Gas pipelines
-
బోర్లతో బ్లో అవుట్లు
సాక్షి అమలాపురం : గ్యాస్ పైప్లైన్ల లీకేజీలు.. తద్వారా వెదజల్లే చమురు.. అప్పుడప్పుడూ బ్లో అవుట్లు.. పచ్చని కోనసీమలో ఇవి సర్వసాధారణం. కృష్ణా–గోదావరి బేసిన్ (కేజీ బేసిన్)లో గ్యాస్, చమురు వెలికితీత కార్యకలాపాలు మొదలైన తరువాత ఈ ప్రాంత వాసులకు ఇది నిత్యకృత్యంగా మారిపోయింది. వీటికి ఇప్పుడు ఆక్వాసాగు తోడైంది.చప్పనీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఉప్పునీటి కోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తుండడం.. వాటి నుంచి గ్యాస్, చమురు వచ్చి మినీ బ్లో అవుట్లుగా మారడం కోనసీమ వాసుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా.. రాజోలు మండలం చింతపల్లిలో బోరుబావి నుంచి భారీగా గ్యాస్ ఎగదన్నిన విషయం తెలిసిందే. అసలు కేజీ బేసిన్లో చమురు, గ్యాస్ వెలికితీతల సమయంలో పలు దుర్ఘటనలు చోటుచేసుకోవడం.. కొన్ని విషాదకరమైన చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చిన విషయం తెలిసిందే. జిల్లాలో అల్లవరం గ్రామాన్ని ఆనుకుని దేవర్లంక, అమలాపురం మండలం తాండవపల్లి వద్ద భారీ బ్లో అవుట్ చోటుచేసుకున్నాయి. నగరం గ్యాస్ పైప్‌లైన్ లీకవ్వడంవల్ల 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇవికాకుండా.. ఏదోక ప్రాంతంలో తరచూ గ్యాస్ పైప్లైన్ల లీకులు, చమురు లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి. మినీ బ్లో అవుట్లుగా మారిన ఆక్వా బోర్లు..ఆక్వా చెరువుల కోసం తవ్వుతున్న బోర్లు ఇప్పుడు మినీ బ్లో అవుట్లుగా మారిపోయాయి. అధిక ఉప్పు సాంద్రత (సెలైనిటీ) ఉన్న నీటికోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తున్నారు. వీటి ద్వారా గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తున్నాయి. ఇక్కడ భూమిలోని మట్టి పొరల్లో గ్యాస్ నిక్షిప్తమై ఉంది. రైతులు చప్పనీటి సాగు పేరుతో గ్రామీణ నీటి సరఫరా శాఖ నుంచి అనుమతి పొందుతున్నారు. 30–40 అడుగులు లోతున బోరు బావి తవ్వకాలు చేస్తే సరిపోతుంది. కానీ, ఆక్వా రైతులు అధిక ఉప్పు శాతం ఉన్న నీటి కోసం ఏకంగా 250 నుంచి 300 అడుగుల లోతున తవ్వేస్తున్నారు. దీంతో చాలాచోట్ల దిగువనున్న గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తోంది. బోరు అనుమతిచ్చే సమయంలోనే ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు బోరు తవ్వకాలపై పక్కాగా నిఘా పెట్టాల్సి ఉంది. ఇటీవల రాజోలు మండలం శివకోడు వద్ద ఓ ఆక్వా రైతు ఏకంగా 270 అడుగుల లోతున ఉప్పునీటి తవ్వకాలు చేయడంతో గ్యాస్ ఎగదన్ని ప్రమాదానికి కారణమైంది. అక్కడున్న గ్యాస్ లభ్యతను బట్టి ఒకట్రెండు రోజులు గ్యాస్ ఎగిసిపడుతుంది. ఒకప్పుడు సముద్ర తీర ప్రాంతాలు.. గ్రామ శివారుల్లో ఉండే ఆక్వా చెరువులు ఇప్పుడు జనావాసాల మధ్యకు వస్తున్నాయి. ఇటువంటి చోట గనుక బోరుబావుల నుంచి గ్యాస్ ఎగదన్ని మంటలు వ్యాపిస్తే ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటుంది. ఆక్వాసాగుతో పైపులైన్లకు దెబ్బ..నిజానికి.. ఆక్వాసాగు పెరగడంవల్ల ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలకు చెందిన పైప్లైన్లు తుప్పుపడుతున్నాయి. ఈ సాగువల్ల భూమిలో ఉప్పుశాతం పెరిగి 25 ఏళ్లు బలంగా ఉండాల్సిన ఈ గ్యాస్ పైప్లైన్లు 15 ఏళ్లకే దెబ్బతింటున్నాయి. అలాగే, సిస్మిక్ సర్వేల పేరుతో జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వేలాదిచోట్ల భూమి పొరల్లో బాంబింగ్ చేస్తోంది. వీటిని నిబంధనల మేరకు పూడ్చకుండా వదిలేస్తున్నారు. ఇటువంటి చోట నిల్వ ఉన్న గ్యాస్ అప్పుడప్పుడు ఎగదన్నుకు వచ్చి మంటలు చెలరేగుతున్నాయి. -
సచివాలయ వ్యవస్థ అద్భుతం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానసపుత్రిక, 540 రకాల ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటనే అందిస్తున్న సచివాలయ వ్యవస్థ అద్భుతమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. సచివాలయ వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లి దేశవ్యాప్తంగా అమలయ్యేలా కృషి చేస్తానన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులతో పాటు వ్యవసాయానికి సంబంధించిన సేవలను వారి గ్రామాల్లోనే అందించడం కూడా అభినందించదగ్గదని అన్నారు. ఆయన మంగళవారం రెండో రోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. రాష్ట్రంలో అతిపెద్దదైన విజయనగరం శివారు గుంకలాంలోని జగనన్న లేఅవుట్‌ను సందర్శించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ హౌసింగ్ కాలనీలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని అభివర్ణించారు. అనంతరం మన బడి నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన బొండపల్లి మండలం గొట్లాంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా కానుక, అమ్మఒడి తదితర పథకాల ఫొటో ప్రదర్శనను తిలకించారు. పూసపాటిరేగ మండలం కుమిలిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్నెస్ సెంటర్లను పరిశీలించారు. సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల సేవలను ఆయనకు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సచివాలయ వ్యవస్థ అద్భుతమని ప్రశంసించారు. ఆర్బీకేల సేవలను కలెక్టర్ ఎ.సూర్యకుమారి వివరించారు. అనంతరం విజయనగరంలోని మహారాజా జిల్లా కేంద్రాస్పత్రిలో పీడియాట్రిక్ ఐసీయూను కేంద్ర మంత్రి ప్రారంభించారు. క్యాన్సర్ రోగుల కోసం బ్లాక్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీలో రోడ్లకు అనుమతులు ఇప్పించండి ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు లేక గిరిజనులు అత్యవసర వైద్యాన్ని, విద్యను పొందలేకపోతున్నారని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 11 రహదారులకు అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని కోరారు. రెండేళ్లలో ఇంత అభివృద్ధా? సంక్షేమ పథకాలపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన, స్టాళ్లను కేంద్ర మంత్రి తిలకించారు. నీతిఆయోగ్, యాస్పిరేషన్ జిల్లా సూచీలపై సమీక్షించారు. గత రెండేళ్లలో అభివృద్ధిని అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రెండేళ్లలో ఇంత అభివృద్ధి జరగడంపై కేంద్ర మంత్రి అభినందించారు. జిల్లా మరింతగా అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు. తాను మరోసారి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లాల సరసన విజయనగరం ఉండాలని అభిలషించారు. 2025 నాటికి క్షయ, కుష్టు వ్యాధులను పూర్తిగా నిర్మూలించేందుకు సాఫ్ట్వేర్ సహా పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పీవీఎన్ మాధవ్, రఘురాజు, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, కంబాల జోగులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ పైపులైన్లు వేయటానికే గెయిల్!
న్యూఢిల్లీ: సహజ గ్యాసు పైపులైన్ల నిర్మాణంపై గెయిల్ దృష్టి సారించాలని, గ్యాస్ మార్కెటింగ్ ఎవరైనా చేయగలరని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. గెయిల్ నుంచి గ్యాస్ మార్కెటింగ్ వ్యాపారాన్ని వేరు చేయనున్నట్టు వస్తున్న వార్తలను బలపరిచే విధంగా మంత్రి ప్రకటన ఉండడం గమనార్హం. అయితే, ప్రభుత్వం గెయిల్‌ను రెండుగా చేయనుందన్న సమాచారాన్ని మంత్రి ధ్రువీకరించడం, ఖండించడం వంటివేమీ చేయలేదు. మౌలిక సదుపాయాల కల్పనను పర్యావరణ అనుకూలమైన సహజ గ్యాసు రూపంలో అనుసంధానం కాని ప్రాంతాలకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రాధాన్యంగా చెప్పారు. దేశాన్ని గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 1984లో ఓఎన్జీసీ నుంచి గ్యాస్ వ్యాపారాన్ని వేరు చేస్తూ ఏర్పాటు చేసిందే గెయిల్. దేశవ్యాప్తంగా 11,000 కిలోమీటర్ల సహజ గ్యాసు పైపులైన్ నెట్వర్క్ ఈ సంస్థ పరిధిలో ఉంది. గెయిల్ నుంచి గ్యాస్ మార్కెటింగ్ వ్యాపారాన్ని వేరు చేయాలన్న అంశంపై ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు సమావేశాలు కూడా నిర్వహించగా, తుది నిర్ణయానికి రాలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. -
గెయిల్ గప్‌చుప్!
దెబ్బతిన్న గ్యాస్ పైప్‌లైన్ ఆధునీకరణకు తటపటాయింపు తాటిపాక-విజయవాడ మధ్య దెబ్బతిన్న 130 కిలోమీటర్ల పైపులైన్ నగరం పేలుడు నేపథ్యంలో నిర్ధారించిన ఇంజనీర్స్ ఇండియా మొత్తం మార్చడానికి రూ.1,300 కోట్లవుతుందని అంచనా ప్రస్తుతం 54 కిలోమీటర్లకే పరిమితమవుతున్న గెయిల్ ఖర్చు రూ. 500 కోట్లకే పరిమితం సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ ప్రమాదం, ప్రాణనష్టం సంభవించినప్పటికీ...ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్) చేసిన సూచనకు భిన్నంగా గ్యాస్ పైప్‌లైన్ మొత్తం ఆధునీకరించేందుకు గెయిల్ సంస్థ తటపటాయిస్తోందా? విశ్వసనీయ సమాచారం ప్రకారం దీనికి అవుననే సమాధానం వస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గత జూన్ 27న జరిగిన గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడు దుర్ఘటనను తలుచుకుని ఇంకా ఈ ప్రాంత వాసులు ఉలిక్కిపడుతూనే ఉన్నారు. తగిన సామర్థ్యం లేకపోవడం, నిర్వహణ లోపం తదితర కారణాలతో జరిగిన ఈ ప్రమాదం 23 మందిని పొట్టన పెట్టుకుంది. ఆ విషాదం తరువాత కృష్ణా, గోదావరి బేసిన్‌లోని గెయిల్ గ్యాస్ పైపులైన్ వ్యవస్థను ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్) తనిఖీ చేసింది. ఆ పైపులైన్లను మార్చాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు నివేదించింది. ఇంత జరిగినప్పటికీ మొత్తం గ్యాస్ పైపులైన్ ఆధునీకరించే విషయంలో గెయిల్ తటపటాయిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. కేజీ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరాకు తాటిపాక-విజయవాడ, మోరి-రాజమండ్రి మధ్య ప్రధాన ట్రంక్ పైపులైన్లు ఉన్నాయి. పైపులైన్లో సహజవాయువుతోపాటు క్రూడాయిల్, నీరు కూడా పంపుతారు. ఈ నేపథ్యంలో పైపులైను కాలపరిమితిని పది, పన్నెండేళ్లుగా నిర్ధారిస్తారు. తాటిపాక రిఫైనరీ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ కేంద్రానికి 17 ఏళ్ల కిందట వేసిన పైపులైను నాణ్యత దెబ్బతిందని ఈఐఎల్ బృందం నిర్ధారించింది. దీంతో దానిని మారుస్తున్నారు. కిలోమీటరు పైపులైన్ మార్చాలంటే రూ.10 కోట్ల వరకూ ఖర్చవుతుందని చమురు సంస్థల అంచనా. తాటిపాక రిఫైనరీ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ కేంద్రానికి మధ్య 130 కిలోమీటర్ల మేర ఉన్న పైపులైను శిథిలమైంది. దీని స్థానంలో కొత్త ట్రంక్ పైపులైను ఏర్పాటు చేయాలంటే రూ.1,300 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూ.500 కోట్లతో 54 కిలోమీటర్ల మేర పైపులైన్‌ను మాత్రమే ఆధునీకరించాలని గెయిల్ సంస్థ నిర్ణయించింది. ఈ పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం శివకోడు-చింతలపల్లి మధ్య పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ కేజీ బేసిన్లో 18 అంగుళాల పైపులైన్లు ఉన్నాయి. నగరం ఘటన తర్వాత కొత్త పైపులైన్లను 24 అంగుళాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా పూర్తి కావడానికి నాలుగైదు నెలలు పడుతుందని అంచనా. అయితే ఇలా కొంతమేరకు పైపులైను మాత్రమే మార్చడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ విస్ఫోటం జరిగి పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగినప్పటికీ, మొత్తం పైపులైను మార్చడానికి గెయిల్ సంస్థ తటపటాయించడం విస్మయపరుస్తోందని వారంటున్నారు. మరోపక్క పైపులైను మార్చే పనులను సుమారు 15 విభాగాలుగా విభజించారు. ఇది పనుల నాణ్యతపై ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా మోరి-రాజమండ్రి ట్రంక్ పైపులైను నాణ్యతకు ఢోకా లేదన్న సమాచారంతో దీని ద్వారా గ్యాస్ సరఫరాను పునరుద్ధరించే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే విజ్జేశ్వరం పవర్ ప్లాంట్‌కు రోజుకు రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్లగ్యాస్ సరఫరా చేస్తున్నారు. మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్(జీసీఎస్)లో 26 గ్యాస్ బావులుండగా, ప్రస్తుతం ఐదింటి నుంచి సరఫరా జరుగుతోంది. -
బ్లో అవుట్ దెబ్బకు 180 మెగావాట్ల విద్యుత్ ఫట్!
హైదరాబాద్:ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో గెయిల్ గ్యాసు బ్లో అవుట్ దెబ్బ కాస్తా విద్యుత్ ఉత్పత్తిపై పడింది. లీకేజీ అయిన గెయిల్ ప్రధాన ట్రంకు లైను నుంచి నేరుగా ల్యాంకో ప్లాంటుకు గ్యాసు సరఫరా అవుతోంది. ఈ ప్లాంటుకు ఇప్పటివరకు రోజుకు 0.72 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాసు (ఎంసీఎండీ) సరఫరా అయ్యేది. తాజా బ్లో అవుట్‌తో ఇది నిలిచిపోయింది. ఫలితంగా 140 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా జీవీకే, రిలయన్స్, ఆంధ్రప్రదేశ్ గ్యాసు పవర్ కంపెనీ (ఏపీజీపీసీఎల్), స్పెక్ట్రమ్... మొత్తం నాలుగు గ్యాసు ఆధారిత ప్లాంట్లకు ఇదే లైను ద్వారా కొద్ది మొత్తంలో గ్యాసు సరఫరా అవుతోంది. ఇది కూడా తాజా ఘటనతో నిలిచిపోయింది. ఫలితంగా మరో 40 మెగావాట్ల విద్యుత్ నష్టపోయినట్టు ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే గ్యాసు బ్లో అవుట్ దెబ్బకు మొత్తం 180 మెగావాట్ల విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు నష్టపోవాల్సి వచ్చింది. ఈ గ్యాసు ప్లాంట్లతో పీపీఏ అమలులో ఉన్నాయి. ఇందులో తెలంగాణ వాటా 97 మెగావాట్లు కాగా ఆంధ్రప్రదేశ్ వాటా 83 మెగావాట్లు. -
జీసీఎస్ గ్రీన్‌బెల్టులో స్వల్పంగా గ్యాస్ లీక్
