
వచ్చే నెలాఖరులోగా గ్యాస్ ధరపై కొత్త ఫార్ములా: ప్రధాన్
న్యూఢిల్లీ: గ్యాస్ ధరపై ప్రభుత్వం తన కొత్త ఫార్ములాను వచ్చేనెలాఖరులోగా ప్రకటించనుంది. పెటుబడి దారుల ప్రయోజనాలను, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫార్ములా ప్రకటిస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో చెప్పారు. గ్యాస్ ధరపై గతంలో యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన రంగరాజన్ ఫార్ములాకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేయలేదని చెప్పారు.
రంగరాజన్ ఫార్ములా ప్రకారం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(బీటీయూ) పరిమాణంలోని గ్యాస్ ధర రెట్టింపై 8.4 అమెరికన్ డాలర్లకు పెరిగి ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి రంగరాజన్ ఫార్ములా అమలు కావలసి ఉండగా, ఎన్నికల ప్రకటనతో 3 నెలలు వాయిదా పడింది. గ్యాస్ ధరపై సమగ్ర సమీక్ష జరగాలన్న కారణంతో ఎన్డీఏ ప్రభుత్వం గత జూన్ 25న మరో మూడునెలలపాటు ఫార్ములాను వాయిదా వేసింది.