న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయి సేవలను నిలిపివేసిన జెట్ ఎయిర్‌వేస్ ఉదంతంలో భారీ కుట్ర చోటుచేసుకుందా? తాజాగా జెట్ పైలట్ల ఆరోపణలతో ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగుతోంది. కంపెనీలో ప్రధాన వాటాదారు అయిన ఎతిహాద్ ఎయిర్‌వేస్, ఎస్‌బీఐ కలిసి ఈ కుట్రకు తెరతీసాయని... దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు కోరారు. కంపెనీ షేరు ధరను స్టాక్ మార్కెట్లో కుప్పకూల్చడం ద్వారా ఎతిహాద్ జెట్‌లో మరో 25 శాతం వాటాను చేజిక్కించుకోవాలనుకుందని, అందుకే ఈ కుట్రకు తెరతీశారని పైలట్లు ఆరోపించారు. తద్వారా కంపెనీని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకోవాలనేది ఆ కంపెనీ వ్యూహమన్నారు. జెట్ ఎయిర్‌వేస్‌లో యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు ప్రస్తుతం 24 శాతం వాటా ఉంది.
రోజువారీ కార్యకలాపాలకు కూడా నిధులు లేకపోవడంతో జెట్ సేవలను ఇటీవలే తాత్కాలికంగా నిలిపివేశారు. జెట్ ప్రమోటర్ నరేశ్ గోయల్ తన వాటా షేర్లను తనఖా పెట్టి రూ.1,500 కోట్ల తాజా నిధులను అందించేందుకు సిద్ధపడినా.. ఎస్‌బీఐ ముందుకు రాలేదని, ఎతిహాద్ కూడా ఈ కష్టకాలంలో కావాలనే సహాయ నిరాకరణకు పాల్పడిందని పైలట్లు పేర్కొన్నారు. జెట్ పతనం వెనుక ఎతిహాద్ పాత్రను దర్యాప్తు చేసి నిగ్గుతేల్చాలని ప్రధానిని అభ్యర్థించారు.గురువారం బీఎస్‌ఈలో మరో 20 శాతం మేర దిగజారి రూ.122కు పడిపోయింది. చివర్లో కాస్త కోలుకుని 12% నష్టంతో రూ.135 వద్ద ముగిసింది.
జెట్ క్రాష్‌లో ఎతిహాద్ కుట్ర!
Published Fri, May 3 2019 12:51 AM | Last Updated on Fri, May 3 2019 12:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment