సంక్షోభంలో చిక్కుకున్న క్రెడిట్ సూసీ బ్యాంక్ ఉద్యోగులకు త్వరలో ఉద్వాసన తప్పదని స్విస్ వారపత్రిక ‘హ్యాండెల్స్ జూటింగ్’ తాజాగా తెలిపింది. ఈ క్రెడిట్ సూసీ బ్యాంకును స్విట్జర్లాండ్ దిగ్గజ బ్యాంక్ యూబీఎస్ టేకోవర్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రెండు బ్యాంకుల విలీనాన్ని యూబీఎస్ ప్రారంభించిందని, క్రెడిట్ సూసీలోని వేలాది మంది ఉద్యోగులు త్వరలో తొలగింపు నోటీసులు అందుకోనున్నారని ఆ పత్రిక పేర్కొంది. క్రెడిట్ సూసీ బ్యాంకును 3.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి గత మార్చి నెలలో యూబీఎస్ అంగీకరించింది. ఇక అప్పటి నుంచి దీని ప్రభావం ఉద్యోగాలపై కచ్చితంగా ఉంటుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి.
విలీనం అనంతరం క్రెడిట్‌సూసీలోని చాలామంది ఉద్యోగులను తొలగించే యోచనలో యూబీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో ఎర్మోట్టి ఉన్నట్లు సదరు స్విస్ పత్రిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా క్రెడిట్ సూసీకి చెందిన 30,000 నుంచి 35,000 ఉద్యోగాల కోత ఉంటుందని స్విస్ మీడియా ఊహాగానాలు వ్యక్తం చేస్తూ వస్తోంది.
గత సంవత్సరం చివరి నాటికి యూబీఎస్, క్రెడిట్ సూసీ బ్యాంకుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 37,000 మంది స్విట్జర్లాండ్‌లోనే పనిచేస్తున్నారు. కాగా దీనిపై వ్యాఖ్యానించడానికి యూబీఎస్ నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment