ల్యాంకో పవర్ వాటాల రేసులో 4 సంస్థలు?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ భారం తగ్గించుకునే దశగా విద్యుత్ వ్యాపార విభాగంలో వ్యూహాత్మక ఇన్వెస్టర్ల వేటలో ఉన్న ల్యాంకో గ్రూప్ తాజాగా నాలుగు సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. టాటా పవర్, పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ మొదలైనవి ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 8,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఆరు థర్మల్ పవర్ ప్లాంట్లున్న ల్యాంకో విద్యుత్ వ్యాపార విభాగం విలువ సుమారు రూ. 45,000 కోట్ల మేర ఉంటుందని అంచనా. మెగావాట్‌కు రూ. 4.5 కోట్లు చొప్పున (సుమారు రూ. 36,000 కోట్లు) కంపెనీ కోరుతుండగా, బిడ్డర్లు సుమారు రూ. 3 కోట్లు (దాదాపు రూ. 24,000 కోట్లు) కోట్ చేస్తున్నట్లు సమాచారం.
ల్యాంకోగ్రూప్‌నకు రుణాలిచ్చిన వాటిల్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి ఉన్నాయి. మరోవైపు, వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా తాము వివిధ పెట్టుబడి అవకాశాలు పరిశీలిస్తుంటామని, ప్రస్తుతానికైతే ల్యాంకో పవర్ వాటాల కొనుగోలు ప్రతిపాదనేదీ తమ బోర్డు ముందుకు రాలేదని పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ వివరణనిచ్చింది. ఇవన్నీ పూర్తిగా ఊహాజనిత వార్తలేనని, తాము దీనిపై చర్చలేమీ జరపడం లేదంటూ అటు టాటా పవర్ కంపెనీ స్పష్టం చేసింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సైతం వాటాల కొనుగోలు వార్తలను తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని తెలిపింది. శుక్రవారం బీఎస్‌ఈలో ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ షేర్లు దాదాపు 12 శాతం ఎగిసి రూ. 4.92 వద్ద ముగిశాయి.