న్యూఢిల్లీ: దివాలా పిటిషన్ దాఖలు చేసిన విమానయాన సంస్థ గో ఫస్ట్ నుంచి తమ విమానాలను తిరిగి పొందే విషయంలో లీజర్లు వెనక్కు తగ్గడం లేదు. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తమ విమానాలను డీరిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఇప్పటికే నిరాకరించిన డీజీసీఏను తప్పు పడుతూ ఈ నిర్ణయం ఎంతమాత్రం సమర్థనీయం కాదని తెలిపారు.
దీనిపై వాదనలు విన్న జస్టిస్ తారా వితస్తా గంజు ఈ పిటిషన్ విచారణను వాదనల నిమిత్తం మే 30న లిస్ట్ చేయాలని ఆదేశించారు. ఆలోగా లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలని ప్రతిపాదులను ఆదేశించారు. హైకోర్టును ఆశ్రయించిన లీజర్లలో ఆక్సిపిటర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎయిర్‌క్రాఫ్ట్ 2 లిమిటెడ్, ఈఓఎస్ ఏవియేషన్ 12 (ఐర్లాండ్) లిమిటెడ్, పెంబ్రోక్ ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ 11 లిమి టెడ్, ఎస్‌ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ లిమిటెడ్ ఉన్నాయి.
► ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్‌కు మే నెల 10వ తేదీన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) కాస్త ఊరటనిస్తూ, కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది.
► తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనట్లయ్యింది. సంక్షోభంలో పడిన వాడియా గ్రూప్ సంస్థ– గో ఫస్ట్ నుండి తమ విమానాలను వెనక్కి తీసుకునేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ లీజర్లు చేసిన ప్రయత్నాలకు తక్షణం అడ్డుకట్ట పడింది.
► దీనితో ఎన్‌సీఎల్‌టీ రూలింగ్‌ను సవాలు చేస్తూ, విమాన లీజర్లు ఎస్‌ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్, జీవై ఏవియేషన్, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్స్, ఇంజిన్ లీజింగ్ ఫైనాన్స్ బీవీ (ఈఎల్‌ఎఫ్‌సీ) సంస్థలు.. ఎన్‌సీఎల్‌ఏటీలో అప్పీల్ చేశాయి. అయితే ఈ అప్పీళ్లను చైర్‌పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల అప్పిలేట్ బెంచ్ తోసిపుచ్చింది.
► దీనిని ఆయా సంస్థలు సుప్రీంలో అప్పీల్ చేయవచ్చన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే గో ఫస్ట్ అత్యున్నత న్యాయస్థానంలో నాలుగు కేవియెట్లను దాఖలు చేసింది.
► గో ఫస్ట్‌కు రూ. 11,463 కోట్ల ఆర్థిక భారం ఉండగా, 7,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. మే 3వ తేదీ నుంచి గో ఫస్ట్ సేవలు నిలిచిపోయాయి.
► మరోవైపు 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని గో ఫస్ట్‌కు డీజీసీఏ సూచించడం మరో విషయం.
గోఫస్ట్ సేవల సన్నద్ధతపై డీజీసీఏ ఆడిట్
గోఫస్ట్ సేవల పునరుద్ధరణకు అనుమతించే ముందు, సన్నద్ధతపై పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆడిట్ చేయనుంది. ఆర్థిక సంక్షోభంతో గోఫస్ట్ మే 3 నుంచి విమానయాన కార్యకలాపాలు నిలిపివేసి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముందు దివాలా పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ దివాలా పరిష్కార చర్యల పరిధిలో ఉంది. ఇలా సేవలను అర్థంతరంగా నిలిపివేయడంపై గోఫస్ట్‌కు డీజీసీఏ షోకాజు నోటీసు జారీ చేయగా.. దీనికి స్పందనగా వీలైనంత త్వరగా ఫ్లయిట్ సేవలు ప్రారంభించే ప్రణాళికపై పనిచేస్తున్నట్టు బదులిచ్చింది.
ఈ విషయాన్ని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు గోఫస్ట్ కూడా తన ఉద్యోగులకు ఇదే విషయమై సమాచారం పంపింది. రానున్న రోజుల్లో మన సేవల సన్నద్ధతపై డీజీసీఏ ఆడిట్ నిర్వహిస్తుందని, నియంత్రణ సంస్థ ఆమోదం లభిస్తే వెంటనే కార్యకాలపాలు ప్రారంభిస్తామని వారికి తెలియజేసింది. కార్యకలాపాలు ప్రారంభానికంటే ముందే ఏప్రిల్ నెల వేతనాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని సంస్థ సీఈవో భరోసా ఇచ్చారు. అలాగే, వచ్చే నెల నుంచి ప్రతీ నెలా మొదటి వారంలో వేతనాలను చెల్లించనున్నట్టు గోఫస్ట్ ఆపరేషన్స్ హెడ్ రంజింత్ రంజన్ ఉద్యోగులకు తెలిపారు.
జెట్ ఎయిర్‌వేస్ కేసులో కన్సార్షియంకు ఊరట
ఇదిలావుండగా, సేవలను నిలిపిచేసిన జెట్ ఎయిర్‌వేస్ పునరుద్ధరణ దిశలో అప్పీలేట్ ట్రిబ్యునల్– ఎన్‌సీఎల్‌ఏటీ కీలక రూలింగ్ ఇచ్చింది. ఎయిర్‌వేస్ విజేత బిడ్డర్ జలాన్ కల్రాక్ కన్సార్షియం చెల్లింపు బాధ్యతలను నెరవేర్చడానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటికే కన్సార్షియం అందించిన రూ. 175 కోట్ల ఫెర్మార్మెన్స్ బ్యాంక్ గ్యారెంటీని ఎన్‌క్యాష్ చేయవద్దని రుణదాతలను ఆదేశించింది. ఇప్పటికే రెండుసార్లు 2022 నవంబర్ 16, 2023 మార్చి 3వ తేదీల్లో కన్సార్షియం రుణ చెల్లింపుల కాలపరిమితిని రెండుసార్లు అప్పిలేట్ ట్రిబ్యునల్ పొడిగించింది. కేసు తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది.
కాగా, జెట్ ఎయిర్‌వేస్ కేసులో చెల్లించనున్న రూ. 150 కోట్ల పెర్ఫార్మెర్స్ బ్యాంక్ గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేయకుండా ప్రధాన రుణ దాత ఎస్‌బీఐని నిరోధించాలని కోరుతూ విన్నింగ్ బిడ్డర్ జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన పటిషన్‌పై మే 30న ఉత్తర్వులు జారీ చేస్తామని అప్పీలేట్ ట్రిబ్యునల్ తెలిపింది. జెట్ ఎయిర్‌వేస్ కన్సార్షియం – రుణదాతల మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో అప్పీలేట్ ట్రిబ్యునల్ కీలక సూచనలు చేస్తూ పరిష్కార ప్రణాళికను అమలు చేయడానికి పరస్పరం సహకరించుకోవాలని రెండు పక్షాలనూ కోరింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ 2019 ఏప్రిల్ 18న కార్యకలాపాలను నిలిపివేసింది. క్యారియర్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ జూన్ 2019లో ప్రారంభమైంది. 2021 జూన్‌లో కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, ప్రణాళిక ఇంకా అమలు కాలేదు. దీని ఫలితంగా క్యారియర్ భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment