అక్టోబర్‌కు ముందే గ్యాస్ రేటుపై నిర్ణయం
న్యూఢిల్లీ: సహజ వాయువు (నాచురల్ గ్యాస్) ధరల సవరణ అంశంపై అక్టోబర్ 1 కన్నా ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తెలిపారు. పరిశ్రమ వర్గాలు, నిపుణులతో చర్చించేందుకే ఈ అంశాన్ని గతంలో వాయిదా వేసినట్లు వివరించారు. ప్రతిపాదిత రంగరాజన్ ఫార్ములాలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వీటిని సరిచేస్తామన్నారు.
ప్రస్తుతం యూనిట్‌కి 4.2 డాలర్లుగా ఉన్న గ్యాస్ ధర.. రంగరాజన్ ఫార్ములా అమలు చేస్తే రెట్టింపై దాదాపు 8.8 డాలర్లకు పెరుగుతుంది. ఫలితంగా గ్యాస్‌ను ముడిసరుకుగా ఉపయోగించే ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోనున్నాయి. గ్యాస్ ధర డాలర్ పెరిగితే ఎరువుల ఉత్పత్తి వ్యయం టన్నుకు రూ. 1,370, విద్యుత్ టారిఫ్‌లు యూనిట్‌కు 45 పైసల మేర పెరుగుతాయని అంచనా.
వంటగ్యాస్ రేటు పెంచం..
వంటగ్యాస్, కిరోసిన్ రేట్లను తక్షణమే పెంచే యోచనేదీ లేదని ప్రధాన్ స్పష్టం చేశారు. డీజిల్ రేటు ప్రతి నెలా లీటరుకు 50 పైసల మేర పెంపు కొనసాగుతుందన్నారు. డీజిల్ విక్రయాలపై ఆదాయ నష్టాలు పూర్తిగా భర్తీ అయిపోయిన తర్వాత పెట్రోల్ తరహాలోనే ఈ ఇంధనం రేట్లపై కూడా నియంత్రణ ఎత్తివేస్తామని ప్రధాన్ చెప్పారు.
కష్టాల్లో ఆర్థిక రంగం: రాజ్‌నాథ్
కాగా, లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత్ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. పరిస్థితి చక్కదిద్దడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇందుకు మరికొంత సమయం పడుతుందని వివరించారు.