2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభానికి ముసలం బ్యాంకింగ్ రంగంలోనే మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ లేమాన్ బ్రదర్స్ దివాలా తీయడంతో స్టాక్ మార్కెట్లు పేక మేడల్లా కుప్పకూలాయి. ఇప్పుడు సరిగ్గా మళ్లీ అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగానికి అలాంటి షాక్ తగలబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అనేక సమస్యలతో సతమతమవుతున్న స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్విస్... క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ స్వయంగా దాని సీఈఓ వెల్లడించడంతో దివాలా తీయొచ్చంటూ గగ్గోలు మొదలైంది.
న్యూయార్క్: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సంస్థ సీఈవో ఉల్రిచ్ కోర్నర్ పేర్కొన్నారు. దీంతో తాజా పునర్‌వ్యస్థీకరణ చర్యలకు తెరతీయనున్నట్లు సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించారు. తద్వారా తగిన చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే బ్యాంక్ పటిష్టంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. బ్యాంకు షేరు పతనాన్ని చూసి కలత చెందొద్దని కూడా సిబ్బందికి సూచించారు. పటిష్ట స్థాయిలో మూలధన బేస్‌తోపాటు లిక్విడిటీ కూడా బాగానే ఉందని సీఈవో వివరించారు.
అయితే, ఒకపక్క బ్యాంకు షేరు రోజుకో ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకుతుండటం... దివాలా వదంతుల నేపథ్యంలో ఉల్రిచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల (అక్టోబర్) 27న బ్యాంక్ చేపట్టనున్న వ్యూహాత్మక సమీక్ష ఫలితాలు వెలువడేవరకూ సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు నిర్ణయించుకున్నట్లు సీఈవో లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మీడియాలో ఊహాగానాలకు స్పందించకుండా క్లయింట్లకు సేవలందించడంపై దృష్టిపెట్టాలని కూడా తమ సిబ్బందికి ఉల్రిచ్ సూచించినట్లు సమాచారం. కాగా, బ్యాంకు ఈ నెల 27న మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనుంది.
మూడు ముక్కలు...
మూడేళ్లుగా వెలుగుచూస్తున్న రకరకాల స్కామ్‌లు... క్రెడిట్ స్విస్‌ను అతలాకుతం చేశాయి. మరోపక్క, యూరప్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం సెగలు, వడ్డీరేట్ల పెంపు ప్రభావం కూడా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో క్రెడిట్ స్విస్ గ్రూపును మూడు సంస్థలుగా విడదీసేందుకు బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. లాభదాయకంగా ఉన్న యూనిట్లను విక్రయించాలనేది బ్యాంకు యోచన. ప్రతిపాదనల ప్రకారం అడ్వయిజరీ బిజినెస్, అధిక ఒత్తిడిలోగల ఆస్తుల (హైరిస్క్ రుణాల)తో బ్యాడ్ బ్యాంక్‌లను విడదీయనుంది. వీటిని మినహాయించగా మిగిలిన బిజినెస్‌లతో మరో సంస్థ ఏర్పాటు కానుంది. అయితే ఈ అంశాలపై క్రెడిట్ స్వీస్ స్పందించకపోవడం గమనార్హం!
ఇదీ నేపథ్యం...
స్విట్జర్లాండ్‌లోని రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ స్విస్ గత మూడేళ్లలో రహస్య (స్పైయింగ్) కార్పొరేట్ కుంభకోణం, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ల మూసివేత, రికార్డ్ ట్రేడింగ్ నష్టాలు, న్యాయపరమైన వ్యాజ్యాల పరంపర వంటి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో బ్యాంక్ చైర్మన్ యాక్సెల్ లేమన్ వేసవిలో ఉల్రిచ్ కోర్నర్‌ను సీఈవోగా ఎంపిక చేసి బ్యాంకును గాడిలోపెట్టే బాధ్యతలు అప్పగించారు. బ్యాంక్ నిర్వహణలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అనుమతించారు. కాగా.. ఈ నెల మొదట్లో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 5,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.
ఇన్వెస్టర్లలో వణుకు..!
గత కొద్ది నెలలుగా క్రెడిట్ స్విస్ ఎదుర్కొంటున్న సవాళ్లతో బ్యాంకు షేరు కుప్పకూలుతూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో 9 డాలర్లుగా ఉన్న షేరు ధర తాజాగా సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి (3.9 డాలర్లు) దిగజారింది. మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కాగా, సీఈఓ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బ్యాంక్ దివాలా తీయనుందంటూ ట్విటర్‌లో మారుమోగుతోంది. అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచడంతో మాంద్యం భయాలు వెంటాడుతున్న తరుణంలో క్రెడిట్ స్విస్ దివాలా వార్తలు ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే జరిగితే మార్కెట్ సెంటిమెంట్ మరింత బలహీనపడొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు ఎలా స్పందిస్తాయోన్న ఉత్కంట సర్వత్రా నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment