కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 1873 నుంచి అంటే గత 150 ఏళ్లుగా నడుస్తున్న ట్రామ్ సేవలకు త్వరలో స్వస్తి చెప్పనున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సవాళ్ల పరిష్కారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే కేవలం ఒక ట్రామ్ సర్వీసును కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోల్‌కతాలో చారిత్రాత్మక రవాణా సర్వీసులను నిలిపివేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సులలో తాము సాగించిన ప్రయాణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ట్రామ్ బస్సుల శకం ముగిసిందని, అయితే ప్రయాణికులు ఎప్పటికీ చెక్క బెంచీలపై కూర్చుని ప్రయాణించడాన్ని మరచిపోరని పలువురు అంటున్నారు.
తెలుపు, నీలి రంగుల ట్రామ్‌లు బెంగాలీల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. కోల్‌కతా నగరాన్నికున్న గుర్తింపులో ట్రామ్ బస్సులకు ప్రత్యేక స్థానం ఉంది. సోషల్ మీడియాలో ఒక యూజర్ భావోద్వేగానికి గురవుతూ ‘ఒక శకం ముగిసింది. కోల్‌కతాలో 150 ఏళ్ల ట్రామ్ వారసత్వం ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక అధ్యాయం ముగింపుతో, చరిత్రలోని ఒక ఘనమైన అధ్యాయానికి వీడ్కోలు పలుకుతున్నాం. రాబోయే తరాలు ట్రామ్‌ల గురించి ఫోటోలు, వీడియోలను చూసి మాత్రమే తెలుసుకోగలుగుతాయి’ అని రాశారు.
మరొక యూజర్ ‘కోల్‌కతాలో 150 ఏళ్ల వారసత్వ రవాణా వ్యవస్థ ట్రామ్ బంద్ అవుతోంది. కోల్‌కతా వీధుల్లో దీనిని మిస్ అవుతున్నాం’ అని రాశారు. ఇంకొక యూజర్ ‘కోల్‌కతాలోని పురాతన ట్రామ్ వ్యవస్థను నిలిపివేస్తున్నందుకు అభినందనలు. దానిని ఆధునీకరించడానికి బదులుగా, నిలిపివేస్తున్నారు. చరిత్రను చెరిపివేయగలిగినప్పుడు, దానిని ఇంకా ఎందుకు భద్రపరచాలి?" అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు పర్యావరణ అనుకూల రవాణా అవసరమా?’ అంటూ ఆవేదనతో ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఒక పోలీసు వీరమరణం
Comments
Please login to add a commentAdd a comment