SEBI inquiry
-
అలా ఎలా రుణాలిచ్చేశారు?
ముంబై: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) వివాదం... తాజాగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మెడకు కూడా చుట్టుకుంటోంది. తనఖా పెట్టిన షేర్ల గురించి పూర్తిగా మదింపు చేయకుండా అవి కార్వీకి ఎలా రుణాలిచ్చాయన్న అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. దీనికి సంబంధించి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై విచారణ జరపాలంటూ రిజర్వ్ బ్యాంక్‌కు సెబీ లేఖ రాసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అక్రమంగా క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నప్పుడే బ్యాంకులు అప్రమత్తం కావాల్సిందని సెబీ వర్గాలు పేర్కొంటున్నాయి. కార్వీ తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించాలంటూ డిసెంబర్ 2న సెబీ ఆదేశించటంతో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) దాదాపు 90 శాతం మంది క్లయింట్లకు షేర్లను బదలాయించడం తెలిసిందే. అయితే, తమకు పూచీకత్తుగా ఉంచిన షేర్లను క్లయింట్లకెలా బదలాయిస్తారంటూ బ్యాంకులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ‘ఆ షేర్లపై కార్వీకే అధికారాల్లేనప్పుడు.. వాటిని తనఖా పెట్టుకుని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణాలెలా ఇచ్చాయి? వాటిని క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించొద్దంటూ ఎలా చెబుతాయి?‘ అని సెబీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. షేర్లన్నింటికీ రిస్కు.. భారీ ఆస్తులను తనఖా పెట్టి స్వల్ప మొత్తంలో రుణాలు తీసుకుంటున్నప్పుడే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు అనుమానం రావాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. దాదాపు రూ.5,000 కోట్ల విలువ చేసే ప్రమోటర్ అసెట్స్‌కు ప్రతిగా కార్వీకి బ్యాంకులు రూ.1,200 కోట్లు రుణమిచ్చాయి. అలాగే రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి కార్వీ మరో రూ.600 కోట్లు రుణం తీసుకుంది. కార్వీ తీసుకున్న రుణాల్లో ఏ కొంచెం ఎగ్గొట్టినా.. ఇంత భారీ స్థాయిలో తనఖా పెట్టిన షేర్లన్నింటినీ బ్యాంకులు అమ్మేసే ప్రమాదం ఉంటుంది. పైపెచ్చు కార్వీ సొంత బ్యాలెన్స్ షీట్లో రూ.27 లక్షల విలువ చేసే షేర్లు మాత్రమే ఉండటం చూసైనా.. ఏదో పొరపాటు జరుగుతోందని బ్యాంకులు మేల్కొని ఉండాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కచ్చితంగా తప్పు చేశాయని ఇలాంటి ఉదంతాలు రుజువు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో పాటు బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలు షేర్లను తనఖా పెట్టుకుని కార్వీకి దాదాపు రూ.1,800 కోట్ల మేర రుణాలిచ్చాయి. ఈవోడబ్ల్యూకీ సెబీ ఫిర్యాదు..? కార్వీ కేసుకు సంబంధించి ముంబై పోలీస్‌లో భాగమైన ఆర్థిక నేరాల విభాగానికి (ఈవోడబ్ల్యూ) కూడా సెబీ ఫిర్యాదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ‘కార్వీ కేసు కేవలం సెక్యూరిటీస్ చట్టానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇది సివిల్ కేసు కూడా కనక సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు (శాట్) ఆదేశాలిచ్చే అధికారాల్లేవు. కాబట్టి క్లయింట్ల షేర్లను దొంగిలించిందంటూ కార్వీపై ఈవోడబ్ల్యూకి సెబీ ఫిర్యాదు చేయొచ్చు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్న ఇతర బ్రోకరేజీ సంస్థలపైనా సెబీ దృష్టి సారించింది. సెక్యూరిటీలను తనఖా పెట్టి రూ.50 కోట్ల పైగా రుణాలు తీసుకున్న సంస్థలు నాలుగే ఉన్నాయని, మిగతా సంస్థలన్నీ సొంత షేర్లనే పూచీకత్తుగా పెట్టాయని తేలినట్లు సమాచారం. -
ఇన్ఫీపై సెబీ విచారణ
