
న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగవేసిన విద్యుత్ కంపెనీలపై దివాలా చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు మార్గం సుగమం అయింది. మొండి బకాయిలుగా (ఎన్‌పీఏ) మారి 180 రోజుల్లోపు పరిష్కారం లభించని ఖాతాలను బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించాలని ఆర్‌బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 12న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాగా, దీనికి వ్యతిరేకంగా విద్యుత్ కంపెనీలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే, ఈ దశలో మధ్యంతర ఆదేశాల జారీ కుదరదని కోర్టు సోమవారం స్పష్టం చేసింది. వాస్తవాలను నమోదు చేసిన తర్వాత ఈ అంశంలో ప్రత్యేకంగా కోర్టును ఆశ్రయించొచ్చని పిటిషన్లకు అవకాశం ఇచ్చింది.
ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)లోని సెక్షన్ 7 కింద రుణదాతలు చర్యలు చేపట్టకుండా ఈ ఆదేశాలు నిరోధించవని కూడా కోర్టు స్పష్టం చేసింది. మార్చి 1 నాటికి మొండి బకాయిలుగా మారి పరిష్కారం లభించని ఖాతాలను ఎన్‌సీఎల్‌టీకి నివేదించాల్సిన గడువు ఆగస్ట్ 27తో ముగిసింది. అయితే, చట్టంలోని సెక్షన్ 7 కింద ఆర్‌బీఐతో సంప్రదింపులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు కోరింది. ఈ సెక్షన్ కింద ప్రజాప్రయోజనాల కోణంలో ఆర్‌బీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేయగలదు.
విద్యుత్ రంగానికి సంబంధించి ఎన్‌పీఏలు, రుణ ఎగవేతలు మార్చి నాటికి రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్నాయని విద్యుత్ రంగానికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక తెలియజేస్తోంది. అయితే, విద్యుత్ కంపెనీల రుణ భారం వెనుక డిస్కమ్‌ల చెల్లింపులు ఆలస్యం కావడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల లేమి, బొగ్గు సరఫరా సక్రమంగా లేకపోవడం తదితర కారణాలుగా కంపెనీలు, విద్యుత్ శాఖ పేర్కొంటుండడం గమనార్హం. ఈ కారణాల నేపథ్యంలో 180 రోజుల గడువును పొడిగించాలన్నది విద్యుత్ కంపెనీల డిమాండ్. కాగా, కోర్టు ఆదేశాల పట్ల నిరాశ చెందామని ప్రభుత్వరంగ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పీవీ రమేష్ పేర్కొన్నారు.
త్వరలో ఆర్‌బీఐతో కేంద్రం సంప్రదింపులు
అలహాబాద్ హైకోర్టు సూచన మేరకు కేంద్ర విద్యుత్ శాఖ త్వరలోనే విద్యుత్ కంపెనీల ఎన్‌పీఏల విషయమై ఆర్‌బీఐతో సంప్రదింపులు జరపనుంది. ఎన్‌పీఏ ఖాతాలకు 180రోజుల్లోగా పరిష్కారం కొనుగొనాలని లేని పక్షంలో ఎన్‌సీఎల్‌టీకి నివేదించాలన్న ఆర్‌బీఐ ఆదేశాలను సవరించాలని కోరే అవకాశం ఉందని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.
ప్రొవిజనింగ్‌పై ప్రభావమేమీ ఉండదు: ఎస్‌బీఐ
దాదాపు 70 భారీ మొండిపద్దుల పరిష్కారంపై ఆర్‌బీఐ విధించిన డెడ్‌లైన్ ముగిసినప్పటికీ.. బ్యాంకుల ప్రొవిజనింగ్‌పై పెద్ద ప్రభావమేమీ ఉండదని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. బ్యాంకులు ఇప్పటికే ఆయా ఖాతాలకు సంబంధించి తగినంత కేటాయిం పులు చేశాయని, పరిష్కార ప్రక్రియ కొనసాగిస్తున్నాయని ఐబీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. దాదాపు రూ.1.74 లక్షల కోట్లు బాకీ పడిన 34 మొండిపద్దుల్లో .. 16 ఖాతాలను ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీకి నివేదించినట్లు, మరో ఏడు పద్దుల పరిష్కార ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు రజనీష్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment