స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్.. తాను టేకోవర్ చేస్తున్న మరో స్విస్ బ్యాంకు క్రెడిట్ సూసీలో 35,000 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోందని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ తాజాగా కథనం వెలువరించింది.
దాదాపు 45,000 మంది ఉద్యోగులు ఉన్న క్రెడిట్ సూసీ.. దాని సాల్వెన్సీ గురించి ఇన్వెస్టర్ల భయాలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దాదాపుగా కుప్పకూలింది. దీంతో స్విస్ ప్రభుత్వం భారీ బెయిలౌట్‌తో అండగా నిలవడంతో క్రెడిట్ సూసీను కొనుగోలు చేసేందుకు యూబీఎస్ గ్రూప్ ముందుకు వచ్చింది.
ప్రపంచంలో ప్రముఖమైన ఈ రెండు బ్యాంకులు కలుస్తున్న నేపథ్యంలో భారీగా ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు ముందుగానే హెచ్చరించారు. కాగా ఉద్యోగ కోతలపై వివరణ కోసం అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ... యూబీఎస్‌ను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించింది.
మూడు దశల్లో..
యూబీఎస్, క్రెడిట్ సూసీ రెండు బ్యాంకింగ్ సంస్థల్లో కలిపి గత సంవత్సరం చివరి నాటికి దాదాపు 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 37,000 మంది స్విట్జర్లాండ్‌లో పని చేస్తున్నారు. ఉద్యోగుల కోత మూడు దశల్లో ఉంటుందని, మొదటిది జూలై చివరలో, మిగిలినవి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉంటాయని ఉద్యోగులకు తెలియజేసినట్లుగా బ్లూమ్‌బర్గ్ నివేదిక ఆయా కంపెనీలకు దగ్గరగా ఉన్న మూలాలను ఉటంకిస్తూ పేర్కొంది.
బ్యాంక్ టేకోవర్‌కు సంబంధించి రాబోయే నెలల్లో ఒడుదుడుకులు ఉంటాయని, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కఠినమైన నిర్ణయాలు ఉంటాయని యూబీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో ఎర్మోట్టి జూన్ నెల ప్రారంభంలో హెచ్చరించారు.
ఇదీ చదవండి: Bank Holidays July 2023: నెలలో దాదాపు సగం రోజులు సెలవులే!
Comments
Please login to add a commentAdd a comment