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపించడంపైనా, సీఈవో.. సీఎఫ్‌వోలపై వచ్చిన ఆరోపణలమీద స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. కంపెనీ షేరు ధరను ప్రభావితం చేసే కీలక సమాచారాన్ని ముందుగానే తెలియజేయకపోవడంపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అలాగే, కంపెనీ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదైనా జరిగిందా అన్న కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ దిశగా ఇన్ఫోసిస్ షేర్లలో ట్రేడింగ్ డేటాతో పాటు డెరివేటివ్ పొజిషన్ల గురించిన వివరాలు ఇవ్వాలని స్టాక్ ఎక్సే్చంజీలకు సెబీ సూచించినట్లు వివరించాయి. ఈ వివాదంపై ఇన్ఫీ టాప్ మేనేజ్మెంట్తో పాటు ఇతరత్రా కీలక వ్యక్తులను కూడా విచారణ చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇన్వెస్టిగేషన్ పురోగతిని బట్టి ఆడిటింగ్ సహా ఇతరత్రా ఆర్థిక వ్యవహారాలు చూసే బోర్డు కమిటీల నుంచి కూడా సెబీ వివరాలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వతంత్ర డైరెక్టర్లపైనా దృష్టి..: ఈ వ్యవహారంలో ఇన్ఫీ స్వతంత్ర డైరెక్టర్ల తీరుపైనా సెబీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రజావేగు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఇన్ఫీ యాజమాన్యం.. స్టాక్ ఎక్సే్చంజీలకు, సెబీకి సత్వరం తెలియజేసేలా, తక్షణ చర్యలు తీసుకునేలా చూడటంలో స్వతంత్ర డైరెక్టర్లు ఏ విధంగా వ్యవహరించారన్నది తెలుసుకోనుంది. మరోవైపు, ప్రజావేగు ఫిర్యాదు గురించి సత్వరం ఎందుకు తెలియజేయలేదో వివరణనివ్వాలంటూ ఇన్ఫోసిస్‌కు బుధవారం బోంబే స్టాక్ ఎక్సే్చంజీ (బీఎస్ఈ) సూచించింది. కంపెనీ లాభాలు పెంచి చూపించేందుకు సీఈవో సలిల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్‌లు అనైతిక విధానాలను అవలంబించారంటూ ’నైతిక ఉద్యోగుల బృందం’ పేరిట కొందరు ఉద్యోగుల నుంచి ఇన్ఫోసిస్ బోర్డుకు ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. అటు అమెరికాలోని ఆఫీస్ ఆఫ్ ది విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాంకు కూడా ప్రజావేగుల నుంచి ఫిర్యాదు వెళ్లింది. సోమవారం బైటికొచ్చిన ఈ వార్తలతో ఇన్ఫీ షేరు మంగళవారం భారీగా పతనమైంది. అటు అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా వేయనున్నట్లు రోజెన్ లా ఫర్మ్ అనే న్యాయసేవల సంస్థ ప్రకటించింది. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు సంస్థ చైర్మన్ నందన్ నీలేకని వెల్లడించారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం ఇన్ఫోసిస్ షేరు సుమారు ఒక్క శాతం లాభపడింది. బీఎస్ఈలో రూ. 650.75 వద్ద ముగిసింది. అయితే ట్రేడింగ్ మొదలయ్యాక ఒకానొకదశలో 4.5% మేర దిగజారి రూ.615 కనిష్ట స్థాయిని కూడా తాకింది. -
మాల్యా నిధుల మళ్లింపు వ్యవహారంపై సెబీ దర్యాప్తు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రుణ భారంలో కూరుకుపోయి, ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యా అక్రమ ఆర్థిక లావాదేవీలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దృష్టి సారిస్తోంది. ప్రత్యేకించి ఒకప్పటి లిస్టెడ్ గ్రూప్ కంపెనీ నుంచి ఇతర కంపెనీలకు, అలాగే విదేశాలకు, వివిధ స్పోర్ట్స్ వెంచర్లకు నిధుల మళ్లింపు వ్యవహారంపై సెబీ విచారణ జరపనుంది. అవసరమైతే ఈ విషయంలో విదేశీ విచారణ సంస్థల సహాయాన్నీ సెబీ తీసుకోనున్నట్లు ఒక అత్యున్నత స్థాయి అధికారి తెలిపారు. యునెటైడ్ స్పిరిట్స్‌కు సంబంధించే దాదాపు రూ.2,500 కోట్లకుపైగా నిధుల మళ్లింపు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
కాస్టెక్స్ అవకతవకలపై సెబీ విస్తత విచారణ
న్యూఢిల్లీ: ఆమ్టెక్ ఆటోని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనుబంధ సంస్థ కాస్టెక్స్ టెక్నాలజీస్ షేరు ధరల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ మరింత విస్తృతం చేసింది. ఈ విషయంలో ప్రమోటర్లతో పాటు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, రేటింగ్ ఏజెన్సీలు మొదలైన వాటి ప్రమేయంపై కూడా దృష్టి సారించింది. బాండ్లను కన్వర్ట్ చేసుకునేలా ఇన్వెస్టర్లపై ఒత్తిడి తెస్తూ షేరు ధరను రిగ్గింగ్ చేసేందుకు కాస్టెక్స్ టెక్నాలజీస్ ప్రయత్నిస్తోందంటూ కొందరు బాండ్‌హోల్డర్ల నుంచి ఆరోపణలు వచ్చిన దరిమిలా సెబీ విచారణ ప్రారంభించింది. మరోవైపు, 80.2 మిలియన్ డాలర్ల బాండ్లను మార్చుకునేందుకు బాండ్‌హోల్డర్ల నుంచి నోటీసులు అందినట్లు కాస్టెక్స్ టెక్నాలజీస్.. స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. ఇప్పటికే షేరు ఒక్కింటికి రూ. 103.005 ధర చొప్పున 49.2 మిలియన్ డాలర్ల విలువ చేసే బాండ్లకు ప్రతిగా 3.94 కోట్ల షేర్లను కేటాయించినట్లు పేర్కొంది. దీంతో మొత్తం 130 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ బాండ్లు (ఎఫ్‌సీసీబీ) ఈక్విటీ కింద మార్చినట్లవుతుందని తెలిపింది.