ఆమ్‌టెక్ ఆటో 12 శాతం డౌన్
- కొనసాగుతున్న కంపెనీ కష్టాలు
- రూ.800 కోట్ల బాండ్ల చెల్లింపుల్లో విఫలం
ముంబై: వాహన విడిభాగాల సంస్థ ఆమ్‌టె క్ ఆటో కష్టాలు కొనసాగుతున్నాయి. సోమవారం మెచ్యూర్ అయిన రూ.800 కోట్ల ఐదేళ్ల బాండ్ల చెల్లింపుల్లో ఆమ్‌టెక్ ఆటో విఫలమైంది. యాక్సిస్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, సిండికేట్, కార్పొరేషన్ బ్యాంక్ తదితర బ్యాంక్‌లతో పాటు కొన్ని పెన్షన్ ఫండ్‌లతో సహా దాదాపు 80 మంది ఇన్వెస్టర్లకు ఈ సొమ్ములు చెల్లించాల్సి ఉందని సమాచారం. ఈ బాండ్ల చెల్లింపులకై రూ.1,000 కోట్ల రుణాల కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మంగళవారం రాత్రికల్లా ఒక పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆమ్‌టెక్ ఆటో చైర్మన్ అర్వింద్ ధామ్ వ్యక్తం చేశారు.
కాగా ఈ సంస్థ బ్యాంకులకు రూ.8,000 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉందని, బాండ్లు, రుణాల రూపేణా 32 వరకూ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు రూ.15,000 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. వివిధ కంపెనీలను కొనుగోలు చేయడంతో ఈ కంపెనీ నగదు నిల్వలు హరించుకుపోయాయి. వచ్చే నెలో మరో 200 కోట్ల పదేళ్ల బాండ్లు మెచ్యూర్ కానున్నాయి. కాగా రుణాల కోసం తమను ఎవరూ సంప్రదించలేదని బ్యాంకులు చెప్పాయి. కంపెనీకి నగదు నిల్వలు ఏమీ లేనందున తదుపరి రుణాలివ్వడం కష్టమేనని పేర్కొన్నాయి.
ఇంట్రాడేలో 20 శాతం నష్టపోయిన షేర్
బాండ్ల చెల్లింపుల్లో విఫలమైందన్న వార్తలతో ఆమ్‌టెక్ ఆటో 12 శాతం వరకూ క్షీణించింది. బీఎస్‌ఈలో ఇంట్రాడేలో 20 శాతం వరకూ పతనమైన ఈ షేర్ చివరకు 11.4 శాతం నష్టంతో రూ.45.95 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.131 కోట్లు తగ్గి రూ.1,012 కోట్లకు పడిపోయింది. బాండ్ల చెల్లింపుల్లో విఫలమైందన్న వార్తలపై వివరణ ఇవ్వాలని కంపెనీని బీఎస్‌ఈ ఆదేశించింది. ఆర్థిక ఫలి తాలు బాగా లేకపోవడం, రుణ ఆందోళనలు, డెరివేటివ్స్ సెగ్మెంట్ నుంచి తొలగించడం వంటి కారణాల వల్ల ఇటీవల కాలంలో ఈ షేర్ బాగా పతనమైంది.