సాక్షి, తూర్పుగోదావరి: టికెట్ దక్కకపోవడంతో టీడీపీని వీడే యోచనలో మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జవహర్.. అధిష్టానం ఫోన్లకు సైతం స్పందించలేదు. జవహర్‌ను బుజ్జగించేందుకు ముప్పినేని వెంకటేశ్వర్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జవహర్‌ను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో చంద్రబాబు కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. కొవ్వూరు టికెట్‌ను జవహర్ ఆశిస్తుండగా, నిన్న ప్రకటించిన జాబితాలో కొవ్వూరు స్థానాన్ని ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించిన సంగతి తెలిసిందే. జవహర్.. కొవ్వూరులోని నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఇవాళో, రేపో టీడీపీని వీడే ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు ఘోర అవమానం ఎదురైందా? పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెట్టారా? ద్విసభ్య కమిటీలోని ఓ నేత ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకున్నారా? ఏళ్ల తరబడి పార్టీకి చేసిన సేవను లెక్క చేయకుండా పక్కన పెట్టేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల రెండో జాబితాలో ఆయనకు చోటు దక్కకపోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం గురువారం అధికారిక ప్రకటన చేసింది.
ఈసారి జవహర్‌కు కొవ్వూరు టికెట్టు దక్కనీయకుండా పార్టీలోని ఆయన వైరివర్గాలు బలంగా పని చేశాయి. దీంతో ఒకవేళ ఇక్కడ కాకపోయినా గత ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిన ఎన్‌టీఆర్ జిల్లా తిరువూరులోనైనా టికెట్టు ఇస్తారని జవహర్ వర్గం భావించింది. కానీ, అక్కడ టీడీపీ అభ్యర్థిగా కొటికలపూడి శ్రీనివాసరావును అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. దీంతో గోపాలపురం నియోజకవర్గానికై నా పంపుతారని భావించగా.. మద్దిపాటి వెంకట్రాజు పేరు ఖరారు చేసింది. ఇప్పుడు కొవ్వూరులో కూడా ముప్పిడి పేరు ప్రకటించడం ద్వారా అన్నిచోట్లా జవహర్‌కు చంద్రబాబు మొండిచేయే చూపారు. ఫలితంగా పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో మాత్రమే కొనసాగే పరిస్థితి జవహర్‌కు ఏర్పడింది. ఈ పరిణామంతో ఆయన రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
భగ్గుమన్న జవహర్ వర్గీయులు
పార్టీ జిల్లా అధ్యక్షుడు.. అందునా మాజీ మంత్రి అయిన జవహర్‌నే పక్కన పెట్టడం రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్‌గా మారింది. జిల్లా స్థాయి నేతనే ఇలా పరాభవిస్తే.. ఇక సామాన్య నేతలకు టీడీపీలో న్యాయం ఎలా జరుగుతుందన్న ప్రశ్న ఆయా వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. అధినేత నిర్ణయం జవహర్ వర్గీయులకు మింగుడు పడటం లేదు. తమ నేతకు చేసిన అవమానానికి పార్టీ తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని వారు సవాల్ విరుసుతున్నారు.
ఈ అవమానంపై వారు భగ్గుమన్నారు. కొవ్వూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ఫెక్ల్సీలను చించేశారు. అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. తాజా పరిణామాల నేపథ్యంలో జవహర్ తన వర్గీయులతో సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. జవహర్‌ను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం సుజయకృష్ణ రంగారావును పంపింది. పార్టీ ఆదేశాల మేరకు పని చేయాలని సూచిస్తున్నా జవహర్ ససేమిరా అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment