పైపులైన్ల పడగ
- విశాఖ చుట్టూగ్యాస్ పైపులైన్ల ఉచ్చు
- పదుల సంఖ్యలో గ్యాస్, చమురు కంపెనీలు
- తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ దుర్ఘటనతో కలవరం
- విశాఖవాసుల్లో వణుకు
విశాఖవాసులను గ్యాస్ ముప్పు కలవరపరుస్తోంది. నగరం చుట్టూ గ్యాస్ పైపులైన్లు ఉండడంతో ఏ క్షణాన ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో..ఏ పైపులైన్ లీకవుతుందోననే భయం వెన్నాడుతోంది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన గెయిల్ గ్యాస్ పైపులైను భారీ పేలుడు దుర్ఘటన నేపథ్యంలో నగరవాసుల్లో ఆందోళన మొదలయింది. నగరం చుట్టూ అత్యంత భారీ పైపులైన్లు పాతబడి ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పటికే నగరంలో హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీ, బీపీసీ టెర్మినల్ ప్లాంట్లు, గ్యాస్ కంపెనీలు భారీగా ఉన్నాయి. ఇవన్నీ నిత్యం గ్యాస్ లోడింగ్, అన్‌లోడింగ్‌తో ప్రమాద హేతువులుగా మారాయి.
సాక్షి, విశాఖపట్నం : నగరం నుంచి హైదరాబాద్‌కు గెయిల్ సంస్థ భారీ పైపులైన్ వేసింది. రోజుకు 2.5 లక్షల గ్యాస్ సిలెండర్లను నింపగలిగే సామర్థ్యం ఈ పైపులైన్ సొంతం. ఆ పక్కనే హెచ్‌పీసీఎల్ చమురు, డీజిల్ తరలించే పైపులైన్ కూడా ఉంది. స్టీల్‌ప్లాంట్‌లో భారీ స్థాయిలో గ్యాస్ వినియోగం జరుగుతోంది. హెచ్‌పీసీల్‌లోనూ గ్యాస్ పైపులైన్లు భారీస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవికాకుండా సుమారు 13 రకాల ఇండస్ట్రియల్ పార్కులు, ఎస్‌ఈజెడ్‌లు, ఉక్కు ఆథారిత కంపెనీలు గ్యాస్‌తో నడుస్తున్నాయి.
ఇలా భారీ స్థాయిలో కంపెనీలు వందలాది పైపులైన్లు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఆయా కంపెనీలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. గతంలో స్టీల్‌ప్లాంట్‌లో అనేకసార్లు గ్యాస్ లీకై పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందారు. ఇటీవల గ్యాస్‌లీకై ఉక్కు ఎస్‌ఎంఎస్-2లో ఇద్దరు ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు. 1997లో హెచ్‌పీసీఎల్ గ్యాస్ అన్‌లోడింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో 60 మంది వరకు మత్యువాత పడ్డారు.
2013 ఆగస్టులో కూలింగ్ టవర్ కూలి 23మంది వరకు మృతి చెందారు. ఇలా నిత్యం ఏదొక కంపెనీలో గ్యాస్ ప్రమాదం జరుగుతూనే ఉంది. కంపెనీలు వేసిన గ్యాస్‌పైపులైన్లు ఇప్పుడు ప్రజలకు సైతం ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ఉన్నాయి. ఈ పైపులైన్లు నిర్మించి చాలా ఏళ్లు అవుతుండడంతో ఎక్కడ, ఎప్పుడు, ఏ పైపులైను లీకవుతుందోననే భయం వెన్నాడుతోంది. సింధియా, మల్కాపురం, గాజువాక ప్రాంతాల్లో వందలాది పైపులున్నాయి. ఇవి పాతపబడిపోయి గ్యాస్, చమురు లీకవుతున్నాయి.
కంపెనీలు మాత్రం ఈ పైపులైన్ల భద్రతను పట్టించుకోవడంలేదు. వాస్తవానికి గ్యాస్‌పైపులైన్ల వెంబడి నిత్యం కంపెనీల సిబ్బంది పహారా కాయాలి. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా తక్షణమే అప్రమత్తమై స్పందించాలి. కానీ ఇది జరగడం లేదు. పారిశ్రామిక ప్రాంతంలో ఖాళీగా ఉన్న వందలాది ఎకరాల్లో విస్తరించిన పైపులను ఏ కంపెనీ కూడా పట్టించుకోవడం లేదు. దీని వల్ల ఏ ప్రమాదం జరిగినా గ్యాస్ వాసన, రసాయనాల లీకు, అగ్ని ప్రమాదాల కారణంగా నగరవాసుల భద్రతకు ముప్పు పొంచి ఉంటుంది.
గెయిల్, హెచ్‌సీపీఎల్ నగరం నుంచి హైదరాబాద్‌కు నిర్మించిన పైపులైన్లు అనేక గ్రామాల మీదుగా వెళ్తున్నాయి. వీటిపై తెలిసో తెలియకో స్థానికులు ఇళ్లు నిర్మిస్తున్నారు. చమురు కోసం దొంగలు వీటిని పగులగొట్టి ఇంధనం కాజేస్తున్నారు. ఇది ప్రమాదకరం. ఏ చిన్న నిప్పు అంటుకున్నా ఇవి పేలి రోజుల తరబడి మంటలు కొనసాగుతాయి. తూర్పుగోదావరి జిల్లా నగరం దుర్ఘటన నేపథ్యంలో మరోసారి ఆయా కంపెనీలు గ్యాస్, చమురు పైపులైన్ల భద్రతపై పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా అంతులేని నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది.
నగరానికి ఇంకో గ్యాస్ పైపులైన్
ఇప్పటికే గ్యాస్ పైపులైన్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరానికి మరో భారీ పైపులైను రాబోతోంది. కాకినాడ నుంచి విశాఖ వరకు గృహ, పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా పైపులైను వేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గరిష్టంగా 10 లక్షల మంది గృహ వినియోగదారులకు, 40 భారీ కంపెనీలు, 13 ఇండస్ట్రియల్ పార్కులు, ఎస్‌ఈజెడ్‌లకు నిరంతర గ్యాస్ అందించడానికి దీన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.