సాక్షి, హైదరాబాద్: ఎల్‌ఈపీఎల్ ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు వచ్చిన కథనాలపై ఆ కంపెనీ అధినేత లింగమనేని రమేశ్ క్లారిటీ ఇచ్చారు. లింగమనేని ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు ప్రకటించాలని తాము కోరలేదని తెలిపారు. జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఎయిర్ కోస్తా ఒప్పందంలో కొన్ని సమస్యలొచ్చాయని, వాటిని పరిష్కరించుకునేలోపే సదరు సంస్థ.. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసిందని లింగమనేని రమేశ్ చెప్పుకొచ్చారు.
జర్మన్ సంస్థ పిటిషన్ ఆధారంగా కంపెనీ లా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ వ్యవహారంతో ఎల్ఈపీఎల్‌లోని ఇతర కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తమ ఆర్ధిక పరిస్థితులు బాగాలేవంటూ వచ్చిన కథనాలను తోసిపుచ్చిన ఆయన.. ఆర్థికంగా తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు. గతంలో తమ రుణదాతలకు చెల్లింపులు చేయలేని పరిస్ధితి ఎప్పుడూ లేదని అన్నారు.
1996లో విజయవాడలో రిజిస్టరైన లింగమనేని రమేశ్‌కు చెందిన ఎల్‌ఈపీఎల్ ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు ఈ నెల 14న కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలైంది. తీసుకున్న రుణాలు చెల్లించలేనంటూ లింగమనేని కంపెనీ చేతులెత్తేయడంతో రుణాలు ఇచ్చిన కంపెనీలకు ఈ నెల 29 వరకు ఎన్సీఎల్టీ అనుమతి ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి.
లింగమనేనికి చెందిన ఎల్‌ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దివాలాకు సంబంధించి దినపత్రికల్లో ప్రచురితమైన బహిరంగ ప్రకటన ఇది
Comments
Please login to add a commentAdd a comment