కాస్టెక్స్ అవకతవకలపై సెబీ విస్తత విచారణ
న్యూఢిల్లీ: ఆమ్‌టెక్ ఆటోని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనుబంధ సంస్థ కాస్టెక్స్ టెక్నాలజీస్ షేరు ధరల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ మరింత విస్తృతం చేసింది. ఈ విషయంలో ప్రమోటర్లతో పాటు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, రేటింగ్ ఏజెన్సీలు మొదలైన వాటి ప్రమేయంపై కూడా దృష్టి సారించింది. బాండ్లను కన్వర్ట్ చేసుకునేలా ఇన్వెస్టర్లపై ఒత్తిడి తెస్తూ షేరు ధరను రిగ్గింగ్ చేసేందుకు కాస్టెక్స్ టెక్నాలజీస్ ప్రయత్నిస్తోందంటూ కొందరు బాండ్‌హోల్డర్ల నుంచి ఆరోపణలు వచ్చిన దరిమిలా సెబీ విచారణ ప్రారంభించింది.
మరోవైపు, 80.2 మిలియన్ డాలర్ల బాండ్లను మార్చుకునేందుకు బాండ్‌హోల్డర్ల నుంచి నోటీసులు అందినట్లు కాస్టెక్స్ టెక్నాలజీస్.. స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. ఇప్పటికే షేరు ఒక్కింటికి రూ. 103.005 ధర చొప్పున 49.2 మిలియన్ డాలర్ల విలువ చేసే బాండ్లకు ప్రతిగా 3.94 కోట్ల షేర్లను కేటాయించినట్లు పేర్కొంది. దీంతో మొత్తం 130 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ బాండ్లు (ఎఫ్‌సీసీబీ) ఈక్విటీ కింద మార్చినట్లవుతుందని తెలిపింది.