Lanco Group
-
కొనసాగుతున్న ‘ల్యాంకో’ దివాలా పరంపర
సాక్షి, హైదరాబాద్: ల్యాంకో గ్రూపు కంపెనీల దివాలా పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో కంపెనీ దివాలా ప్రక్రియ జాబితాలో చేరింది. ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ దివాలాకు అనుమతినిస్తూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ ఉత్తర్వులు జారీ చేసింది. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో యాక్సిస్ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్సీఎల్టీ సభ్యులు అనంతపద్మనాభస్వామి ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కోల్‌కతాకు చెందిన పంకజ్ దనుఖాను తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్పీ)గా నియమించారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో గ్యాస్, నాఫ్తా ఆధారిత విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. కార్యకలాపాల నిమిత్తం వివిధ బ్యాంకుల నుంచి కంపెనీ పెద్దఎత్తున రుణాలు తీసుకుంది. ఈ విధంగా యాక్సిస్ బ్యాంకుకు 2018 ఆగస్ట్ 31 నాటికి రూ. 657.41 కోట్లు బకాయి పడింది. రుణాలు చెల్లించకపోవడంతో యాక్సిస్ బ్యాంకు ఎన్సీఎల్ టీని ఆశ్రయించి, ల్యాంకో కొండపల్లి దివాలాను ప్రారంభించాలని పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై ఎన్సీఎల్టీ సభ్యులు అనంతపద్మనాభస్వామి విచారణ జరిపారు. ల్యాంకో తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అదుపులో లేని పరిస్థితుల వల్ల కంపెనీకి ఇబ్బందులు వచ్చాయన్నారు. గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, గ్యాస్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో దివాలా ప్రక్రియ ప్రారంభించరాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. తరువాత యాక్సిస్ బ్యాంకు వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ల్యాంకో కొండపల్లికి ఏ సంబంధం లేదని తెలిపింది. రుణం చెల్లించాలని ఎన్నిసార్లు కోరినా ల్యాంకో కొండపల్లి స్పందించలేదన్నారు. వాదనలు విన్న ట్రిబ్యునల్, ల్యాంకో కొండపల్లి దివాలా ప్రక్రియకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీల ఆస్తుల క్రయ, విక్రయాలు, బదలాయింపులపై నిషేధం విధించింది. ఈ దివాలా ప్రక్రియకు పూర్తిగా సహకరించాలని కంపెనీ డైరెక్టర్లను ఆదేశించింది. -
ఆ కంపెనీల దివాలా ప్రక్రియ ప్రారంభించండి
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులకు రుణాలు ఎగవేసిన ల్యాంకో గ్రూపు కంపెనీల్లో తాజాగా మరో రెండు కంపెనీలు కూడా చేరాయి. ఆంధ్రా బ్యాంక్‌కు ల్యాంకో థర్మల్ పవర్ లిమిటెడ్, ల్యాంకో సోలార్ ఎనర్జీ లిమిటెడ్‌లు వరుసగా రూ. 129.99 కోట్లు, రూ. 150.57 కోట్ల మేర బకాయి పడ్డాయి. తీసుకున్న ఈ రుణాలను తిరిగి చెల్లించడంలో ఆ కంపెనీలు విఫలమయ్యాయని, అందువల్ల ఆ కంపెనీల దివా లా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ ముందు ఆంధ్రా బ్యాంక్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ల్యాంకో థర్మల్ పవర్ లిమిటెడ్‌పై దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ సభ్యులు (జ్యుడీషియల్) రాతకొండ మురళీ విచారణ జరిపారు. ఇరు ఇరు వర్గాల వాదనలు విన్న మురళీ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. ల్యాంకో సోలార్కు నోటీసులు.. ల్యాంకో సోలార్ ఎనర్జీపై దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ మరో సభ్యులు అనంత పద్మనాభస్వామి (జ్యుడీషియల్) విచారణ జరిపారు. ఈ పిటిషన్లో కూడా ఆంధ్రా బ్యాంకు తరఫున లక్ష్మీనర్సింహ వాదనలు వినిపించారు. తమ బ్యాంకుకు ల్యాంకో సోలార్ రూ. 150.57 కోట్ల మేర బకాయి పడిందని చెప్పారు. ఈ కంపెనీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సైతం రుణం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ట్రిబ్యునల్ సభ్యులు ల్యాంకో సోలార్కు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 14కి వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
మరో ల్యాంకో గ్రూపు కంపెనీపై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్...
సాక్షి, హైదరాబాద్: ల్యాంకో గ్రూపునకు చెందిన మరో కంపెనీ దివాలా కోసం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. తమకు చెల్లించాల్సిన రుణ బకాయి రూ.786.74 కోట్లను చెల్లించడంలో ల్యాంకో విదర్భ థర్మల్ పవర్ లిమిటెడ్ విఫలమైందని, అందువల్ల ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ ల్యాంకో విదర్భ థర్మల్ పవర్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ సభ్యులు రాతకొండ మురళీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరఫు న్యాయవాది రాజశేఖర్ రావు సల్వాజీ వాదనలు వినిపిస్తూ, మహారాష్ట్ర, వార్ధా జిల్లా, మాండవలో 1320 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు కోసం ల్యాంకో విదర్భ థర్మల్ పవర లిమిటెడ్ 2010లో పలు బ్యాంకుల కన్సార్టియం నుంచి మొదట రూ.5549 కోట్ల రుణం తీసుకుందని, ఇందులో పీఎన్బీ వాటా రూ.750 కోట్లని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం పెరగడంతో కన్సార్టియం నుంచి ల్యాంకో విదర్భ అదనపు రుణం తీసుకుందని, దీంతో మొత్తం రుణం రూ.9613 కోట్లకు చేరిందన్నారు. అదనపు రుణంతో పీఎన్బీ నుంచి తీసుకున్న అప్పు రూ.1340 కోట్లకు చేరిందని వివరించారు. ఈ రుణానికి ల్యాంకో యజమానులైన ఎల్.మధుసూధన్‌రావు, ఎల్.రామలక్ష్మమ్మలు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించారని, అలాగే మహరాష్ట్రలో ఉన్న పలు ఆస్తులను తాకట్టు పెట్టారని తెలిపారు. తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో ల్యాంకో విదర్భ విలఫమైందని, పలు నోటీసులు పంపినా స్పందించడం లేదన్నారు. కన్సార్టియంకు రూ.4784.77 కోట్లు బకాయి ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 786.74 కోట్ల చెల్లించాల్సి ఉందన్నారు. 2017 నాటికి పూచీకత్తుగా ఉంచిన భూమి, భవనాలు, ప్లాంట్, యంత్రాల విలువ రూ.4083.71 కోట్లుగా విలువ కట్టడం జరిగిందన్నారు. నోటీసులకు స్పందన లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక ల్యాంకో విదర్భ థర్మల్ పవర్ లిమిటెడ్ దివాలా ప్రక్రియ నిమిత్తం ఈ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని రాజశేఖరరావు వివరించారు. తమ బకాయిని రాబట్టుకునేందుకు ల్యాంకో విదర్భ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని, ఇందుకోసం దివాలా పరిష్కార నిపుణుడిగా హర్యానాకు చెందిన విజయకుమార్ గార్గ్‌ను నియమించాలని ఆయన ట్రిబ్యునల్‌ను కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్ సభ్యులు మురళీ ల్యాంకో విదర్భకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేశారు. ల్యాంకో గ్రూపునకు చెందిన కంపెనీల్లో ల్యాంకో ఇన్ఫ్రా, ల్యాంకో బబంధ్, ల్యాంకో తీస్తా హైడ్రో, ల్యాంకో అమర్‌కంఠక్, ల్యాంకో సోలార్, ల్యాంకో థర్మల్, ల్యాంకో హిల్స్ కంపెనీలు దివాలా చర్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడు కంపెనీల్లో ల్యాంక్ ఇన్ఫ్రా మూసివేతకు ఎన్సీఎల్టీ ఆదేశాలిచ్చింది. అలాగే ల్యాంకో తీస్తా హైడ్రో, ల్యాంకో బబంధ్ల దివాలా పరిష్కార ప్రక్రియకు ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. మిగిలిన నాలుగు కంపెనీలపై ఎన్సీఎల్టీలో విచారణ కొనసాగుతోంది. ఈ ఏడు కంపెనీలు కూడా ఆయా బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగవేసినవే కావడం విశేషం. -
ల్యాంకో పవర్ వాటాల రేసులో 4 సంస్థలు?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ భారం తగ్గించుకునే దశగా విద్యుత్ వ్యాపార విభాగంలో వ్యూహాత్మక ఇన్వెస్టర్ల వేటలో ఉన్న ల్యాంకో గ్రూప్ తాజాగా నాలుగు సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. టాటా పవర్, పిరమాల్ ఎంటర్ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ మొదలైనవి ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 8,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఆరు థర్మల్ పవర్ ప్లాంట్లున్న ల్యాంకో విద్యుత్ వ్యాపార విభాగం విలువ సుమారు రూ. 45,000 కోట్ల మేర ఉంటుందని అంచనా. మెగావాట్‌కు రూ. 4.5 కోట్లు చొప్పున (సుమారు రూ. 36,000 కోట్లు) కంపెనీ కోరుతుండగా, బిడ్డర్లు సుమారు రూ. 3 కోట్లు (దాదాపు రూ. 24,000 కోట్లు) కోట్ చేస్తున్నట్లు సమాచారం. ల్యాంకోగ్రూప్నకు రుణాలిచ్చిన వాటిల్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి ఉన్నాయి. మరోవైపు, వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా తాము వివిధ పెట్టుబడి అవకాశాలు పరిశీలిస్తుంటామని, ప్రస్తుతానికైతే ల్యాంకో పవర్ వాటాల కొనుగోలు ప్రతిపాదనేదీ తమ బోర్డు ముందుకు రాలేదని పిరమాల్ ఎంటర్ప్రైజెస్ వివరణనిచ్చింది. ఇవన్నీ పూర్తిగా ఊహాజనిత వార్తలేనని, తాము దీనిపై చర్చలేమీ జరపడం లేదంటూ అటు టాటా పవర్ కంపెనీ స్పష్టం చేసింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సైతం వాటాల కొనుగోలు వార్తలను తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని తెలిపింది. శుక్రవారం బీఎస్ఈలో ల్యాంకో ఇన్ఫ్రాటెక్ షేర్లు దాదాపు 12 శాతం ఎగిసి రూ. 4.92 వద్ద ముగిశాయి. -
వాటాల విక్రయ దిశగా ల్యాంకో పవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ వ్యాపార విభాగానికి సంబంధించి రుణ భారం తగ్గించుకునే దిశగా వ్యూహాత్మక ఇన్వెస్టరు వేటలో ఉన్న ల్యాంకో గ్రూప్ తాజాగా అయిదు సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. విద్యుత్ వ్యాపారంలోకి కొత్త ఇన్వెస్టరు సుమారు రూ. 700-800 కోట్ల ఈక్విటీని సమకూర్చవచ్చని అంచనా. ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర రుణదాతలతో డీల్ విషయంలో ల్యాంకో గ్రూప్ త్వరలో భేటీ కావొచ్చని తెలుస్తోంది. దాదాపు 8,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఆరు థర్మల్ పవర్ ప్లాంట్లున్న ల్యాంకో విద్యుత్ వ్యాపార విభాగం విలువ దాదాపు రూ. 45,000 కోట్ల మేర ఉంటుంది. ఇప్పటికే విద్యుత్ వ్యాపార విభాగంలో ఇన్వెస్ట్ చేసేందుకు పిరమల్ క్యాపిటల్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ల్యాంకో ఇన్ఫ్రా ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. కాగా, గురువారం బీఎస్ఈలో ల్యాంకో ఇన్ఫ్రా షేరు 2.73% పెరిగి రూ. 4.52 వద్ద ముగిసింది. -
'ల్యాంకో కోసమే లగడపాటి.. సోనియాకు పాదాభివందనం'
సంక్షోభంలో ఉన్న తన ల్యాంకో సంస్థను కాపాడుకోవడానికే కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. సోనియా గాంధీకి పాదాభివందనం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, గౌతంరెడ్డి విమర్శించారు. ల్యాంకోకు ఉన్న 40 వేల కోట్ల అప్పుల్లో 9 వేల కోట్ల మాఫీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందువల్లే లగడపాటి చిత్తశుద్ధిలేని రాజీనామా చేసి పదవిలో కొనసాగుతున్నారని చెప్పారు. ఆస్ట్రేలియాలో ఆయనకున్న కంపెనీలపై కేసులున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చేస్తామని ఇప్పటికీ నోరు మెదపడం లేదని ఉదయభాను, గౌతం రెడ్డి విమర్శించారు. -
మరో 4,000 మంది ఉద్యోగులకు ల్యాంకో ఉద్వాసన!
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: కొత్త ప్రాజెక్టులు రాక, పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ల్యాంకో ఇన్ఫ్రా భారీ స్థాయిలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. గడిచిన 15 నెలల్లో 4,000 మంది ఉద్యోగులను తొలగించిన ల్యాంకో ఈ ఏడాది కూడా అదే స్థాయిలో తగ్గించుకునే ప్రయత్నంలో ఉంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో 400 మంది సిబ్బందిని తగ్గించామని, ఈ ఏడాది మొత్తం మీద ఇంకో 3,600 మందిని తొలగించే ఆలోచనలో ఉన్నట్లు ల్యాంకో ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. 15 నెలల క్రితం 8,000గా ఉన్న సిబ్బంది సంఖ్య ఇప్పుడు సగానికి సగం తగ్గి 4,100 నుంచి 4,200 చేరింది. వివిధ ప్రాజెక్టుల నిర్వహణ కోసం భారీగా సిబ్బందిని నియమించుకున్న ల్యాంకో ఇప్పుడు ఆ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఆగిపోవడంతో సిబ్బందిని వదిలించుకునే పనిలో పడింది. ఒకపక్క నష్టాలు భారీగా పెరుగుతుండటమే కాకుండా అప్పులు కొండలా పేరుకుపోతున్నాయి. ల్యాంకో గ్రూపునకు రూ.40,000 కోట్ల వరకు అప్పులున్నట్లు అంచనా. అలాగే 2011-12లో రూ.112 కోట్లుగా ఉన్న నష్టం 2012-13 నాటికి రూ.1,073 కోట్లకు చేరింది. కేవలం వడ్డీల కిందే ఏడాదికి రూ.2,421 కోట్లు చెల్లించాల్సి వస్తోందంటే అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులపై చేస్తున్న వ్యయం కూడా రూ.736 కోట్ల నుంచి రూ.632 కోట్లకు తగ్గగా అది ఈ సంవత్సరం మరింత గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.