మామిడికుదురు(తూర్పుగోదావరి జిల్లా): గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటన నుంచి తేరుకోకముందే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్జీసీ గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) గ్రీన్‌బెల్ట్ ఏరియాలో స్వల్పంగా గ్యాస్ లీక్ అవడం స్థానికులను ఆదివారం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. రాజోలు మండలం పొన్నమండ-8 బావి నుంచి జీసీఎస్‌కు చమురు, సహజవాయు నిక్షేపాలను తరలించే పైపులైన్ నుంచి ఈ లీకేజీ జరిగింది. పొగ మాదిరిగా సహజవాయువుతోపాటు కొద్దిపాటి ముడిచమురు లీకవుతున్నట్టు స్థానికులు ఆదివారం సాయంత్రం గుర్తించారు. పదిరోజులుగా ఇది కొనసాగుతున్నట్టు సమాచారం. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఓఎన్జీసీ వైఖరిని నిరసిస్తూ 216 జాతీయ రహదారిపై ఆదివారం ధర్నాకు దిగారు. అయితే ఉత్పత్తి నిలిపివేసిన బావి నుంచి లీకేజీ వస్తోందని, అయినప్పటికీ లీకేజీని ఆపేశామని ఓఎన్జీసీ అధికారులు చెప్పారు. -
కునుకు లేకుండా చేస్తున్న మరో పైపులైన్
మామిడికుదురు: ‘నగరం’ మహా విస్ఫోటం కళ్లముందు కదలాడుతుండడంతో.. గెయిల్ సంస్థ తమ ఊళ్ల నుంచి వేసిన గ్యాస్ పైపులైన్లు నగరం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తరచూ అవి లీకవుతూ ఉండడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని తాటిపాక-కాకినాడ ట్రంక్ పైపులైన్ తరచూ మరమ్మతులకు గురవడం స్థానికులను భయానికి గురి చేస్తోంది. ఈ లైన్ వెళ్తున్న పాశర్లపూడిలో పైపులైన్లకు వారం రోజుల వ్యవధిలో కేవలం 500 మీటర్ల పరిధిలోనే ఆరుచోట్ల మరమ్మతులు చేశారు. భూమికి అయిదున్నర అడుగుల లోతులో ఏర్పాటు చేసిన 18 అంగుళాల పైపులైన్ల ద్వారా నిత్యం ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల సహజ వాయువు సరఫరా చేస్తున్నారు. నగరం నుంచి కాకినాడ వరకూ ఒకటి, తాటిపాక నుంచి సామర్లకోట వరకూ మరొకటి ఈ పైపులైన్లు ఉన్నాయి. ఈ లైన్లలో ఎక్కడ లీకేజీలున్నా దానిని గుర్తించే యూనిట్ తాటిపాక టెర్మినల్‌లో ఉంది. ఆ పైపులు తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, భారీ విధ్వంసానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. విజయవాడ ల్యాంకో ప్రాజెక్టుకు గ్యాస్ సరఫరా చేస్తున్న ఈ పైపులైన్ కంట్రోల్ యూనిట్ వాల్వ్ 10 కిలో మీటర్ల దూరంలోని దిండి గ్రామంలో ఉంది. ప్రమాద సమయానికి అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగి అందుబాటులో లేకపోవడమే విస్ఫోటానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ లీక్‌పై ఆందోళన రాజోలు మండలం పొన్నమండ-8 బావి నుంచి జీసీఎస్‌కు చమురు, సహజవాయు నిక్షేపాలను తరలించే పైపులైన్ నుంచి లీకేజీ జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఓఎన్జీసీ వైఖరిని నిరసిస్తూ ఆదివారం ధర్నాకు దిగారు. అయితే ఉత్పత్తి నిలిపివేసిన బావి నుంచి లీకేజీ వస్తోందని, దీనివల్ల ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. -
దారుణం, దుర్మార్గం
భూమి అట్టడుగు పొరల్లో దాగివున్న చమురు, సహజవాయు నిక్షేపాలను మొరటుగా, నిర్లక్ష్యంగా తోడేస్తున్న తీరు మరోసారి కోనసీమను విషాద సీమగా మార్చింది. 17 నిండుప్రాణాలను బలితీసుకుంది. మరెందరినో చావుబతుకుల్లోకి నెట్టింది. పచ్చటి ప్రకృతిని వల్లకాటిగా మార్చింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం వేకువజామున జరిగింది నిజానికి ప్రమాదం కాదు. ప్రమాదమంటే అనుకోకుండా ముంచుకొచ్చేది. అసంకల్పితం గా సంభవించేది. కోనసీమ నేలనుంచి నిత్యమూ పీల్చే చమురు, సహజవాయు నిక్షేపాలతో ఏటా వేల కోట్ల రూపాయలు గడిస్తున్న కంపెనీలకు...తమ పైప్లైన్లు ఎలాంటివో, వాటి నాణ్యత ఏపాటో తెలియదనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్లంతా పెద్ద చదువులు చదువుకున్నవారు. శాస్త్రవిజ్ఞానం ఉన్నవారు. ఆ అర్హతలతోనే సంస్థను నడుపుతున్నవారు. లక్షలకు లక్షలు జీతం అందుకుంటున్నవారు. నిర్దిష్టమైన ఒత్తిడితో ఉబికి వచ్చే సహజవాయువైనా, చమురైనా పైప్లైన్ల గోడలపై ఎలాంటి ప్రభావం చూపగలవో...బయటి వాతా వరణం పైప్లైన్ల నాణ్యతను ఎలా దెబ్బతీయగలదో లెక్కలుగట్టడం రాకకాదు. ఆ లెక్కలతో పైప్లైన్లను ఎన్నేళ్లకోసారి మార్చాలో తెలియకకాదు. తెలిసీ ఉపేక్షించడం నేరం. తెలియలేదంటే అజ్ఞానం. ఈ రెండూ ఆ సంస్థల్లో కీలక స్థానాల్లో ఉండేవారిని అనర్హులుగా మార్చే అంశాలు. నిందితులుగా పరిగణించే అంశాలు. నగరం గ్రామ ప్రజలు ఏడాదినుంచి గ్యాస్ లీక్ గురించి ఫిర్యాదు చేస్తున్నారు. కానీ, అవేవీ గెయిల్ అధికారుల చెవికెక్కలేదు. జనమంటే లెక్కలేదు...జనం ప్రాణాలంటే వీసమెత్తు విలువలేదు...ఇక వారి అభ్యంతరాలకూ, నిరసనలకూ, కోపతాపాలకూ చోటెక్కడ? దుర్ఘటనకు రెండు రోజులముందు కూడా గ్యాస్ లీకవుతున్నచోట సిమెంటుతో పూడ్చారని స్థానికులు చెబుతున్నారు. అలా చేస్తే సరిపోతుందని నిర్ణయం తీసుకున్నవారు, అందుకు ఆమోదం తెలి పినవారు ఈ ఘటనలో దోషులే అవుతారు. అయితే, జరుగుతున్న పరిణామాలను చూస్తే మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు ప్రారంభ మయ్యాయని అర్ధమవుతుంది. పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యంలేని ఒకరు ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పైప్లైన్ల నిర్వహణ చక్కగా ఉన్నదని కితాబునిచ్చారు. అంతేకాదు...గ్రామస్తుల నిర్లక్ష్యం కారణంగానే పైప్‌లైన్ పేలిందని భాష్యం చెప్పారు. బట్ట కాల్చి మీదేసే ఇలాంటి తత్వమే, బాధ్యతారాహిత్యమే, నిర్లక్ష్యమే నగరాన్ని బుగ్గి పాలు చేసింది. అసలు గ్యాస్ పైప్లైన్లను జనావాసాల మధ్యనుంచి, పంటపొలాల మధ్యనుంచి తీసుకెళ్లడమే నేరం. వీటిని తప్పిస్తూ తీసుకెళ్లడంవల్ల మరికొన్ని కిలోమీటర్ల నిడివిన పైప్లైన్లు వేయాల్సి రావొచ్చు. పర్యవసానంగా వ్యయం పెరగొచ్చు. అది మిగుల్చు కోవడానికి చేసిన ప్రయత్నం కోనసీమ జనావాసాలను ఇలాంటి విషాదాల్లోకి నెట్టేస్తున్నది. ఆ కంపెనీల కక్కుర్తి వేలాదిమంది ప్రజల ప్రాణాలను గాల్లో దీపంలా మారుస్తున్నది. గ్యాస్ తీసుకెళ్లే పైప్లైన్లన్నీ 20 ఏళ్లనాటివి. ఆ పైప్‌లు వేసేనాటికున్న సాంకేతిక విజ్ఞానం ఇప్పటికి ఎన్నో రెట్లు పెరిగింది. ఏ చిన్న లీకేజీనైనా పసిగట్టి హెచ్చరిక చేసే వ్యవస్థలూ వచ్చాయి. కానీ అడిగేవారెవరు? కనుకనే కోట్లాది రూపాయల వ్యయమయ్యే ఈ పనుల జోలికి వెళ్లడం వృథా అనుకున్నారు. ప్రమాదాలు అడపా దడపా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన రెండు దశాబ్దాలుగా నిత్యం ఏదో ఒకచోట చిన్నదో, పెద్దదో ఘటన సంభవిస్తూనే ఉన్నది. 1993, 1995ల్లో వచ్చిన బ్లో అవుట్లు కాక ఇప్పటికి అనేకానేకసార్లు గ్యాస్ లీక్ ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుమార్లు పైపులు పేలి పంట పొలాలు దెబ్బతిన్నాయి. గ్యాస్ నిక్షేపాలున్నాయని తెలిశాక కోనసీమ బతుకుచిత్రం మారిపోయింది. ఎన్నడూ చూడని భారీ వాహనాలొచ్చి రహదార్లను ధ్వంసంచేశాయి. అత్యంత సున్నితమైన పర్యావరణం క్రమేపీ దెబ్బతింటున్నది. పర్యవసానంగా కొబ్బరి, వరి దిగుబడులు తగ్గుతు న్నాయి. ప్రజారోగ్యంపై ఇది కలగజేస్తున్న ప్రభావం ఏమిటో అధ్యయనం చేయాల్సే ఉన్నది. గ్యాస్‌ను వెలికితీస్తున్నకొద్దీ ఆ ఖాళీలోకి సముద్రపు నీరు వచ్చిచేరుతున్నది. అందువల్ల బావుల్లోకి ఉప్పునీటి ఊట ప్రవేశిస్తున్నది. గొంతు తడుపుకోవడానికి కూడా నీళ్లులేవని స్థాని కులు గగ్గోలు పెడుతున్నా అది అరణ్యరోదనే అవుతున్నది. ఇలా జల, వాయు కాలుష్యాలు పెరుగుతున్నా, తరచుగా ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటున్నా జిల్లాస్థాయిలో ఉండే విపత్తుల నివారణ సంస్థ నిమ్మకు నీరెత్తినట్టున్నది. నివేదికలు పంపాల్సిన స్థానిక రెవెన్యూ సిబ్బందికీ పట్టదు. వీరు చురుగ్గా ఉంటే ఇన్ని ప్రమాదాలు జరిగేవి కాదు. కేజీ బేసిన్‌నుంచి తరలిపోతున్న గ్యాస్, చమురు నిక్షేపాలవల్ల ఇంత నష్టం సంభవిస్తున్నా ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఆర్థిక ప్రయోజన మూ సమకూరడంలేదు. సింగరేణి కాలరీస్‌లో ఉత్పత్తయ్యే బొగ్గులో తెలంగాణ రాష్ట్రానికి 50 శాతం వాటా ఇస్తుండగా ఆ సూత్రాన్నే గ్యాస్ కేటాయింపు విషయంలో ఎందుకు పాటించరని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్న సహేతుకమైనదే. ఈ విష యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని అందరినీ కలుపుకొని రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు పోరాడాల్సిన అవసరం ఉన్నది. నగరం ఘటనలో బాధితులకు పరిహారం ఇవ్వడంతో సరిపెట్టక, సానుభూతి వాక్యాలతో చేతులు దులుపుకోక భోపాల్ గ్యాస్ లీక్ కేసు తరహాలో పైప్లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినవారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టాలి. అలాగైతేనే ఈ తరహా ఘటనలను నివారించడం సాధ్యమవుతుంది. -
పైపులైన్ల పడగ
విశాఖ చుట్టూగ్యాస్ పైపులైన్ల ఉచ్చు పదుల సంఖ్యలో గ్యాస్, చమురు కంపెనీలు తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ దుర్ఘటనతో కలవరం విశాఖవాసుల్లో వణుకు విశాఖవాసులను గ్యాస్ ముప్పు కలవరపరుస్తోంది. నగరం చుట్టూ గ్యాస్ పైపులైన్లు ఉండడంతో ఏ క్షణాన ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో..ఏ పైపులైన్ లీకవుతుందోననే భయం వెన్నాడుతోంది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన గెయిల్ గ్యాస్ పైపులైను భారీ పేలుడు దుర్ఘటన నేపథ్యంలో నగరవాసుల్లో ఆందోళన మొదలయింది. నగరం చుట్టూ అత్యంత భారీ పైపులైన్లు పాతబడి ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పటికే నగరంలో హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీ, బీపీసీ టెర్మినల్ ప్లాంట్లు, గ్యాస్ కంపెనీలు భారీగా ఉన్నాయి. ఇవన్నీ నిత్యం గ్యాస్ లోడింగ్, అన్‌లోడింగ్‌తో ప్రమాద హేతువులుగా మారాయి. సాక్షి, విశాఖపట్నం : నగరం నుంచి హైదరాబాద్‌కు గెయిల్ సంస్థ భారీ పైపులైన్ వేసింది. రోజుకు 2.5 లక్షల గ్యాస్ సిలెండర్లను నింపగలిగే సామర్థ్యం ఈ పైపులైన్ సొంతం. ఆ పక్కనే హెచ్‌పీసీఎల్ చమురు, డీజిల్ తరలించే పైపులైన్ కూడా ఉంది. స్టీల్‌ప్లాంట్‌లో భారీ స్థాయిలో గ్యాస్ వినియోగం జరుగుతోంది. హెచ్పీసీల్లోనూ గ్యాస్ పైపులైన్లు భారీస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవికాకుండా సుమారు 13 రకాల ఇండస్ట్రియల్ పార్కులు, ఎస్ఈజెడ్లు, ఉక్కు ఆథారిత కంపెనీలు గ్యాస్‌తో నడుస్తున్నాయి. ఇలా భారీ స్థాయిలో కంపెనీలు వందలాది పైపులైన్లు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఆయా కంపెనీలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. గతంలో స్టీల్‌ప్లాంట్‌లో అనేకసార్లు గ్యాస్ లీకై పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందారు. ఇటీవల గ్యాస్‌లీకై ఉక్కు ఎస్ఎంఎస్-2లో ఇద్దరు ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు. 1997లో హెచ్‌పీసీఎల్ గ్యాస్ అన్లోడింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో 60 మంది వరకు మత్యువాత పడ్డారు. 2013 ఆగస్టులో కూలింగ్ టవర్ కూలి 23మంది వరకు మృతి చెందారు. ఇలా నిత్యం ఏదొక కంపెనీలో గ్యాస్ ప్రమాదం జరుగుతూనే ఉంది. కంపెనీలు వేసిన గ్యాస్‌పైపులైన్లు ఇప్పుడు ప్రజలకు సైతం ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ఉన్నాయి. ఈ పైపులైన్లు నిర్మించి చాలా ఏళ్లు అవుతుండడంతో ఎక్కడ, ఎప్పుడు, ఏ పైపులైను లీకవుతుందోననే భయం వెన్నాడుతోంది. సింధియా, మల్కాపురం, గాజువాక ప్రాంతాల్లో వందలాది పైపులున్నాయి. ఇవి పాతపబడిపోయి గ్యాస్, చమురు లీకవుతున్నాయి. కంపెనీలు మాత్రం ఈ పైపులైన్ల భద్రతను పట్టించుకోవడంలేదు. వాస్తవానికి గ్యాస్‌పైపులైన్ల వెంబడి నిత్యం కంపెనీల సిబ్బంది పహారా కాయాలి. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా తక్షణమే అప్రమత్తమై స్పందించాలి. కానీ ఇది జరగడం లేదు. పారిశ్రామిక ప్రాంతంలో ఖాళీగా ఉన్న వందలాది ఎకరాల్లో విస్తరించిన పైపులను ఏ కంపెనీ కూడా పట్టించుకోవడం లేదు. దీని వల్ల ఏ ప్రమాదం జరిగినా గ్యాస్ వాసన, రసాయనాల లీకు, అగ్ని ప్రమాదాల కారణంగా నగరవాసుల భద్రతకు ముప్పు పొంచి ఉంటుంది. గెయిల్, హెచ్‌సీపీఎల్ నగరం నుంచి హైదరాబాద్‌కు నిర్మించిన పైపులైన్లు అనేక గ్రామాల మీదుగా వెళ్తున్నాయి. వీటిపై తెలిసో తెలియకో స్థానికులు ఇళ్లు నిర్మిస్తున్నారు. చమురు కోసం దొంగలు వీటిని పగులగొట్టి ఇంధనం కాజేస్తున్నారు. ఇది ప్రమాదకరం. ఏ చిన్న నిప్పు అంటుకున్నా ఇవి పేలి రోజుల తరబడి మంటలు కొనసాగుతాయి. తూర్పుగోదావరి జిల్లా నగరం దుర్ఘటన నేపథ్యంలో మరోసారి ఆయా కంపెనీలు గ్యాస్, చమురు పైపులైన్ల భద్రతపై పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా అంతులేని నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. నగరానికి ఇంకో గ్యాస్ పైపులైన్ ఇప్పటికే గ్యాస్ పైపులైన్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరానికి మరో భారీ పైపులైను రాబోతోంది. కాకినాడ నుంచి విశాఖ వరకు గృహ, పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా పైపులైను వేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గరిష్టంగా 10 లక్షల మంది గృహ వినియోగదారులకు, 40 భారీ కంపెనీలు, 13 ఇండస్ట్రియల్ పార్కులు, ఎస్ఈజెడ్లకు నిరంతర గ్యాస్ అందించడానికి దీన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.