కొత్త గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు మరోసారి లాభాలు స్వీకరించేందుకు...
కొత్త గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు మరోసారి లాభాలు స్వీకరించేందుకు అమ్మకాలు చేపట్టడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు డీలాపడ్డాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు క్షీణించి 28,033 వద్ద ముగిసింది. అయితే యథాప్రకారం తొలుత లాభాలతో మొదలైంది. ఒక దశలో 130 పాయింట్లు ఎగసి 28,294ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 8,456కు చేరింది. ఇవి కొత్త గరిష్టాలుకాగా, చివర్లో ఉన్నట్టుండి అమ్మకాలు పెరిగాయి. వెరసి నిఫ్టీ సైతం లాభాలు పోగొట్టుకోవడమేకాకుండా 44 పాయింట్లు నష్టపోయి 8,382 వద్ద నిలిచింది. ప్రధానంగా మెటల్, పవర్, ఆయిల్ రంగాలు 2-1.5% మధ్య బలహీనపడ్డాయి.
ఆరు మాత్రమే
సెన్సెక్స్ దిగ్గజాలలో ఆరు మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ 2.5% పుంజుకోగా, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో 1% చొప్పున బలపడ్డాయి. అయితే మరోవైపు టాటా స్టీల్, సెసాస్టెరిలైట్, గెయిల్, టాటా మోటార్స్, భెల్, సన్ ఫార్మా, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఎంఅండ్‌ఎం, రిలయన్స్, యాక్సిస్ 3-1% మధ్య నష్టపోయాయి. ఇక మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా 0.6% చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,840 నష్టపోతే, 1,216 లాభపడ్డాయి.