Nagaram Explosion
-
నాడు డిమాండ్ చేశారు: నేడు ఆచరించారు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో ఎప్పుడూ ముందుంటారని మరోసారి రుజువైంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నగరం గ్యాస్ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా డిమాండ్ చేసిన ఆయన.. వైజాగ్ గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం అందించి ఆచరణలో పెట్టారు. ప్రతిపక్ష నేతగా ఉండగా.. 2014 జూన్ నెలలో తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం.. నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ పేలి పలువురు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించిన ఆయన దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఎంతమాత్రం సరిపోదని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే గెయిల్‌కు కానీ, ఓఎన్జీసీకి కానీ ఒంట్లో భయం పుట్టాలంటే కనీసం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ( ‘కోటి ఆర్థిక సాయం సామాన్య విషయం కాదు’) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. నగరం ప్రమాదం జరిగిన దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ గురువారం వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి దుర్ఘటనపై వెను వెంటనే స్పందించటమే కాకుండా.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తగిన విధంగా సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బాధితులను పరామర్శించి, మృతుల కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారందరికీ రూ.10 లక్షలు, బాధిత గ్రామాల్లోని 15 వేలమందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు, జంతు నష్టం జరిగిన వారిని ఆదుకుంటామని చెప్పారు. ఒక్కో జంతువుకు రూ.25 వేల నష్టపరిహారం, ఎల్జీ కంపెనీలో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. -
బ్లో అవుట్ దెబ్బకు 180 మెగావాట్ల విద్యుత్ ఫట్!
హైదరాబాద్:ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో గెయిల్ గ్యాసు బ్లో అవుట్ దెబ్బ కాస్తా విద్యుత్ ఉత్పత్తిపై పడింది. లీకేజీ అయిన గెయిల్ ప్రధాన ట్రంకు లైను నుంచి నేరుగా ల్యాంకో ప్లాంటుకు గ్యాసు సరఫరా అవుతోంది. ఈ ప్లాంటుకు ఇప్పటివరకు రోజుకు 0.72 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాసు (ఎంసీఎండీ) సరఫరా అయ్యేది. తాజా బ్లో అవుట్‌తో ఇది నిలిచిపోయింది. ఫలితంగా 140 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా జీవీకే, రిలయన్స్, ఆంధ్రప్రదేశ్ గ్యాసు పవర్ కంపెనీ (ఏపీజీపీసీఎల్), స్పెక్ట్రమ్... మొత్తం నాలుగు గ్యాసు ఆధారిత ప్లాంట్లకు ఇదే లైను ద్వారా కొద్ది మొత్తంలో గ్యాసు సరఫరా అవుతోంది. ఇది కూడా తాజా ఘటనతో నిలిచిపోయింది. ఫలితంగా మరో 40 మెగావాట్ల విద్యుత్ నష్టపోయినట్టు ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే గ్యాసు బ్లో అవుట్ దెబ్బకు మొత్తం 180 మెగావాట్ల విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు నష్టపోవాల్సి వచ్చింది. ఈ గ్యాసు ప్లాంట్లతో పీపీఏ అమలులో ఉన్నాయి. ఇందులో తెలంగాణ వాటా 97 మెగావాట్లు కాగా ఆంధ్రప్రదేశ్ వాటా 83 మెగావాట్లు. -
జీసీఎస్ గ్రీన్‌బెల్టులో స్వల్పంగా గ్యాస్ లీక్
మామిడికుదురు(తూర్పుగోదావరి జిల్లా): గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటన నుంచి తేరుకోకముందే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్జీసీ గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) గ్రీన్‌బెల్ట్ ఏరియాలో స్వల్పంగా గ్యాస్ లీక్ అవడం స్థానికులను ఆదివారం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. రాజోలు మండలం పొన్నమండ-8 బావి నుంచి జీసీఎస్‌కు చమురు, సహజవాయు నిక్షేపాలను తరలించే పైపులైన్ నుంచి ఈ లీకేజీ జరిగింది. పొగ మాదిరిగా సహజవాయువుతోపాటు కొద్దిపాటి ముడిచమురు లీకవుతున్నట్టు స్థానికులు ఆదివారం సాయంత్రం గుర్తించారు. పదిరోజులుగా ఇది కొనసాగుతున్నట్టు సమాచారం. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఓఎన్జీసీ వైఖరిని నిరసిస్తూ 216 జాతీయ రహదారిపై ఆదివారం ధర్నాకు దిగారు. అయితే ఉత్పత్తి నిలిపివేసిన బావి నుంచి లీకేజీ వస్తోందని, అయినప్పటికీ లీకేజీని ఆపేశామని ఓఎన్జీసీ అధికారులు చెప్పారు. -
కునుకు లేకుండా చేస్తున్న మరో పైపులైన్
మామిడికుదురు: ‘నగరం’ మహా విస్ఫోటం కళ్లముందు కదలాడుతుండడంతో.. గెయిల్ సంస్థ తమ ఊళ్ల నుంచి వేసిన గ్యాస్ పైపులైన్లు నగరం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తరచూ అవి లీకవుతూ ఉండడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని తాటిపాక-కాకినాడ ట్రంక్ పైపులైన్ తరచూ మరమ్మతులకు గురవడం స్థానికులను భయానికి గురి చేస్తోంది. ఈ లైన్ వెళ్తున్న పాశర్లపూడిలో పైపులైన్లకు వారం రోజుల వ్యవధిలో కేవలం 500 మీటర్ల పరిధిలోనే ఆరుచోట్ల మరమ్మతులు చేశారు. భూమికి అయిదున్నర అడుగుల లోతులో ఏర్పాటు చేసిన 18 అంగుళాల పైపులైన్ల ద్వారా నిత్యం ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల సహజ వాయువు సరఫరా చేస్తున్నారు. నగరం నుంచి కాకినాడ వరకూ ఒకటి, తాటిపాక నుంచి సామర్లకోట వరకూ మరొకటి ఈ పైపులైన్లు ఉన్నాయి. ఈ లైన్లలో ఎక్కడ లీకేజీలున్నా దానిని గుర్తించే యూనిట్ తాటిపాక టెర్మినల్‌లో ఉంది. ఆ పైపులు తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, భారీ విధ్వంసానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. విజయవాడ ల్యాంకో ప్రాజెక్టుకు గ్యాస్ సరఫరా చేస్తున్న ఈ పైపులైన్ కంట్రోల్ యూనిట్ వాల్వ్ 10 కిలో మీటర్ల దూరంలోని దిండి గ్రామంలో ఉంది. ప్రమాద సమయానికి అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగి అందుబాటులో లేకపోవడమే విస్ఫోటానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ లీక్‌పై ఆందోళన రాజోలు మండలం పొన్నమండ-8 బావి నుంచి జీసీఎస్‌కు చమురు, సహజవాయు నిక్షేపాలను తరలించే పైపులైన్ నుంచి లీకేజీ జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఓఎన్జీసీ వైఖరిని నిరసిస్తూ ఆదివారం ధర్నాకు దిగారు. అయితే ఉత్పత్తి నిలిపివేసిన బావి నుంచి లీకేజీ వస్తోందని, దీనివల్ల ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. -
నగరంలో 'సీఎం డౌన్ డౌన్.. చంద్రబాబు గో బ్యాక్'
నగరం: తూర్పు గోదావరి జిల్లా నగరం దుర్ఘటన స్థలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. పలుమార్లు ప్రభుత్వానికి, అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించకోకపోవడంపై స్ధానికులు, బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తన పర్యటన రద్దు చేసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో ప్రభుత్వానికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. 'సీఎం డౌన్ డౌన్', 'చంద్రబాబు గోబ్యాక్' అంటూ చేసిన నినాదాలు చేయడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులను బుజ్జగించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్డంతో అక్కడ కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.