‘థామస్‌ కుక్‌’ దివాలా... | U.K Travel Giant Thomas Cook Collapsed | Sakshi
Sakshi News home page

‘థామస్‌ కుక్‌’ దివాలా...

Published Tue, Sep 24 2019 1:40 AM | Last Updated on Tue, Sep 24 2019 9:27 AM

U.K Travel Giant Thomas Cook Collapsed - Sakshi

థామస్‌ కుక్‌ కార్యాలయం వద్ద పర్యాటకుల పడిగాపులు

లండన్‌: ప్రముఖ బ్రిటిష్‌ పర్యాటక సంస్థ.. 178 ఏళ్ల చరిత్ర ఉన్న థామస్‌ కుక్‌ దివాలా తీసింది. దీంతో దాదపు 6 లక్షల మంది పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్‌కు చెందిన లక్షన్నరకు పైగా యాత్రికులు వివిధ దేశాల్లో చిక్కుకు పోయారు. వీరందరినీ స్వదేశానికి తరలించడానికి ఇంగ్లాండ్‌ ప్రభుత్వానికి భారీగానే వ్యయం కానున్నది. బల్గేరియా, క్యూబా, అమెరికా, టర్కీ తదితర దేశాల నుంచి ఈ యాత్రీకుల తరలింపునకు ఇప్పటికే ఇంగ్లాండ్‌ ప్రభుత్వం అత్యవసర ప్రణాళికలను ప్రకటించింది. ఆపరేషన్‌ మ్యాటర్‌హార్న్‌ పేరుతో ఈ తరలింపును తక్షణం ప్రారంభించింది. దీని కోసం డజన్ల కొద్దీ చార్టర్‌ విమానాలను ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక సంఖ్యలో బ్రిటీషర్లను స్వదేశానికి తీసుకురావడం ఇదే మొదటిసారి. మరోవైపు ఇంగ్లాండ్‌లో 9,000 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా  22 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.  

వేరే దారి లేక దివాలా..
178 ఏళ్ల చరిత్ర గల ఈ కంపెనీ భారీ రుణ భారంలోకి కూరుకుపోయింది. ప్రైవేట్‌ ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణ యత్నాలు విఫలమవడంతో దివాలా తీసినట్లుగా సోమవారం ప్రకటించింది. కంపెనీ వాటాదారులకు, కొత్తగా రుణాలివ్వడానికి ముందుకు వచ్చిన సంస్థలకు మధ్య అవగాహన ఒప్పందం కుదర్చడంలో శతథా ప్రయత్నాలు చేశామని, అవన్నీ విఫలమయ్యాయని పేర్కొంది. వేరే దారి లేక తక్షణం దివాలా తీసినట్లుగా ప్రకటిస్తున్నామని వెల్లడించింది.  ఆన్‌లైన్‌ సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవడం, బ్రెగ్జిట్‌ అనిశ్చితి కారణంగా హాలిడే ట్రిప్పులు, ప్యాకేజీల బుకింగ్స్‌ పడిపోవడం థామస్‌ కుక్‌ కష్టాలను మరింతగా పెంచింది. 2007లో మై ట్రావెల్‌ సంస్థను థామస్‌ కుక్‌ విలీనం చేసుకోవడం ఆ కంపెనీ పుట్టి మునగడానికి గల కారణాల్లో ఒకటి. వ్యయాలు తడిసి మోపెడై భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయింది.  

1841 నుంచి కార్యకలాపాలు..
1841లో థామస్‌ కుక్‌ తన పేరు మీదనే ఈ పర్యాటక సంస్థను స్థాపించాడు. ఆరంభంలో ఇంగ్లాండ్‌లోని రైల్వే ప్రయాణికులకు పర్యాటక సేవలందించిన ఈ సంస్థ, ఆ తర్వాత విదేశీ యాత్రలను నిర్వహించడం మొదలు పెట్టింది. . పర్యాటకానికి సంబంధించి వివిధ రంగాల్లోకి విస్తరించింది. వార్షిక టర్నోవర్‌ 1,000 కోట్ల పౌండ్లు, ప్రపంచవ్యాప్తంగా 2కోట్ల మందికి పర్యాటక సేవలందించే ఘనతలున్నప్పటికీ, భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయింది. ఒకప్పుడు లండన్‌ స్టాక్‌ మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన ఈ కంపెనీ షేరును ఇటీవలే తొలగించారు.  

గోవా పర్యాటకంపై దెబ్బ
థామస్‌ కుక్‌ దివాలా ప్రకటన గోవా పర్యాటకంపై తీవ్ర ప్రభావమే చూపించనున్నది. గత టూరిస్ట్‌ సీజన్‌లో దాదాపు 30 వేలమంది బ్రిటీషర్లు గోవా వచ్చారు. వీరంతా థామస్‌ కుక్‌ ఏర్పాటు చేసిన చార్టర్డ్‌ విమానాల ద్వారా వచ్చిన వాళ్లే, రోజుకు 300 మందిని ఇంగ్లాండ్‌ నుంచి గోవాకు థామస్‌ కుక్‌ తీసుకువచ్చేది. ఒక్కో బ్రిటీషర్‌  గోవాలో సగటున రెండు వారాలు పాటు ఉంటారని అంచనా. ఇక థామస్‌ కుక్‌ దివాలా తీయడంతో ఇంగ్లాండ్‌ నుంచి వచ్చే పర్యాటకులు సగం మేర తగ్గుతారని విశ్లేషకులంటున్నారు.
కాగా థామస్‌ కుక్‌ భారత కార్యకలాపాలను 2012లో కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ కొనుగోలు చేసింది. థామస్‌ కుక్‌ యూకేకు, థామస్‌ కుక్‌ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదిన థామస్‌ కుక్‌ ఇండియా స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement