మామిడికుదురు(తూర్పుగోదావరి జిల్లా): గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటన నుంచి తేరుకోకముందే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్‌జీసీ గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) గ్రీన్‌బెల్ట్ ఏరియాలో స్వల్పంగా గ్యాస్ లీక్ అవడం స్థానికులను ఆదివారం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. రాజోలు మండలం పొన్నమండ-8 బావి నుంచి జీసీఎస్‌కు చమురు, సహజవాయు నిక్షేపాలను తరలించే పైపులైన్ నుంచి ఈ లీకేజీ జరిగింది. పొగ మాదిరిగా సహజవాయువుతోపాటు కొద్దిపాటి ముడిచమురు లీకవుతున్నట్టు స్థానికులు ఆదివారం సాయంత్రం గుర్తించారు.
పదిరోజులుగా ఇది కొనసాగుతున్నట్టు సమాచారం. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఓఎన్‌జీసీ వైఖరిని నిరసిస్తూ 216 జాతీయ రహదారిపై ఆదివారం ధర్నాకు దిగారు. అయితే ఉత్పత్తి నిలిపివేసిన బావి నుంచి లీకేజీ వస్తోందని, అయినప్పటికీ లీకేజీని ఆపేశామని ఓఎన్‌జీసీ అధికారులు చెప్పారు.