న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేకపోవడంతో మరో స్టార్టప్ సంస్థ మూతబడింది. టెక్ దిగ్గజం నందన్ నీలేకని ఇన్వెస్ట్ చేసిన షాప్‌ఎక్స్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నాయి. అత్యంత స్వల్ప మార్జిన్ల వల్ల వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎడ్‌టెక్ స్టార్టప్‌లు క్రెజోడాట్‌ఫన్, సూపర్‌లెర్న్, ప్రోటాన్ తదితర స్టార్టప్‌లు మూతబడ్డాయి.
కిరాణా స్టోర్స్, ఇతర చిన్న తరహా రిటైలర్లకు లాజిస్టిక్స్, కొనుగోళ్లపరమైన సహకారం అందించేందుకు 2014లో అమిత్ శర్మ, అపూర్వ జోయిస్ కలిసి షాప్‌ఎక్స్ ఏర్పాటు చేశారు. నందన్ నీలేకనితో పాటు ఫంగ్ స్ట్రాటెజిక్ హోల్డింగ్స్, రాజేశ్ రణావత్, కేవల్ నోరియా తదితర ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ 2020 నాటికి 60 మిలియన్ డాలర్లు సమీకరించింది. తీవ్రమైన పోటీతో తరచూ వ్యాపార వ్యూహాలను మార్చుకున్నప్పటికీ మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. నిధుల కొరత కారణంగా తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment