పురిటి గడ్డ.. మరిచిపోదు నా బిడ్డ
- భారీగా విదేశీ పక్షుల సంతానోత్పత్తి
- మొదటి సారి గ్రేహెరాన్ పక్షుల గూళ్లు
- పెరుగుతున్న పర్యాటకులు
- కళకళలాడుతున్న ఆటపాక కేంద్రం
కైకలూరు, న్యూస్‌లైన్ : తన రెక్కల చాటున గుడ్లను ఉంచుకుని పొదుగుతున్న ఎర్రకాళ్ల కొంగలు.. వేటాడిన మేతను పిల్లల నోటికి అందిస్తున్న తల్లి పక్షులు... బుడిబుడి అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్న పక్షి పిల్లల విన్యాసాలు... పెలికాన్ పక్షి పిల్లల కిలకిలరావాలతో ఆటపాక పక్షుల కేంద్రం అలరారుతోంది. కొల్లేరు ఆపరేషన్‌కు పూర్వం ఆక్రమిత చేపల చెరువుల వల్ల కొల్లేరులో కాలుష్యం పెరిగి విదేశీ పక్షుల వల సలు తగ్గాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సహసోపేతంగా చేపట్టిన కొల్లేరు ఆపరేషన్ తరువాత పర్యావరణం పూర్వస్థితికి చేరింది. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద గతంలో ఎన్నడూ లేని విధ ంగా ఈ ఏడాది విదేశీ పక్షులు గూళ్లు నిర్మించుకుని భారీగా సంతానోత్పత్తి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 5 వేల పెలికాన్ పక్షులు, వాటి పిల్లలు 1500, పెయింటెడ్ స్టాక్ (ఎర్రకాళ్ల కొంగ) పక్షులు 2500, వాటి పిల్లలు 200, టీల్స్ (పరజలు) 2 వేలు, గ్లోబీ ఐబీస్ (కంకణాల పిట్ట) 500 ఉన్నాయి.
సాధారణంగా ఈ విదేశీ పక్షలు నవంబర్ నుంచి మార్చి నెల వరకు సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. గతంలో అంతంత మాత్రంగానే సంతానోత్పత్తి జరిగేది. ఈ సారి పరిస్థితులు అనుకూలించడంతో విదేశీ పక్షుల రాకపెరిగింది. వాటి సంతానోత్పత్తి కూడా భారీగా జరుగుతోంది. విదేశీ పక్షులు, వాటి పిల్లలను తిలకించేందుకు సందర్శకుల రాకకూడా పెరిగింది.
మొదటిసారి గ్రేహేరాన్ పక్షులు గూళ్లు
ఆటపాక పక్షుల కేంద్రం చరిత్రలోనే మొదటిసారి మిగిలిన పక్షులతో కలసి గ్రేహెరాన్ (నారాయణ కొంగ) పక్షులు గూడు నిర్మించాయి. ఇక్కడికి 100 గ్రేహేరాన్ పక్షులు వలస వచ్చాయి. వాటిలో ఒక జంట గూడు పెట్టింది. ఈ గూడులో ఆడపక్షి పెట్టిన మూడు గుడ్లలో నుంచి సోమవారం పిల్లలు బయటకొచ్చాయి. సాధారణంగా ఈ పక్షుల సంతానోత్పత్తి కొల్లేరు జమ్ము పొదల్లో ఎవరికంటా పడకుండా చేస్తాయి. ఈ పక్షి గూడును బహిరంగంగా ఎప్పుడూ చూడలేదని 35 సంవత్సరాల అనుభవమున్న ఫారెస్టు సిబ్బంది ఖాన్ పేర్కొన్నారు.