మరో ల్యాంకో గ్రూపు కంపెనీపై ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్‌... | PNB drags Lanco Vidarbha Thermal Power to NCLT | Sakshi
Sakshi News home page

మరో ల్యాంకో గ్రూపు కంపెనీపై ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్‌...

Published Sat, Sep 22 2018 1:15 AM | Last Updated on Sat, Sep 22 2018 1:15 AM

PNB drags Lanco Vidarbha Thermal Power to NCLT - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ల్యాంకో గ్రూపునకు చెందిన మరో కంపెనీ దివాలా కోసం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలైంది. తమకు చెల్లించాల్సిన రుణ బకాయి రూ.786.74 కోట్లను చెల్లించడంలో ల్యాంకో విదర్భ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ విఫలమైందని, అందువల్ల ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ ల్యాంకో విదర్భ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 5వ తేదీకి వాయిదా వేసింది.

ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ సభ్యులు రాతకొండ మురళీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తరఫు న్యాయవాది రాజశేఖర్‌ రావు సల్వాజీ వాదనలు వినిపిస్తూ, మహారాష్ట్ర, వార్ధా జిల్లా, మాండవలో 1320 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టు కోసం ల్యాంకో విదర్భ థర్మల్‌ పవర లిమిటెడ్‌ 2010లో పలు బ్యాంకుల కన్సార్టియం నుంచి మొదట రూ.5549 కోట్ల రుణం తీసుకుందని, ఇందులో పీఎన్‌బీ వాటా రూ.750 కోట్లని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం పెరగడంతో కన్సార్టియం నుంచి ల్యాంకో విదర్భ అదనపు రుణం తీసుకుందని, దీంతో మొత్తం రుణం రూ.9613 కోట్లకు చేరిందన్నారు. అదనపు రుణంతో పీఎన్‌బీ నుంచి తీసుకున్న అప్పు రూ.1340 కోట్లకు చేరిందని వివరించారు.

ఈ రుణానికి ల్యాంకో యజమానులైన ఎల్‌.మధుసూధన్‌రావు, ఎల్‌.రామలక్ష్మమ్మలు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించారని, అలాగే మహరాష్ట్రలో ఉన్న పలు ఆస్తులను తాకట్టు పెట్టారని తెలిపారు. తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో ల్యాంకో విదర్భ విలఫమైందని, పలు నోటీసులు పంపినా స్పందించడం లేదన్నారు. కన్సార్టియంకు రూ.4784.77 కోట్లు బకాయి ఉండగా,  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ. 786.74 కోట్ల చెల్లించాల్సి ఉందన్నారు. 2017 నాటికి పూచీకత్తుగా ఉంచిన భూమి, భవనాలు, ప్లాంట్, యంత్రాల విలువ రూ.4083.71 కోట్లుగా విలువ కట్టడం జరిగిందన్నారు.

నోటీసులకు స్పందన లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక ల్యాంకో విదర్భ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ దివాలా ప్రక్రియ నిమిత్తం ఈ పిటిషన్‌ దాఖలు చేయాల్సి వచ్చిందని రాజశేఖరరావు వివరించారు. తమ బకాయిని రాబట్టుకునేందుకు ల్యాంకో విదర్భ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని, ఇందుకోసం దివాలా పరిష్కార నిపుణుడిగా హర్యానాకు చెందిన విజయకుమార్‌ గార్గ్‌ను నియమించాలని ఆయన ట్రిబ్యునల్‌ను కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్‌ సభ్యులు మురళీ ల్యాంకో విదర్భకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ విచారణను అక్టోబర్‌ 5కి వాయిదా వేశారు.

ల్యాంకో గ్రూపునకు చెందిన కంపెనీల్లో ల్యాంకో ఇన్‌ఫ్రా, ల్యాంకో బబంధ్, ల్యాంకో తీస్తా హైడ్రో, ల్యాంకో అమర్‌కంఠక్, ల్యాంకో సోలార్, ల్యాంకో థర్మల్, ల్యాంకో హిల్స్‌ కంపెనీలు దివాలా చర్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడు కంపెనీల్లో ల్యాంక్‌ ఇన్‌ఫ్రా మూసివేతకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలిచ్చింది. అలాగే ల్యాంకో తీస్తా హైడ్రో, ల్యాంకో బబంధ్‌ల దివాలా పరిష్కార ప్రక్రియకు ట్రిబ్యునల్‌ అనుమతినిచ్చింది. మిగిలిన నాలుగు కంపెనీలపై ఎన్‌సీఎల్‌టీలో విచారణ కొనసాగుతోంది. ఈ       ఏడు కంపెనీలు కూడా ఆయా బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగవేసినవే కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement