1,800 మందికి ఉద్యోగ అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా వాణిజ్య సేవల్లో పేరొందిన స్విస్ బ్యాంకర్ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా అంతర్జాతీయంగా వాణిజ్య సేవల్లో హైదరాబాద్ స్థానం మరింత బలోపేతం కానున్నది. జూరిక్ ఇన్నోవేషన్ పార్కులో శుక్రవారం రాత్రి స్విట్జర్లాండ్ ఇన్నోవేషన్ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేసిన సదస్సులో యూబీఎస్ ఇండియా చైర్మన్ హెరాల్డ్ ఎగ్గర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు.
హైదరాబాద్‌లో యూబీఎస్ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తూ వచ్చే రెండేళ్లలో మరో 1,800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఐటీ, వాణిజ్య సేవల్లో తెలంగాణను సమీప భవిష్యత్తులో అంతర్జాతీయంగా అగ్రస్థానంలో నిలపడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తుందని యూబీఎస్ ప్రకటించింది. ‘దేశంలోని జీసీసీల్లో 11 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
పెట్టుబడులకు అనుకూలత, సాంకేతిక వాతావరణం, అత్యాధునిక మౌలిక వసతులు తదితరాల మూలంగా జీసీసీల ఏర్పాటుకు నగరం అత్యంత అనుకూలంగా మారుతోంది’అని మంత్రి శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా ప్రకటించారు. గత ఏడాది మార్చిలో భారత్, ఎఫ్టా దేశాలు (స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్, లీషెన్‌స్టీన్) నడుమ కీలకమైన ట్రేడ్ అండ్ ఎకానమీ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ (టెపా) పేరిట స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందంలో భాగంగా ఎఫ్టా దేశాలు భారత్‌లో వచ్చే 15 ఏళ్లలో పది లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 100 బిలియన్ యూరోలను పెట్టుబడిగా పెడతాయి. టెపా ఒప్పందంపై అవగాహన కలిగించడంతో పాటు తెలంగాణలో స్విస్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా తాజాగా స్విట్జర్‌లాండ్ ఇన్నోవేషన్ కార్పొరేషన్ సదస్సు జరిగింది.
ఈ సదస్సులో స్విస్ జాతీయ కౌన్సిల్ సభ్యులు, స్విస్ ఇండియా పార్లమెంటరీ గ్రూప్ ప్రెసిడెంట్ నికోలస్ గగ్గర్, భారత్‌లో స్విట్జర్లాండ్ రాయబారి మాయా టిసాఫీతో పాటు 40కి పైగా స్విస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ తరపున పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, టీజీఐఐసీ సీఈఓ మధుసూదన్, లైఫ్‌సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment