న్యూయార్క్: ఆఫీస్ స్పేస్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అంతర్జాతీయ దిగ్గజం వుయ్‌వర్క్ దివాలా ప్రకటించింది. వ్యాపారాన్ని యథాప్రకారం కొనసాగిస్తూ, కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించుకునే దిశగా అమెరికాలో చాప్టర్ 11 దివాలా పిటిషన్ దాఖలు చేసింది. వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. కమర్షియల్ ఆఫీస్ లీజుల పోర్ట్‌ఫోలియోను మరింత క్రమబద్దికరించుకోనున్నట్లు పేర్కొంది.
రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే దిశగా పునర్‌వ్యవస్థీకరణ విషయంలో తోడ్పాటు అందించేలా సంబంధిత వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. అమెరికా, కెనడా వెలుపలి దేశాల్లోని తమ కార్యకలాపాలపై ఈ పరిణామ ప్రభావం ఉండబోదని వుయ్‌వర్క్ వివరించింది. సమస్యలను పరిష్కరించుకుని, వ్యాపారాన్ని మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగడంపై దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఈవో డేవిడ్ టోలీ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ ఈ ఏడాది ప్రథమార్ధంలో 696 మిలియన్ డాలర్ల నష్టం నమోదు చేసింది. జూన్ 30 నాటికి వుయ్‌వర్క్‌కు 39 దేశాల్లో 777 చోట్ల కార్యకలాపాలు ఉన్నాయి.
అప్పట్లో 50 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ ..
గతంలో దాదాపు 50 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో వెలుగొందిన వుయ్‌వర్క్ దివాలా తీయడానికి అనేక కారణాలు ఉన్నాయి. అతి దూకుడుగా విస్తరించడం, వ్యవస్థాపకుడు ఆడమ్ న్యూమాన్ పోకడలు మొదలైనవి ఇందుకు దారితీశాయి. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం నుంచే దివాలా సంకేతాలు కనిపించడం మొదలైంది. 2019లో తొలి పబ్లిక్ ఇష్యూ ప్రయత్నం ఘోరంగా విఫలం కాగా ఆ తర్వాత 2021లో ఐపీవోకి వచ్చినా వేల్యుయేషన్ అనేక రెట్లు తగ్గి 9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతకన్నా ముందే కంపెనీ, వ్యవస్థాపకుడి పనితీరుపై ఇన్వెస్టర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో.. న్యూమాన్ ఉద్వాసనకు గురయ్యారు.
సంస్థలో మెజారిటీ వాటాలు తీసుకున్న జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్.. కంపెనీని నిలబెట్టేందుకు ప్రయత్నించింది. నిర్వహ ణ వ్యయాలను తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం వంటి ప్రయత్నాలు జరిగినా పెద్దగా ఫలితం లేకపోయింది. వ్యాపారాన్ని కొనసాగించే సామర్థ్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటూ వుయ్‌వర్క్ ఆగస్టులోనే వెల్లడించింది. ఆ తర్వాత లీజులన్నింటినీ పునఃసమీక్షించుకునే యోచనలో ఉన్నట్లు సెప్టెంబర్‌లో ప్రకటించింది. నష్టాల్లో ఉన్న లొకేషన్ల నుంచి వైదొలగనున్నట్లు తెలిపింది.
భారత్‌లో ప్రభావం ఉండదు..
వుయ్‌వర్క్ గ్లోబల్ దివాలా ప్రభావం భారత విభాగంపై ఉండదని వుయ్‌వర్క్ ఇండియా సీఈవో కరణ్ విర్వాణి స్పష్టం చేశారు. దివాలా ప్రక్రియలో భారత వ్యాపారం భాగంగా లేదని తెలిపారు. వుయ్‌వర్క్ ఇండియాలో రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్‌నకు 73 శాతం, వుయ్‌వర్క్ గ్లోబల్‌కు 27 శాతం వాటాలు ఉన్నాయి. భారత్‌లో ఏడు నగరాల్లో వుయ్‌వర్క్ ఇండియాకు 50 కేంద్రాలు ఉన్నాయి. 2021 జూన్‌లో వుయ్‌వర్క్ ఇండియాలో వుయ్‌వర్క్ గ్లోబల్ 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment