సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కేఎస్ జవహర్‌పై అసమ్మతి రగులుతోంది. టీడీపీలోని ద్విసభ్య కమిటీ ఒక వర్గం గానూ, నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగల మరో ముఖ్యనేత అచ్చిబాబు వర్గం మరోపక్క జవహర్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. నియోజకవర్గంలో వారి సానుభూతిపరులను ఏకం చేస్తున్నాయి.
రహస్య సమావేశాలు పెట్టి చర్చలు జరుపుతున్నాయి. జవహర్‌కు అసెంబ్లీ స్థానం కేటాయిస్తే మూకుమ్మడిగా వ్యతిరేకిస్తామని, తమ అభిప్రాయాన్ని కాదని అవకాశం కల్పిస్తే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈమేరకు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొవ్వూరులో ఈ రెండు వర్గాల నాయకులు గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ‘జవహర్ వద్దు – టీడీపీ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఈ పరిణామం కొవ్వూరు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
ముప్పిడిని బరిలోకి దింపే యోచన
కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును బరిలోకి దింపేందుకు ఈ రెండు వర్గాలూ పావులు కదుపుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ముప్పిడి పోటీని అంగీకరించారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు భరోసాతో ముప్పిడి రంగంలోకి దిగి నియోజకవర్గంలో పర్యటనలు ముమ్మరం చేశారు.
నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. గతంలో జవహర్‌తో ద్విసభ్య కమిటీలోని ఓ సభ్యుడైన జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి సన్నిహితంగా మెలిగారు. ఆ సాన్నిహిత్యంతో ఆయన ఆర్థికంగా ఎదిగినట్లు చెబుతారు. అనంతరం వారి మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలతో చౌదరి సైతం జవహర్‌కు దూరమయ్యారు. జవహర్ మంత్రిగా ఉన్న సమయంలో అచ్చిబాబు వర్గాన్ని వ్యతిరేకించడంతో ఆయన కూడా వ్యతిరేక కూటమి కట్టారు.
ఫ్లెక్సీల వివాదం
తమ పంతం నెగ్గించుకోడానికి ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు వర్గాలు దొరికిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇటీవల జవహర్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో వ్యక్తుల పేర్లకు బదులు గ్రామ టీడీపీ నేతలు అని పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు దొమ్మేరు గ్రామంలో వివాదంగా మారింది. ఓ వర్గం నేతలు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మరీ జవహర్‌పై విమర్శలు గుప్పించారు.
జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు
జవహర్‌కు వ్యతిరేకంగా తాజాగా మరో నినాదాన్ని తెర పైకి తీసుకువచ్చారు. ‘జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు’ అని ప్రచారం చేస్తున్నారు. గురువారం ఓచోట ఆత్మీయ సమావేశం పెట్టి మరీ విమర్శలు చేశారు. జవహర్‌ను కొవ్వూరు అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకోవద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 2014 నుంచి సీనియర్ నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టిన ఆయన వర్గ విభేదాలకు కారకుడయ్యారని ఆరోపించారు. నియోజకవర్గ నాయకులు పలుమార్లు హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోవడం లేదని అంటున్నారు.
జవహర్ వైపే అధినేత మొగ్గు
నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు వాటికి చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. సీటు ఎవరికన్న స్పష్టత ఇవ్వకపోవడంతో ఇరు వర్గాల మధ్య రోజు రోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి.
జవహర్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇదే జరిగితే జవహర్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న రెండు వర్గాలూ టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జవహర్‌ను కాదంటే ఆయన వర్గం వ్యతిరేకమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఈ వర్గ విభేదాలతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment