గ్యాస్ ధరపై జీఎస్‌పీసీ అసంతృప్తి
న్యూఢిల్లీ: మోదీ సర్కారు నిర్ణయించిన సహజవాయువు ధరపై గుజరాత్ ప్రభుత్వానికి చెందిన గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్(జీఎస్‌పీసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. కేజీ బేసిన్‌లో ఉత్పత్తి చేసే గ్యాస్‌కు మార్కెట్ ధర కావాలని డిమాండ్ చేసింది. ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకు గ్యాస్‌ను అమ్మాలంటూ ఒత్తిడి చేయడం సరికాదని చమురు శాఖకు రాసిన లేఖలో జీఎస్‌పీసీ పేర్కొంది.
మార్కెట్ ధర కల్పిస్తే.. ఇక్కడున్న తమ దీన్‌దయాల్ వెస్ట్(డీడీడబ్ల్యూ) క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు కూడా లేఖలో తెలిపింది. తద్వారా కొత్త ధరల విధానంపై తొలిసారి అసంతృప్తి గళం వినిపించినట్లయింది. దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు ధరను ఇప్పుడున్న 4.2 డాలర్ల(ఒక్కో యూనిట్‌కు) నుంచి 5.61 డాలర్లకు పెంచుతూ కేంద్రం గత నెల 18న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గత యూపీఏ సర్కారు రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం గ్యాస్ రేటును రెట్టింపు చేయగా(8.4 డాలర్లు).. దీన్ని సమీక్షించిన మోదీ ప్రభుత్వం రేటును 33 శాతం మాత్రమే పెంచడం గమనార్హం.