది.
తాజాగా రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, పవర్, మెటల్, కన్జూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ సంస్థల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఏకంగా 5 శాతం క్షీణించింది. మంగళవారం లాభాల్లోనే ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో కొత్త రికార్డు స్థాయి 28,541 పాయింట్లను, నిఫ్టీ 8,535 పాయింట్ల ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకాయి. కానీ ఆ లాభాలు ఎక్కువ సేపు నిలవలేదు. చివరికి సెన్సెక్స్ 0.57 శాతం, నిఫ్టీ 0.79 శాతం క్షీణతతో ముగిశాయి.
మనీలాండరింగ్ వంటివి జరగకుండా పార్టిసిపేటరీ నోట్స్ జారీ విషయంలో విదేశీ ఇన్వెస్టర్లు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనంటూ సెబీ ఆదేశించడం మార్కెట్లను కొంత ప్రభావితం చేసిందని విశ్లేషకులు చెప్పారు. ఈ విషయంలో ఇన్వెస్టర్స్ సెంటిమెంటును కాస్త దెబ్బతీసిందని, ఫలితంగా మార్కెట్స్ క్షీణించాయని వివరించారు.
ఐటీసీ 5% పతనం: సిగరెట్ల విడి అమ్మకాలను నిషేధించాలన్న సిఫార్సులను కేంద్రం ఆమోదించిందన్న వార్తలతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఏకంగా 5 శాతం నష్టపోయిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరెన్ ధకన్ చెప్పారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో పొజిషన్లను ట్రేడర్లు నవంబర్ నుంచి డిసెంబర్‌కు రోలోవర్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ వారం ట్రేడింగ్‌లో హెచ్చుతగ్గులు తప్పకపోవచ్చని తెలిపారు.
ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌లో వాటాలు కొంటున్న ఝున్‌ఝున్‌వాలా
ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ స్టాక్ ఎక్స్చేంజీలో పూర్తి వాటాలు విక్రయించే దిశగా ప్రముఖ ఇన్వెస్టరు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తదితరులతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా (ఎఫ్‌టీఐఎల్) మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌లో ఎఫ్‌టీఐఎల్‌కు ప్రస్తుతం అయిదు శాతం వాటాలు ఉన్నాయి. ఈ డీల్ విలువ రూ. 88.41 కోట్లుగా ఉండనుంది. ఎఫ్‌టీఐఎల్ ఒప్పందం కుదుర్చున్న సంస్థల్లో ఎడెల్‌వీజ్, ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ మొదలైనవి ఉన్నాయి.