భూమి అట్టడుగు పొరల్లో దాగివున్న చమురు, సహజవాయు నిక్షేపాలను మొరటుగా, నిర్లక్ష్యంగా తోడేస్తున్న తీరు మరోసారి కోనసీమను విషాద సీమగా మార్చింది. 17 నిండుప్రాణాలను బలితీసుకుంది. మరెందరినో చావుబతుకుల్లోకి నెట్టింది. పచ్చటి ప్రకృతిని వల్లకాటిగా మార్చింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం వేకువజామున జరిగింది నిజానికి ప్రమాదం కాదు. ప్రమాదమంటే అనుకోకుండా ముంచుకొచ్చేది. అసంకల్పితం గా సంభవించేది. కోనసీమ నేలనుంచి నిత్యమూ పీల్చే చమురు, సహజవాయు నిక్షేపాలతో ఏటా వేల కోట్ల రూపాయలు గడిస్తున్న కంపెనీలకు...తమ పైప్‌లైన్లు ఎలాంటివో, వాటి నాణ్యత ఏపాటో తెలియదనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్లంతా పెద్ద చదువులు చదువుకున్నవారు. శాస్త్రవిజ్ఞానం ఉన్నవారు. ఆ అర్హతలతోనే సంస్థను నడుపుతున్నవారు. లక్షలకు లక్షలు జీతం అందుకుంటున్నవారు.
నిర్దిష్టమైన ఒత్తిడితో ఉబికి వచ్చే సహజవాయువైనా, చమురైనా పైప్‌లైన్‌ల గోడలపై ఎలాంటి ప్రభావం చూపగలవో...బయటి వాతా వరణం పైప్‌లైన్ల నాణ్యతను ఎలా దెబ్బతీయగలదో లెక్కలుగట్టడం రాకకాదు. ఆ లెక్కలతో పైప్‌లైన్లను ఎన్నేళ్లకోసారి మార్చాలో తెలియకకాదు. తెలిసీ ఉపేక్షించడం నేరం. తెలియలేదంటే అజ్ఞానం. ఈ రెండూ ఆ సంస్థల్లో కీలక స్థానాల్లో ఉండేవారిని అనర్హులుగా మార్చే అంశాలు. నిందితులుగా పరిగణించే అంశాలు. నగరం గ్రామ ప్రజలు ఏడాదినుంచి గ్యాస్ లీక్ గురించి ఫిర్యాదు చేస్తున్నారు. కానీ, అవేవీ గెయిల్ అధికారుల చెవికెక్కలేదు. జనమంటే లెక్కలేదు...జనం ప్రాణాలంటే వీసమెత్తు విలువలేదు...ఇక వారి అభ్యంతరాలకూ, నిరసనలకూ, కోపతాపాలకూ చోటెక్కడ? దుర్ఘటనకు రెండు రోజులముందు కూడా గ్యాస్ లీకవుతున్నచోట సిమెంటుతో పూడ్చారని స్థానికులు చెబుతున్నారు. అలా చేస్తే సరిపోతుందని నిర్ణయం తీసుకున్నవారు, అందుకు ఆమోదం తెలి పినవారు ఈ ఘటనలో దోషులే అవుతారు.
అయితే, జరుగుతున్న పరిణామాలను చూస్తే మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు ప్రారంభ మయ్యాయని అర్ధమవుతుంది. పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యంలేని ఒకరు ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పైప్‌లైన్ల నిర్వహణ చక్కగా ఉన్నదని కితాబునిచ్చారు. అంతేకాదు...గ్రామస్తుల నిర్లక్ష్యం కారణంగానే పైప్‌లైన్ పేలిందని భాష్యం చెప్పారు. బట్ట కాల్చి మీదేసే ఇలాంటి తత్వమే, బాధ్యతారాహిత్యమే, నిర్లక్ష్యమే నగరాన్ని బుగ్గి పాలు చేసింది. అసలు గ్యాస్ పైప్‌లైన్లను జనావాసాల మధ్యనుంచి, పంటపొలాల మధ్యనుంచి తీసుకెళ్లడమే నేరం. వీటిని తప్పిస్తూ తీసుకెళ్లడంవల్ల మరికొన్ని కిలోమీటర్ల నిడివిన పైప్‌లైన్‌లు వేయాల్సి రావొచ్చు. పర్యవసానంగా వ్యయం పెరగొచ్చు. అది మిగుల్చు కోవడానికి చేసిన ప్రయత్నం కోనసీమ జనావాసాలను ఇలాంటి విషాదాల్లోకి నెట్టేస్తున్నది. ఆ కంపెనీల కక్కుర్తి వేలాదిమంది ప్రజల ప్రాణాలను గాల్లో దీపంలా మారుస్తున్నది. గ్యాస్ తీసుకెళ్లే పైప్‌లైన్లన్నీ 20 ఏళ్లనాటివి. ఆ పైప్‌లు వేసేనాటికున్న సాంకేతిక విజ్ఞానం ఇప్పటికి ఎన్నో రెట్లు పెరిగింది. ఏ చిన్న లీకేజీనైనా పసిగట్టి హెచ్చరిక చేసే వ్యవస్థలూ వచ్చాయి. కానీ అడిగేవారెవరు? కనుకనే కోట్లాది రూపాయల వ్యయమయ్యే ఈ పనుల జోలికి వెళ్లడం వృథా అనుకున్నారు. ప్రమాదాలు అడపా దడపా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన రెండు దశాబ్దాలుగా నిత్యం ఏదో ఒకచోట చిన్నదో, పెద్దదో ఘటన సంభవిస్తూనే ఉన్నది. 1993, 1995ల్లో వచ్చిన బ్లో అవుట్‌లు కాక ఇప్పటికి అనేకానేకసార్లు గ్యాస్ లీక్ ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుమార్లు పైపులు పేలి పంట పొలాలు దెబ్బతిన్నాయి.
గ్యాస్ నిక్షేపాలున్నాయని తెలిశాక కోనసీమ బతుకుచిత్రం మారిపోయింది. ఎన్నడూ చూడని భారీ వాహనాలొచ్చి రహదార్లను ధ్వంసంచేశాయి. అత్యంత సున్నితమైన పర్యావరణం క్రమేపీ దెబ్బతింటున్నది. పర్యవసానంగా కొబ్బరి, వరి దిగుబడులు తగ్గుతు న్నాయి. ప్రజారోగ్యంపై ఇది కలగజేస్తున్న ప్రభావం ఏమిటో అధ్యయనం చేయాల్సే ఉన్నది. గ్యాస్‌ను వెలికితీస్తున్నకొద్దీ ఆ ఖాళీలోకి సముద్రపు నీరు వచ్చిచేరుతున్నది. అందువల్ల బావుల్లోకి ఉప్పునీటి ఊట ప్రవేశిస్తున్నది. గొంతు తడుపుకోవడానికి కూడా నీళ్లులేవని స్థాని కులు గగ్గోలు పెడుతున్నా అది అరణ్యరోదనే అవుతున్నది. ఇలా జల, వాయు కాలుష్యాలు పెరుగుతున్నా, తరచుగా ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటున్నా జిల్లాస్థాయిలో ఉండే విపత్తుల నివారణ సంస్థ నిమ్మకు నీరెత్తినట్టున్నది. నివేదికలు పంపాల్సిన స్థానిక రెవెన్యూ సిబ్బందికీ పట్టదు. వీరు చురుగ్గా ఉంటే ఇన్ని ప్రమాదాలు జరిగేవి కాదు. కేజీ బేసిన్‌నుంచి తరలిపోతున్న గ్యాస్, చమురు నిక్షేపాలవల్ల ఇంత నష్టం సంభవిస్తున్నా ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఆర్థిక ప్రయోజన మూ సమకూరడంలేదు.
సింగరేణి కాలరీస్‌లో ఉత్పత్తయ్యే బొగ్గులో తెలంగాణ రాష్ట్రానికి 50 శాతం వాటా ఇస్తుండగా ఆ సూత్రాన్నే గ్యాస్ కేటాయింపు విషయంలో ఎందుకు పాటించరని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంధించిన ప్రశ్న సహేతుకమైనదే. ఈ విష యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని అందరినీ కలుపుకొని రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు పోరాడాల్సిన అవసరం ఉన్నది. నగరం ఘటనలో బాధితులకు పరిహారం ఇవ్వడంతో సరిపెట్టక, సానుభూతి వాక్యాలతో చేతులు దులుపుకోక భోపాల్ గ్యాస్ లీక్ కేసు తరహాలో పైప్‌లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినవారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టాలి. అలాగైతేనే ఈ తరహా ఘటనలను నివారించడం సాధ్యమవుతుంది.
దారుణం, దుర్మార్గం
Published Sun, Jun 29 2014 12:30 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement