బ్లో అవుట్ దెబ్బకు 180 మెగావాట్ల విద్యుత్ ఫట్!
హైదరాబాద్:ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో గెయిల్ గ్యాసు బ్లో అవుట్ దెబ్బ కాస్తా విద్యుత్ ఉత్పత్తిపై పడింది. లీకేజీ అయిన గెయిల్ ప్రధాన ట్రంకు లైను నుంచి నేరుగా ల్యాంకో ప్లాంటుకు గ్యాసు సరఫరా అవుతోంది. ఈ ప్లాంటుకు ఇప్పటివరకు రోజుకు 0.72 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాసు (ఎంసీఎండీ) సరఫరా అయ్యేది. తాజా బ్లో అవుట్‌తో ఇది నిలిచిపోయింది. ఫలితంగా 140 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా జీవీకే, రిలయన్స్, ఆంధ్రప్రదేశ్ గ్యాసు పవర్ కంపెనీ (ఏపీజీపీసీఎల్), స్పెక్ట్రమ్... మొత్తం నాలుగు గ్యాసు ఆధారిత ప్లాంట్లకు ఇదే లైను ద్వారా కొద్ది మొత్తంలో గ్యాసు సరఫరా అవుతోంది. ఇది కూడా తాజా ఘటనతో నిలిచిపోయింది. ఫలితంగా మరో 40 మెగావాట్ల విద్యుత్ నష్టపోయినట్టు ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
అంటే గ్యాసు బ్లో అవుట్ దెబ్బకు మొత్తం 180 మెగావాట్ల విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు నష్టపోవాల్సి వచ్చింది. ఈ గ్యాసు ప్లాంట్లతో పీపీఏ అమలులో ఉన్నాయి. ఇందులో తెలంగాణ వాటా 97 మెగావాట్లు కాగా ఆంధ్రప్రదేశ్ వాటా 83 మెగావాట్లు.