Amtek
-
ఆమ్టెక్ ఆటో 12 శాతం డౌన్
- కొనసాగుతున్న కంపెనీ కష్టాలు - రూ.800 కోట్ల బాండ్ల చెల్లింపుల్లో విఫలం ముంబై: వాహన విడిభాగాల సంస్థ ఆమ్టె క్ ఆటో కష్టాలు కొనసాగుతున్నాయి. సోమవారం మెచ్యూర్ అయిన రూ.800 కోట్ల ఐదేళ్ల బాండ్ల చెల్లింపుల్లో ఆమ్టెక్ ఆటో విఫలమైంది. యాక్సిస్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, సిండికేట్, కార్పొరేషన్ బ్యాంక్ తదితర బ్యాంక్‌లతో పాటు కొన్ని పెన్షన్ ఫండ్లతో సహా దాదాపు 80 మంది ఇన్వెస్టర్లకు ఈ సొమ్ములు చెల్లించాల్సి ఉందని సమాచారం. ఈ బాండ్ల చెల్లింపులకై రూ.1,000 కోట్ల రుణాల కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మంగళవారం రాత్రికల్లా ఒక పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆమ్టెక్ ఆటో చైర్మన్ అర్వింద్ ధామ్ వ్యక్తం చేశారు. కాగా ఈ సంస్థ బ్యాంకులకు రూ.8,000 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉందని, బాండ్లు, రుణాల రూపేణా 32 వరకూ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు రూ.15,000 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. వివిధ కంపెనీలను కొనుగోలు చేయడంతో ఈ కంపెనీ నగదు నిల్వలు హరించుకుపోయాయి. వచ్చే నెలో మరో 200 కోట్ల పదేళ్ల బాండ్లు మెచ్యూర్ కానున్నాయి. కాగా రుణాల కోసం తమను ఎవరూ సంప్రదించలేదని బ్యాంకులు చెప్పాయి. కంపెనీకి నగదు నిల్వలు ఏమీ లేనందున తదుపరి రుణాలివ్వడం కష్టమేనని పేర్కొన్నాయి. ఇంట్రాడేలో 20 శాతం నష్టపోయిన షేర్ బాండ్ల చెల్లింపుల్లో విఫలమైందన్న వార్తలతో ఆమ్టెక్ ఆటో 12 శాతం వరకూ క్షీణించింది. బీఎస్ఈలో ఇంట్రాడేలో 20 శాతం వరకూ పతనమైన ఈ షేర్ చివరకు 11.4 శాతం నష్టంతో రూ.45.95 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.131 కోట్లు తగ్గి రూ.1,012 కోట్లకు పడిపోయింది. బాండ్ల చెల్లింపుల్లో విఫలమైందన్న వార్తలపై వివరణ ఇవ్వాలని కంపెనీని బీఎస్ఈ ఆదేశించింది. ఆర్థిక ఫలి తాలు బాగా లేకపోవడం, రుణ ఆందోళనలు, డెరివేటివ్స్ సెగ్మెంట్ నుంచి తొలగించడం వంటి కారణాల వల్ల ఇటీవల కాలంలో ఈ షేర్ బాగా పతనమైంది. -
రియల్టీ విక్రయ యోచనలో ఆమ్టెక్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రధాన వ్యాపారేతర సంస్థలను, విదేశీ సంస్థల్లో మైనారిటీ వాటాలు, కొన్ని పారిశ్రామిక రియల్ ఎస్టేట్ ఆస్తులు విక్రయించాలని ఆమ్టెక్ ఆటో యోచిస్తోంది. అయితే, ప్రస్తుతం మాత్రం ఇంకా వీటికి సంబంధించి ఎటువంటి చర్చలూ జరగడం లేదని స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. 54 శాతం ఎగసిన షేర్ ధర...: ఈ వార్తలతో శుక్రవారం ఆమ్టెక్ ఆటో షేరు ధర ఏకంగా 54 శాతం ఎగిసి రూ. 46.70 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏకంగా 75 శాతం కూడా పెరిగింది. ఆమ్టెక్ ఆటో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోగా.. దాని అనుబంధ సంస్థ క్యాస్టెక్స్ టెక్నాలజీస్ షేరు ధరల్లో అవకతవకల ఆరోపణలపై సెబీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఆమ్టెక్ ఆటో గ్రూప్‌కి మరిన్ని రుణాలేమైనా ఇవ్వడానికి.. ముందుగా కంపెనీ ఖాతాల ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని దానికి లోన్లు ఇచ్చిన బ్యాంకుల సంయుక్త ఫోరం (జేఎల్ఎఫ్) నిర్ణయించింది. -
కాస్టెక్స్ అవకతవకలపై సెబీ విస్తత విచారణ
న్యూఢిల్లీ: ఆమ్టెక్ ఆటోని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనుబంధ సంస్థ కాస్టెక్స్ టెక్నాలజీస్ షేరు ధరల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ మరింత విస్తృతం చేసింది. ఈ విషయంలో ప్రమోటర్లతో పాటు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, రేటింగ్ ఏజెన్సీలు మొదలైన వాటి ప్రమేయంపై కూడా దృష్టి సారించింది. బాండ్లను కన్వర్ట్ చేసుకునేలా ఇన్వెస్టర్లపై ఒత్తిడి తెస్తూ షేరు ధరను రిగ్గింగ్ చేసేందుకు కాస్టెక్స్ టెక్నాలజీస్ ప్రయత్నిస్తోందంటూ కొందరు బాండ్‌హోల్డర్ల నుంచి ఆరోపణలు వచ్చిన దరిమిలా సెబీ విచారణ ప్రారంభించింది. మరోవైపు, 80.2 మిలియన్ డాలర్ల బాండ్లను మార్చుకునేందుకు బాండ్‌హోల్డర్ల నుంచి నోటీసులు అందినట్లు కాస్టెక్స్ టెక్నాలజీస్.. స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. ఇప్పటికే షేరు ఒక్కింటికి రూ. 103.005 ధర చొప్పున 49.2 మిలియన్ డాలర్ల విలువ చేసే బాండ్లకు ప్రతిగా 3.94 కోట్ల షేర్లను కేటాయించినట్లు పేర్కొంది. దీంతో మొత్తం 130 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ బాండ్లు (ఎఫ్‌సీసీబీ) ఈక్విటీ కింద మార్చినట్లవుతుందని తెలిపింది.