నియోజకవర్గ సమావేశానికి జవహర్‌కు అందని ఆహ్వానం
అలంకారప్రాయంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి
మాజీ మంత్రికి తప్పని పరాభవం
దళితుడనే వివక్ష అంటూ ఆయన వర్గీయుల ఆగ్రహం
టీడీపీలో సద్దుమణగని విభేదాలు
కొవ్వూరు: ‘పదవి గొప్ప.. మర్యాద సున్నా’ అన్నట్టుగా ఉంది మాజీ మంత్రి కేఎస్ జవహర్ పరిస్థితి. మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అయిన ఆయన తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. ఎంత చరిత్ర ఉంటేనేం.. ఎన్ని పదవులు ఉంటేనేం.. కొవ్వూరులో శనివారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయనకు కనీస ఆహ్వానం కూడా లేదు.
సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తొలిసారిగా మూడు పార్టీలతో టీడీపీ నేత పెండ్యాల అచ్చిబాబు ఆధ్వర్యాన ఈ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ సమావేశానికి జవహర్‌కు ఆహ్వానం లేకపోగా.. ఆ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సైతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన ఫొటోకు చోటు దక్కలేదు. దీనినిబట్టి దళిత సామాజికవర్గ నేతకు టీడీపీలో దక్కిన గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
దళితులపై చిన్నచూపు
కేవలం దళిత నేత కావడమే ఆయన చేసిన పాపమా? అంటూ టీడీపీ దళిత నాయకులు మండిపడుతున్నారు. ఆ పార్టీలో దళితులపై వివక్ష చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని ఆరోపిస్తున్నారు. తానెవరికీ తలవంచే ప్రసక్తే లేదని, పెత్తందార్ల పైనే తన పోరాటమని, పార్టీకి బానిసగా పని చేస్తానని పలు సందర్భాల్లో జవహర్ ఇప్పటికే ప్రకటించారు. అందుకే పెత్తందార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి జవహర్‌ను ఆహ్వానించలేదంటూ దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి జవహర్ వర్గీయులు గైర్హాజరయ్యారు. టీడీపీలో పెత్తందార్ల హవానే నడుస్తోందని చెప్పడానికి ఈ సమావేశమే ఓ ఉదాహరణని విమర్శిస్తున్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా
మరోవైపు జవహర్‌కు కొవ్వూరు టికెట్ కేటాయించాలని కోరుతూ దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యాన తాడేపల్లిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు దళిత, ప్రజా సంఘాలు, మాదిగ దండోరా నేతలు పాల్గొని పార్టీ పెద్దలకు వినతిపత్రం సమర్పించారు. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన డప్పు కళాకారులు, చర్మకారులు, ఎంఆర్‌పీఎస్ నాయకులతో పాటు నియోజకవర్గ దళిత నాయకులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో జవహర్‌కు టికెట్‌పై టీడీపీలో మరోసారి రచ్చ నడుస్తోంది. తాను పోటీలో ఉంటానని జవహర్ ఇప్పటికే ప్రకటించగా.. ఆయనను అచ్చిబాబు వర్గం పూర్తిగా పక్కన పెట్టి దూకుడుగా వ్యవహరించడంతో విభేదాలకు మళ్లీ ఆజ్యం పోసినట్టయ్యింది. ఎన్నికల వేళ టీడీపీలో విభేదాలు సద్దుమణగకపోవడం చూసి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment