న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ కింద చర్యలు ఎదుర్కోబోతున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్ కేసు.. నిర్దిష్ట గడువులోగా పరిష్కారం కాగలదని బ్యాంకు లు ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. ‘ఇది ఇప్పుడే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కు చేరింది. ఎన్‌సీఎల్‌టీ అమలు చేసే ప్రక్రియే దీనికీ వర్తిస్తుంది. సాధారణంగా పొడిగింపును కూడా పరిగణనలోకి తీసుకుంటే 330 రోజుల గడువు ఉంటుంది. లేకపోతే 180 రోజుల్లోనే పరిష్కార ప్రక్రియ పూర్తి కావాలి.
దివాలా కోడ్(ఐబీసీ) ప్రక్రియ ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. నిర్దిష్ట కాలావధులకు లోబడే డీహెచ్‌ఎఫ్‌ఎల్ కేసు సత్వరం పరిష్కారం కాగలదని ఆశిస్తున్నాం’ అన్నారు. బ్యాంకులు మినహా ఇతరత్రా ఆర్థిక సంస్థల దివాలాకు సంబంధించి ఐబీసీలో సెక్షన్ 227ను చేరుస్తూ కేంద్రం గత శుక్రవారమే నిర్ణయం తీసుకుంది. దాని కింద ఎన్‌సీఎల్‌టీకి చేరిన తొలి కేసు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌దే. గృహ రుణాల సంస్థ అయిన డీహెచ్‌ఎఫ్‌ఎల్.. 2019 జూలై ఆఖరు నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్‌హోల్డర్లకు ఏకంగా రూ. 83,873 కోట్లు బాకీ పడింది.
Comments
Please login to add a commentAdd a comment