గృహోపకరణాలు, ఆహార నిల్వ కోసం ఉపయోగించే వస్తువులను విక్రయించే అమెరికన్ కంపెనీ 'టప్పర్‌వేర్' (Tupperware) దివాలా అంచున ఉన్నట్లు సమాచారం. ఒకప్పుడు ప్లాసిక్ బాక్సుల తయారీలో విప్లవం సృష్టించిన కంపెనీ నేడు కష్టకాలంలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
ఈ విషయం తెలిసిన తరువాత న్యూయార్క్‌లో మధ్యాహ్నం కంపెనీ షేర్లు 50 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. 1946లో రసాయన శాస్త్రవేత్త ఎర్ల్ టప్పర్ స్థాపించిన ఈ కంపెనీ 1950లలో అధిక ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా మంచి అమ్మకాలను పొందిన ఈ సంస్థ అమ్మకాలు 2024 త్రైమాసికంలో క్షీణించాయి.
టప్పర్‌వేర్ దాని రుణ నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత కోర్టు రక్షణలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. అంతే కాకుండా 700 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ రుణాలను ఎలా నిర్వహించాలనే దానికి సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలు
గత కొంత కాలం నుంచి ఆశించిన స్థాయిలో అమ్మకాలతో ముందుకు సాగకపోవడంతో.. కంపెనీ ఆర్థిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని జూన్‌లో 150 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతే కాకుండా కంపెనీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిగ్యుల్ ఫెర్నాండెజ్, పలువురు బోర్డు సభ్యులను భర్తీ చేసింది. అయినప్పటికీ పరిస్థితులు తారుమారయ్యాయి. దివాళాకు సంబంధించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment