మరో 4,000 మంది ఉద్యోగులకు ల్యాంకో ఉద్వాసన!
Published Wed, Sep 4 2013 5:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: కొత్త ప్రాజెక్టులు రాక, పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ల్యాంకో ఇన్‌ఫ్రా భారీ స్థాయిలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. గడిచిన 15 నెలల్లో 4,000 మంది ఉద్యోగులను తొలగించిన ల్యాంకో ఈ ఏడాది కూడా అదే స్థాయిలో తగ్గించుకునే ప్రయత్నంలో ఉంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో 400 మంది సిబ్బందిని తగ్గించామని, ఈ ఏడాది మొత్తం మీద ఇంకో 3,600 మందిని తొలగించే ఆలోచనలో ఉన్నట్లు ల్యాంకో ఉన్నతస్థాయి అధికారి తెలిపారు.
15 నెలల క్రితం 8,000గా ఉన్న సిబ్బంది సంఖ్య ఇప్పుడు సగానికి సగం తగ్గి 4,100 నుంచి 4,200 చేరింది. వివిధ ప్రాజెక్టుల నిర్వహణ కోసం భారీగా సిబ్బందిని నియమించుకున్న ల్యాంకో ఇప్పుడు ఆ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఆగిపోవడంతో సిబ్బందిని వదిలించుకునే పనిలో పడింది. ఒకపక్క నష్టాలు భారీగా పెరుగుతుండటమే కాకుండా అప్పులు కొండలా పేరుకుపోతున్నాయి. ల్యాంకో గ్రూపునకు రూ.40,000 కోట్ల వరకు అప్పులున్నట్లు అంచనా.
అలాగే 2011-12లో రూ.112 కోట్లుగా ఉన్న నష్టం 2012-13 నాటికి రూ.1,073 కోట్లకు చేరింది. కేవలం వడ్డీల కిందే ఏడాదికి రూ.2,421 కోట్లు చెల్లించాల్సి వస్తోందంటే అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులపై చేస్తున్న వ్యయం కూడా రూ.736 కోట్ల నుంచి రూ.632 కోట్లకు తగ్గగా అది ఈ సంవత్సరం మరింత గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
Advertisement
Advertisement