‘మహీంద్రా’ శాంగ్‌యాంగ్‌ దివాలా | Mahindra SsangYong Motor Files For Bankruptcy | Sakshi
Sakshi News home page

‘మహీంద్రా’ శాంగ్‌యాంగ్‌ దివాలా

Published Tue, Dec 22 2020 11:12 AM | Last Updated on Tue, Dec 22 2020 11:12 AM

Mahindra SsangYong Motor Files For Bankruptcy - Sakshi

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం మహీంద్రా గ్రూప్‌లో భాగమైన దక్షిణ కొరియా కంపెనీ శాంగ్‌యాంగ్‌ మోటార్‌ (ఎస్‌వైఎంసీ) దివాలా తీసింది. నష్టాలు, భారీ రుణభారంతో కుదేలవడమే ఇందుకు కారణం. దివాలా చట్టం కింద  పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియకు అనుమతించాలంటూ సియోల్‌ దివాలా కోర్టులో శాంగ్‌యాంగ్‌ దరఖాస్తు చేసినట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వెల్లడించింది. పునర్‌వ్యవస్థీకరణపరమైన మద్దతుకు కోర్టు ఆమోదముద్ర వేసిన పక్షంలో.. బోర్డు పర్యవేక్షణలో రుణదాతలు మొదలైన వర్గాలతో పునరుద్ధరణ ప్యాకేజీపై కంపెనీ చర్చలు జరపగలదని పేర్కొంది. ఎస్‌వైఎంసీ దాఖలు చేసిన పత్రాలు, దరఖాస్తు ఆధారంగా పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియకు అనుమతించాలా లేదా అన్నది సియోల్‌ దివాలా కోర్టు నిర్ణయం తీసుకుంటుందని ఎంఅండ్‌ఎం పేర్కొంది. దాదాపు రూ. 408 కోట్ల రుణాన్ని ఇటీవల తిరిగి చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. శాంగ్‌యాంగ్‌ విఫలమైంది.

నష్టాల్లో ఉన్న శాంగ్‌యాంగ్‌ను ఎంఅండ్‌ఎం 2010లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దాన్ని లాభాల బాట పట్టించేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యపడలేదు. శాంగ్‌యాంగ్‌లో ఎంఅండ్‌ఎంకు 75 శాతం వాటా ఉంది. ఇప్పటిదాకా 110 మిలియన్‌ డాలర్ల పైగా ఇన్వెస్ట్‌ చేసింది. 2017 నుంచి శాంగ్‌యాంగ్‌ నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటితో పాటు రుణ భారం దాదాపు రూ. 680 కోట్లకు పెరిగిపోయింది. మరింతగా పెట్టుబడులు పెట్టాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో శాంగ్‌యాంగ్‌ ప్రతిపాదించినప్పటికీ.. ఎంఅండ్‌ఎం తిరస్కరించింది. (చదవండి: 5జీ స్మార్ట్‌ఫోన్‌ కావాలంటున్నారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement